Montreal Olympics
-
14 ఏళ్ల వయసులో 10కి 10
1976 మాంట్రియల్ ఒలింపిక్స్... 14 ఏళ్ల చిన్నారి.. జిమ్నాస్టిక్స్‌లో మెరుపులు మెరిపిస్తోంది. పోటీ ముగిసేసరికి చూస్తున్నవాళ్లకు ఎవరికీ నోట మాటలేదు. కారణం అప్పటివరకూ ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని 10కి 10 పాయింట్లు ఓ చిన్నపిల్ల సాధించడమే. ఈ ఘనత సాధించిన రొమేనియా క్రీడాదిగ్గజం నాడియా కొమనెసి. రొమేనియాలోని ఒనెస్తి నాడియా జన్మస్థలం. ఆమె తల్లి స్టెఫానియా. తను గర్భవతిగా ఉన్న సమయంలో ఓ రష్యా సినిమా చూసింది. దాంట్లోని కథానాయిక పేరు నాడ్యా. ఆ పేరుపై మమకారం పెంచుకున్న ఆమె తన కూతురుకి కూడా ఆ పేరును స్ఫురణకు తెచ్చేలా నాడియా అనే పిలుచుకుంది. కిండర్‌గార్టెన్ నుంచే నాడియా జిమ్నాస్టిక్స్‌లో ఓనమాలు నేర్చుకుంది. ఆరేళ్ల వయస్సులో తన స్నేహితురాలితో కలిసి స్కూల్ యార్డ్‌లో కార్ట్‌వీల్స్ (చేతులను భూమికి ఆనించి కాళ్లు పైకి లేపి తిరిగి మరోవైపు లేవడం) చేస్తుండగా ప్రఖ్యాత కోచ్ కరోలి గమనించారు. సహజ నైపుణ్యానికి తోడు కోచ్ మెళకువలతో చిన్నారి నాడియా మరింత రాటుదేలింది. 1969లో ఎనిమిదేళ్ల నాడియా రొమేనియా జాతీయ చాంపియన్‌షిప్‌లో పాల్గొని 13వ స్థానంలో నిలిచింది. ఈ సంఖ్య అశుభమని, మరోసారి ఆ స్థానం తెచ్చుకోకూడదని కోచ్ తనకు ఓ బొమ్మను బహూకరించారు. దాన్ని చూసినప్పుడల్లా తాను చెప్పిన విషయం గుర్తుకురావాలని కోచ్ భావన. మరోసారి నాడియాకు ఆ అవసరం రాలేదు. 1971లో అంతర్జాతీయ అరంగేట్రం టీనేజ్ దశలోనే జిమ్నాస్టిక్స్‌లో సంచలనాలు సృష్టిస్తుండడంతో సహజంగానే నాడియా అంతర్జాతీయ స్థాయి పోటీలవైపు వడివడిగా దూసుకెళ్లింది. 1975లో తను అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించగలిగింది. ఆ ఏడాది నార్వేలో జరిగిన యూరోపియన్ చాంపియన్ షిప్‌ను దాదాపు క్లీన్‌స్వీప్ చేసింది. ‘మాంట్రియల్’తో ఎనలేని పేరు 14 ఏళ్ల వయస్సులోనే కావల్సినంత క్రీడానుభవంతో పాటు పేరు ప్రఖ్యాతులను కూడా సంపాదించుకోవడంతో ఈ ఒలింపిక్స్‌లో నాడియా పేరు మార్మోగిపోయింది. అందరికీ తను హాట్ ఫేవరెట్‌గా మారింది. అంత చిన్న వయస్సులో తనపై ఉన్న ఒత్తిడిని జయించగలుగుతుందా? అనేది అందరి ఆలోచన. అయితే అంచనాల గురించి ఏమాత్రం ఆలోచించకుండా బరిలోకి దిగిన నాడియా తొలి రోజు జరిగిన అన్ఈవెన్ బార్స్ (వివిధ ఎత్తులో ఎదురెదురుగా ఉన్న రెండు ఇనుప బార్లు) ఈవెంట్లో దిమ్మ తిరిగే ఫలితాన్ని సాధించింది. పదికి పది పాయింట్లు సాధించి చూసేవాళ్లకు ఇది కలా నిజమా అనే అనుభూతిని కలిగించింది. ఎందుకంటే అప్పటిదాకా ఆధునిక ఒలింపిక్స్‌లో ఎవరూ ఇలాంటి స్కోరును సాధించలేదు. అంతెందుకు ఒలింపిక్స్ స్కోరు బోర్డును తయారుచేసే ఒమెగా సంస్థ వారు కూడా జిమ్నాస్టిక్స్‌లో నాలుగు అంకెల బోర్డు అవసరమా? అనుకుని మూడంకెల బోర్డునే సిద్ధం చేశారు. దీంతో నాడియా పది పాయింట్ల స్కోరును 1.00గా బోర్డు చూపించింది. ప్రేక్షకులు మొదట అయోమయంలో పడినా ఆ తర్వాత అర్థం చేసుకుని నిలబడి హర్షధ్వానాలు చేశారు. తనపై ఉన్న అంచనాలకు తగ్గట్టుగానే కెరీర్లో ముందుకెళ్లిన తను 1981లో జిమ్నాస్టిక్స్‌కు ముగింపు పలికింది. ప్రస్తుతం 56 సంవత్సరాల నాడియా స్వదేశంలో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటోంది. -
ఆగితే చస్తావ్...
1976 మాంట్రియల్ ఒలింపిక్స్ జరుగుతున్న సమయం... బేబీ డాక్‌గా ప్రసిద్ధుడైన నియంత జీన్ క్లాడ్ డువలియర్ అప్పటికే హైతీ దేశాన్ని ఐదేళ్లుగా తన చెప్పుచేతల్లో పెట్టుకుని పాలిస్తున్నాడు. నియంత పాలన ఎలా ఉంటుందో జనాలకు కళ్లకు కట్టినట్లుగా చూపిస్తున్న డువలియర్... ఒలింపిక్స్‌లో పాల్గొనే జట్టును ఎంపిక చేసే బాధ్యతను కూడా తనే తీసుకున్నాడు. తన సన్నిహితులతో కలిసి చాలా మందిని వడపోసి చివరకు 13 మంది క్రీడాకారులను ఎంపిక చేశాడు. ఇందులో పది మంది అథ్లెట్లు, ముగ్గురు బాక్సర్లు ఉన్నారు. వీళ్లతో పాటు తన స్నేహితుల్లో కొంత మందిని కూడా పోటీలకు పంపాడు. అప్పటిదాకా జరిగిన 12 ఈవెంట్లలో ఏ ఒక్కరూ గెలవలేకపోయారు. దీంతో అంతర్జాతీయ వేదికపై అవమానం జరి గిందనే కోపం, అసహనం, ఆవేశంతో డువలియర్ ఊగిపోతున్నాడు. ఇక మిగిలింది ఒకే ఒక్క ఈవెంట్ 5 వేల మీటర్ల పరుగు. బతుకు భయంతో... డ్యూడన్ లామోత్... హైతీ తరఫున హీట్స్‌లో పాల్గొంటున్న అథ్లెట్. తమ అథ్లెట్లందరూ ఓటమిపాలు కావడంతో అతనిలో ఏదో తెలియని భయం. గెలుపును పక్కనబెడితే కనీసం రేసునైనా పూర్తి చేస్తానో లేదోనని ఆందోళన. గన్ పేలింది... రేసు మొదలైంది. అథ్లెట్లు వేగం పుంజుకుంటున్నారు. కానీ లామోత్ మాత్రం సెకన్, సెకన్‌కు వెనుకబడిపోతున్నాడు. ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చొన్న డువలియర్లో క్షణక్షణానికి అసహనం పెరిగిపోతోంది. గ్యాలరీ వైపే చూస్తూ పరిగెడుతున్న లామోత్ ముఖంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ఓ దశలో రేసును ఆపేయాలని నిశ్చయించుకున్నాడు. కానీ ‘రేసు పూర్తి చేయకపోతే ఉరితీస్తానని’ డువిలియర్ చేసిన సైగతో లామోత్ ప్రాణం గాలిలో కలిసిపోయినట్లయింది (నిజానికి ఈవెంట్‌కు ముందే ఆ హెచ్చరిక జారీ చేసినట్లు కూడా కొందరు చెబుతారు). అంతే ఊపిరి బిగపట్టి, కండరాలు మెలిపెట్టి... అడుగు తీసి అడుగు వేయలేక... సగం దూరం కూడా పూర్తి చేయని రేసును బతుకు జీవుడా అంటూ 18 నిమిషాల 50.07 సెకన్లలో పూర్తి చేశాడు. ఒలింపిక్స్ చరిత్రలో ఇది అత్యంత చెత్త రికార్డు. 14 మంది పాల్గొన్న హీట్స్‌లో 13వ స్థానంలో నిలిచిన అతనికి, 12వ స్థానంలో నిలిచిన అథ్లెట్ (13ని. 43.89 సెకన్లు)కు ఏకంగా 5 నిమిషాల తేడా ఉంది. ఒక నియంత పరువు కోసం భయంతో పరుగెత్తిన అథ్లెట్ తన కెరీర్లో చెరగని చెత్త రికార్డు నెలకొల్పినా ప్రాణాలను మాత్రం నిలబెట్టుకోగలిగాడు.