పొత్తి కడుపులో డ్రగ్స్
శంషాబాద్ ఎయిర్‌పోర్టులో పట్టుబడిన మహిళ
గర్భిణిలా నటిస్తూ అధికారులకు చిక్కిన మూసా
కడుపులో మొత్తం 6 ప్యాకెట్లు.. విలువ రూ.50 లక్షలు
జననేంద్రియాల ద్వారా చొప్పించుకున్న మహిళ
ఉస్మానియా ఆసుపత్రికి తరలించిన అధికారులు
ఒక ప్యాకెట్ వెలికితీత.. మిగతా వాటిని తీసేందుకు శస్త్రచికిత్స!
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్టు.. ఆదివారం ఉదయం.. అమెరికా నుంచి దుబాయ్ మీదుగా ఎమిరేట్స్ విమానం వచ్చింది.. ప్రయాణికులు ఒక్కొక్కరుగా వస్తున్నారు.. వారిలో ఓ మహిళ గర్భవతిలా నెమ్మదిగా నడుస్తోంది.. కస్టమ్స్ చెకింగ్ పాయింట్ వరకు వచ్చింది.. అప్పటిదాకా అధికారులూ ఆమె గర్భవతే అని నమ్మారు. కానీ అనుమానం వచ్చి క్షుణ్ణంగా తనిఖీ చేసి నోళ్లు వెళ్లబెట్టారు! ఆమె పొత్తి కడుపులో డ్రగ్స్!! ఒకటి కాదు రెండు కాదు ఆరు ప్యాకెట్లు. వాటన్నింటినీ యోని, మలద్వారం గుండా చొప్పించుకొని అధికారుల కన్నుగప్పేందుకు యత్నించి దొరికిపోయింది. దక్షిణాఫ్రికాకు చెందిన ఆ మహిళ పేరు మూసియా మూసా(32). ఆ డ్రగ్స్ విలువ రూ. 50 లక్షల దాకా ఉంటుందని చెబుతున్నారు. వైద్యులు ఒక ప్యాకెట్‌ను వెలికితీశారు. మిగతా ప్యాకెట్లు సహజంగా వస్తే సరి.. లేదంటే ఆపరేషన్ చేసి తీయాలంటున్నారు డాక్టర్లు.
మూసా వచ్చిందిలా..
మూసా ఇటీవల తన దేశం నుంచి దుబాయ్ మీదుగా బ్రెజిల్ వెళ్లింది. అక్కడ్నుంచి దుబాయ్ వచ్చింది. శనివారం రాత్రి ఎమిరేట్స్ విమానం ఎక్కి ఆదివారం ఉదయం శంషాబాద్ విమానాశ్రయంలో దిగింది. అప్పటికే దుబాయ్ నుంచి అందిన సమాచారం మేరకు ఢిల్లీ కస్టమ్స్ అధికారులు శంషాబాద్ విమానశ్రయం కస్టమ్స్ ఆఫీసర్లకు సమాచారమిచ్చారు. విమానం దిగగానే గర్భిణిలా నటిస్తూ నడుచుకుంటూ వస్తున్న ఆమెను తనిఖీ చేశారు. పొత్తికడుపు కింది భాగంలో డ్రగ్ ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించి వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్ డ్రగ్స్ బ్యూరోకు సమాచారం అందించారు. అనంతరం మూసాను ఉస్మానియా ఆసుపత్రి తరలించారు.
ఒక్కో క్యాప్సూల్ 3 అంగుళాల పొడవు
మూసాను మధ్యాహ్నం 1.30 గంటలకు ఉస్మానియా ఆస్పత్రి అత్యవసర విభాగానికి తీసుకొచ్చారు. వైద్యులు తొలుత ఆమెకు సీటీ స్కాన్, ఆ తర్వాతా ఎండోస్కోపీ చేశారు. కడుపులో ఆరు ప్యాకెట్ల మాదక ద్రవ్యాలున్నట్లు గుర్తించారు. వీటిని జననేంద్రియం, మలద్వారం నుంచి పొత్తి కడుపులోకి ప్రవేశపెట్టినట్లు గుర్తించారు. ఆదివారం సెలవు రోజు కావడంతో ఆస్పత్రిలో సీనియర్ వైద్యులు అందుబాటులో లేకపోవడంతో డ్యూటీలో ఉన్న వైద్యులే పొత్తి కడుపులో ఉన్న ఒక ప్యాకెట్‌ను బయటికి తీశారు. మిగిలిన ప్యాకెట్లు తీయడం సాధ్యం కాకపోవడంతో సర్జికల్ వార్డుకు తరలించారు.
రాత్రి ఏడు గంటలకు ‘ఎనిమా’ ఇచ్చారు. దాంతో మలద్వారం నుంచి 16-20 (క్యాప్సూల్స్ రూపంలో ఉన్నవి) డ్రగ్స్ బయట పడ్డాయి. ఒక్కో క్యాప్సూల్ ఒక అంగుళం మందం నుంచి మూడు అంగుళాల పొడవు ఉన్నట్లు గుర్తించారు. డ్రగ్స్ ప్యాకెట్లు సహజంగా బయటకు రాకుంటే పొత్తికడుపు కింది భాగంలో శస్త్రచికిత్స చేసి వెలికి తీయాల్సి ఉంటుందని వైద్యులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమెకు ఎలాంటి ప్రమాదం లేదని, ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ డ్రగ్స్ ప్యాకెట్లను కొకైన్‌గా అనుమానిస్తున్నారు.