అమ్మాయిలే ఎక్కువ ఎడిక్ట్ అవుతున్నారట
సియోల్: ఇంటర్నెట్ అందరికి అందుబాటులోకి రావడం, టెక్నాలజీలో విప్లవాత్మక మార్పుల వల్ల స్మార్ట్‌ఫోన్స్ వాడుతున్న వారి సంఖ్య క్రమేణా పెరుగుతోంది. చిన్నా పెద్దా, అమ్మాయిలు, అబ్బాయిలు అన్న తేడా లేకుండా వీటిని ఉపయోగించడానికి మక్కువ చూపుతున్నారు. కాగా అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలే ఎక్కువగా స్మార్ట్ ఫోన్లకు ఎడిక్ట్ అవుతున్నారట. అమ్మాయిలే ఎక్కువ సమయం వీటిని ఉపయోగిస్తున్నారని ఓ సర్వేలో తేలింది.
52 శాతం మంది అమ్మాయిలు ప్రతి రోజు నాలుగు గంటలు లేదా అంతకంటే ఎక్కువ సయమం స్మార్ట్ ఫోన్లతో గడుపుతున్నారని దక్షిణ కొరియాలో చేసిన ఓ సర్వేలో వెల్లడైంది. అదే అబ్బాయిల విషయానికి వస్తే 29.4 శాతం మంది ఉన్నారు. ఇక రోజుకు ఆరుగంటలకు పైగా స్మార్ట్ ఫోన్లను వాడే అమ్మాయిల శాతం 22.9 శాతం ఉండగా, అబ్బాయిలు 10.8 శాతం మంది ఉన్నారు.
1236 మంది కాలేజీ విద్యార్థులపై సర్వే చేసినట్టు అజో యూనివర్శిటీ ప్రొఫెసర్ చాంగ్ జే-యోన్ చెప్పారు. అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా స్మార్ట్ ఫోన్లతో కాలక్షేపం చేస్తున్నట్టు తెలిపారు. అమ్మాయిలు స్మార్ట్ ఫోన్లను ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సైట్లతో పాటు ఇంటర్నెట్, గేమ్స్, ఫోన్ కాల్స్ కోసం వినియోగిస్తారని చెప్పారు. అబ్బాయిలు ఒంటరిగా ఉన్నప్పుడు స్మార్ట్ ఫోన్లను ఎక్కువగా వాడితే, అమ్మాయిలు ప్రయాణంలోను, ఫ్రెండ్స్‌తో మాట్లాడుతున్నప్పుడు కూడా ఉపయోగిస్తారని సర్వేలో తేలింది. స్మార్ట్ ఫోన్లను వాడటం అమ్మాయిలకు హాబీగా మారుతోందని, దీనివల్ల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశముందని చాంగ్ చెప్పారు.