mortgages
-
ఎస్బీఐకి అదానీ అదనపు షేర్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ వద్ద అదానీ గ్రూప్ తాజాగా అదనపు షేర్లను తనఖాలో ఉంచింది. జాబితాలో అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, అదానీ ట్రాన్స్మిషన్, అదానీ గ్రీన్ ఎనర్జీ చేరాయి. బ్యాంకుకు చెందిన ఎస్బీఐ క్యాప్ ట్రస్టీవద్ద దాదాపు 75 లక్షల షేర్లను అదానీ పోర్ట్స్, 60 లక్షల షేర్లను అదానీ గ్రీన్, 13 లక్షల షేర్లను అదానీ ట్రాన్స్మిషన్ ప్లెడ్జ్ చేశాయి. దీంతో ఎస్బీఐ క్యాప్ ట్రస్టీవద్ద అదానీ పోర్ట్స్ ఈక్విటీలో మొత్తం 1 శాతం, అదానీ గ్రీన్ నుంచి 1.06 శాతం, అదానీ ట్రాన్స్మిషన్కు చెందిన 0.55 శాతం వాటాను తనఖాలో ఉంచినట్లు తెలుస్తోంది. 30 కోట్ల డాలర్ల లెటర్ ఆఫ్ క్రెడిట్లో భాగంగా అదనపు షేర్లను అదానీ గ్రూప్ ఎస్బీఐ క్యాప్‌వద్ద ఉంచినట్లు ఎక్సే్ఛంజీల ఫైలింగ్ వెల్లడించింది. తద్వారా ఆస్ట్రేలియాలోని కార్మిచేల్ కోల్ మైనింగ్ ప్రాజెక్టు కోసం ఎస్బీఐ చెల్లింపుల గ్యారంటీని ఇచ్చినట్లు తెలుస్తోంది. -
చిన్న సంస్థలకు గోద్రెజ్ క్యాపిటల్ రుణాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గోద్రెజ్ గ్రూప్ సంస్థ గోద్రెజ్ క్యాపిటల్ .. చిన్న, మధ్య తరహా (ఎస్ఎంఈ) సంస్థలకు ప్రాపర్టీ తనఖా రుణాలపై (ఎల్ఏపీ) మరింతగా దృష్టి పెడుతోంది. తాజాగా హైదరాబాద్‌లోనూ కార్యకలాపాలు ప్రారంభించింది. హైదరాబాద్ ప్రాంతంలో ఎల్ఏపీ మార్కెట్ విలువ దాదాపు రూ. 700 కోట్లుగా ఉంటుందని ఈ సందర్భంగా కంపెనీ ఎండీ మనీష్ షా వెల్లడించారు. వచ్చే 18 నెలల్లో ఇందులో కనీసం 10 శాతం వాటా దక్కించుకోవాలని భావిస్తున్నట్లు వివరించారు. త్వరలో ఎస్ఎంఈలకు అన్సెక్యూర్డ్ రుణాల విభాగంలోకి కూడా అడుగుపెట్టనున్నట్లు ఆయన చెప్పారు. ఎస్ఎంఈల వ్యాపార నిర్వహణ అవసరాలు విభిన్నంగా ఉంటాయని, అందుకు అనుగుణంగా అవి తమ వెసులుబాటును బట్టి మరీ భారం పడకుండా ఈఎంఐలను ఎంచుకునే విధానం, పాతికేళ్ల వరకూ కాలపరిమితి మొదలైన ఆప్షన్లు అందిస్తున్నట్లు మనీష్ షా తెలిపారు. 2020 నవంబర్‌లో కార్యకలాపాలు ప్రారంభించిన తమ సంస్థ ప్రస్తుతం హైదరాబాద్ సహా 11 నగరాలకు విస్తరించిందని చెప్పారు. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పటికీ రుణాలకు డిమాండ్‌పై ప్రతికూల ప్రభావమేదీ పెద్దగా కనిపించడం లేదని షా తెలిపారు. హౌసింగ్ ఫైనాన్స్ వ్యాపార విభాగం ద్వారా గృహ రుణాలు, గోద్రెజ్ ఫైనాన్స్ విభాగం ద్వారా ఎల్ఏపీ రుణాలు అందిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎల్ఏపీ కార్యకలాపాలు మాత్రమే ప్రారంభించినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకూ రూ. 3,500 కోట్ల పైచిలుకు రుణాలు మంజూరు చేశామని ఇందులో రూ. 2,500 కోట్ల మేర గృహ రుణాలు, మిగతావి ఎల్ఏపీ ఉన్నాయని షా వివరించారు. రుణ మొత్తాన్ని 2024 మార్చి నాటికి రూ. 12,000 కోట్లకు, 2026 కల్లా రూ. 30,000 కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు పేర్కొన్నారు. -
మంగళ సూత్రం తాకట్టుపెట్టి...
బీహార్ః ప్రతిఇంట్లో మరుగుదొడ్లు ఉండాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే వాటి నిర్మాణానికి ప్రభుత్వం ఎన్ని పథకాలు ప్రవేశ పెట్టినా.. సబ్సిడీలు ఇచ్చినా చాలా ప్రాంతాల్లో ఆచరణలోకి మాత్రం రావడం లేదు. అయితే బీహార్ కు చెందిన ఓ మహిళ మాత్రం.. మరుగుదొడ్డి సమస్యను అధిగమించేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. నిర్మాణానికి అయ్యే ఖర్చుకోసం ఏకంగా మంగళ సూత్రాలు తాకట్టు పెట్టేసింది. భర్త అవసరాలకో, కూతుళ్ళ పెళ్ళిళ్ళకో బంగారం, వెండి, నగలు అమ్మకాలు జరపడం, తాకట్టు పెట్టడం చాలా కుటుంబాల్లో జరుగుతుంటుంది. అయితే బీహార్ లోని రోటాస్ జిల్లా, బరఖన్నా గ్రామానికి చెందిన ఫుల్ కుమారి మాత్రం.. టాయిలెట్ నిర్మాణానికి వినూత్న నిర్ణయం తీసుకుంది. ఇంట్లో డబ్బు ఇబ్బందులతో సమస్యగా మారిన మరుగుదొడ్డి నిర్మాణం చేపట్టేందుకు మంగళ సూత్రాలను తాకట్టు పెట్టేసి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఇంట్లోనివారు ఆమె నిర్ణయాన్ని వ్యతిరేకించినా.. జిల్లా అధికారులు మాత్రం ఆమెను ఎంతో అభినందించడంతోపాటు.. ఆమెను ఏకంగా జిల్లా పారిశుద్ధ్య కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా చేసేందుకు నిర్ణయించారు. వ్యవసాయ కూలీ అయిన భర్త ఆదాయం అంతంతమాత్రంగా ఉండటంతో.. ఇంట్లో టాయిలెట్ నిర్మించుకోవడం కుమారి కుటుంబానికి ఎంతో కష్టసాధ్యమైంది. దీంతో తనవంతు సంపాదనకోసం స్థానిక ప్రైమరీ స్కూల్లో వంటమనిషిగా చేరిన కుమారి.. ఫలితం పెద్దగా లేకపోవడంతో సూత్రాలు తాకట్టు నిర్ణయం తీసుకున్నట్లు పంచాయితీ అధికారులు తెలిపారు. ఇంట్లోని మగవారు మంగళసూత్రాల తాకట్టుకు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారని, అయితే మరుగుదొడ్డి నిర్మాణానికి కావలసిన సొమ్ము కోసం కుమారి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. కాగా కుమారి భర్త, ఆమె మామగారు సమక్షంలోనే ఆమె ఇంట్లో టాయిలెట్ నిర్మాణ ప్రారంభోత్సవానికి ఇతర జిల్లా అధికారులతోపాటు తాను హాజరౌతున్నట్లు రోటాస్ జిల్లా మెజిస్ట్రేట్ అనిమేష్ కుమార్ పరాశర్ తెలిపారు. కేవలం పది రోజుల్లోగా నిర్మాణం పూర్తయ్యేట్లు చూస్తామని, జిల్లాలోనే ఇతరులకు ఎంతో స్ఫూర్తిగా నిలిచిన కుమారిని పారిశుద్ధ్య కార్యక్రమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తున్నట్లు పరాశర్ వెల్లడించారు.