MoS finance
-
ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయా? క్లారిటీ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం
Plastic Currency: దేశంలో ప్రస్తుతం చలామణిలో ఉన్న పేపర్ కరెన్సీ నోట్ల స్థానంలో ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయా? చాలా కాలంగా చర్చ సాగుతున్న ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈమేరకు పార్లమెంటులో ఎదురైన ఈ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖిత పూర్వక సమాధానమిచ్చారు. ప్లాస్టిక్ నోట్ల జారీకి సంబంధించి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. అయితే కరెన్సీ నోట్ల మన్నిక, నకిలీ నోట్లను అరికట్టడం నిరంతర ప్రక్రియ అని అన్నారు. అలాగే పేపర్ కరెన్సీ , ప్లాస్టిక్ నోట్లు ప్రింటింగ్ ఖర్చుపైనా పంకజ్ చౌదరి స్పందించారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) 2022-23 నివేదిక ప్రకారం.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో నోట్ల ముద్రణకు మొత్తం రూ. 4682.80 కోట్లు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. ప్లాస్టిక్ కరెన్సీ ముద్రణకు ఎలాంటి ఖర్చు చేయలేదని స్పష్టం చేశారు. ఇదీ చదవండి: అక్కడ మూతపడుతున్న బ్యాంకులు.. ఒక్క నెలలోనే 139 బ్రాంచ్‌లు క్లోజ్! కాగా ప్లాస్టిక్ నోట్లను తీసుకొచ్చే ఆలోచనను సెంట్రల్ బ్యాంక్ కొన్నేళ్ల కిందటే చేసింది. ఆర్బీఐ 2015-16 వార్షిక నివేదిక ప్రకారం.. రూ.10 ప్లాస్టిక్ నోట్లను విడుదల చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. సుమారు పది లక్షల నోట్లను కొచ్చి, మైసూర్, సిమ్లా, జైపూర్, భువనేశ్వర్ నగరాల్లో ప్రయోగాత్మకంగా విడుదల చేయాలని భావించారు. అయితే అధిక ఉష్ణోగ్రతల్లో ప్లాస్టిక్ నోట్లు అగ్నికి ఆహుతయ్యే ప్రమాదం ఉండటంతో ఆర్బీఐ ఈ ప్రాజెక్టును అటకెక్కించింది. -
మహిళా వ్యాపారవేత్తలకు రుణ పరిమితులు: కేంద్ర సహాయ మంత్రి
ముంబై: రుణాల పరంగా ఉన్న పరిమితులతో మహిళల ఆధ్వర్యంలో నడుస్తున్న సూక్ష్మ, చిన్న మధ్య తరహా వ్యాపారాలు (ఎంఎస్ఎంఈ) ప్రభావితమైనట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాడ్ తెలిపారు. వాణిజ్యం, పెట్టుబడులపై జీ20 వర్కింగ్ గ్రూప్ తొలి సమావేశాన్ని ప్రారంభించిన సందర్భంగా సహాయ మంత్రి మాట్లాడారు. (ఇదీ చదవండి: మీకీ విషయం తెలుసా? ఈ డెబిట్ కార్డ్‌పై: రూ. కోటి దాకా కవరేజ్) ఈ అసమాన భారాన్ని తగ్గించేందుకు అంతర్జాతీయ వాణిజ్య కమ్యూనిటీ ఉమ్మడి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల మధ్య అంతరం పెరిగిపోతుండడం పట్ల కరాడ్ ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా బలమైన, సమర్థవంతమైన సరఫరా వ్యవస్థల అవసరం ఉన్నట్టు చెప్పారు. ఆహారం, ఎరువులు, ఇంధనం, ఫార్మా వంటి ముఖ్యమైన రంగాల్లో జీ20 దేశాల మధ్య సహకారానికి పిలుపునిచ్చారు. (రెడ్మి 12సీ, రెడ్మి నోట్12 వచ్చేశాయ్! అందుబాటు ధరలే) -
చెట్టెక్కిన కేంద్ర మంత్రి.. ఎందుకో తెలుసా?
ఆయన స్వయానా కేంద్రంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి. అంతటి పెద్దమనిషి తన సొంత రాష్ట్రంలో.. తన సొంత నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పరిష్కరించడానికి చెట్టు ఎక్కాల్సి వచ్చింది. అదేంటి, మంత్రిగారు చెట్టు ఎక్కడం ఏంటని అనుకుంటున్నారా.. అయితే చదవండి. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సొంత రాష్ట్రం రాజస్థాన్. అక్కడ ఆయన నియోజకవర్గం బికనీర్. ఆ నియోజవకర్గం పరిధిలోని ఢోలియా అనే గ్రామంలో కొన్ని సమస్యలు ఉండటంతో వాటి పరిష్కారం కోసం ఆయన అక్కడకు వెళ్లారు. గ్రామంలోని ఆస్పత్రిలో నర్సులు తగినంతగా లేరని స్థానికులు ఆయనకు మొరపెట్టుకున్నారు. దాంతో సంబంధిత ఉన్నతాధికారికి వెంటనే ఫోన్ చేసి, సమస్యను పరిష్కరిద్దామని కేంద్రమంత్రి మేఘ్వాల్ అనుకున్నారు. అనుకున్నదే తడవుగా జేబులోంచి సెల్‌ఫోన్ తీశారు. కానీ తీరాచూస్తే అందులో సిగ్నల్ ఒక్క పాయింటు కూడా లేదు. ఇదేంటని అక్కడ ఉన్నవాళ్లను అడిగితే, ఈ గ్రామంలో సెల్‌ఫోన్ మాట్లాడాలంటే చెట్టు ఎక్కాల్సిందేనని చావుకబురు చల్లగా చెప్పారు. అదేంటని అడిగితే.. దగ్గరలో సెల్‌టవర్ లేదని, అందువల్ల చెట్టు ఎక్కితే దూరంగా ఉన్న టవర్ నుంచి సిగ్నల్ అందుతుందని వివరించారు. చేసేది లేక తాను కూడా చెట్టు ఎక్కడానికి మేఘ్వాల్ సిద్ధపడ్డారు. అయితే పెద్ద వయసు కావడంతో ఆయన కోసం వెంటనే అక్కడున్నవాళ్లు ఒక నిచ్చెన తెప్పించారు. దాని సాయంతో ఆయన చెట్టెక్కి, ఫోన్ మాట్లాడి అప్పుడు కిందకు వచ్చారు. అదీ కేంద్ర మంత్రి గారి చెట్టు కథ.