ఏజెన్సీ ప్రాంతాల్లో 5 లక్షల దోమ తెరలు
► పంపిణీ చేస్తామన్న వైద్య ఆరోగ్యమంత్రి లక్ష్మారెడ్డి
► 9 జిల్లాల కలెక్టర్లతో సీజనల్ వ్యాధులపై సమీక్ష
సాక్షి, హైదరాబాద్: సీజనల్ అంటు వ్యాధులపై అప్రమత్తంగా వ్యవహరించి, వాటి నివారణకు ప్రజల్లో చైతన్యం కలిగిం చాలని జిల్లా కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆ శాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆదేశించారు. వివిధ శాఖల సమన్వయంతో వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణ చర్యలు చేపట్టాలన్నారు. అందుకోసం ఏజెన్సీ ప్రాంతాల్లో ఉండే ప్రజలకు 5 లక్షల దోమ తెరలను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులపై ఏజెన్సీ ప్రాంతాలున్న తొమ్మిది జిల్లాల కలెక్టర్లు, అక్కడి వైద్యాధికారులతో బుధవారం మంత్రి లక్ష్మారెడ్డి సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతేడాది వర్షాకాల సీజన్ కంటే ముందే పలు ఏజెన్సీ ప్రాంతాలను పర్యటించి తీసుకున్న చర్యల వల్ల ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించామని, ఈ ఏడాది కూడా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో పంచాయతీరాజ్, మున్సిపాలిటీ, కార్పొరేషన్లు, ఐకేపీ, ఫిషరీస్ వంటి వివిధ విభాగాలతో వైద్య ఆరోగ్యశాఖ సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి అంటు వ్యాధుల నివారణకు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయా గ్రామాల సమస్యలను బట్టి క్షేత్ర స్థాయిలో క్లీనింగ్, స్ప్రేయింగ్ వంటి చర్యలతో దోమల నివారణకు నడుం బిగించాలన్నారు.
వచ్చే జూన్, జులై నెలల్లో ఈ కార్యక్రమాలు పూర్తి చేయాలని మంత్రి కలెక్టర్లను ఆదేశించారు. అవసరమైన మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచాలని నిర్ణయించా మన్నారు. అవసరమైన సిబ్బందిని కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ పద్ధతుల్లో కలెక్టర్లు నియమించుకోవచ్చన్నారు. బాలింతలకు అందించనున్న కేసీఆర్ కిట్‌ను మంత్రి ప్రదర్శించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ కిట్‌ను ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. ఈ సమీక్ష సమావేశంలో వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ వేణుగోపాల్‌రావు, భూపాలపల్లి, ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఖమ్మం, కొత్తగూడెం, భద్రాచలం, కుమ్రం భీమ్, మహబూబబాద్, నాగర్ కర్నూలు జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.