పేదల్లో మూడోవంతు భారత్లోనే!
ఐరాస సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల
తాజా నివేదిక వెల్లడి
న్యూఢిల్లీ: ప్రపంచంలోకెల్లా అత్యంత నిరుపేదల్లో మూడోవంతు మంది భారత్లోనే ఉన్నారని ‘ఐక్యరాజ్యసమితి సహస్రాబ్ది అభివృద్ధి లక్ష్యాల’ తాజా నివేదిక వెల్లడించింది. అలాగే ఐదేళ్లలోపు వయసున్న చిన్నారుల మరణాలు కూడా భారత్లోనే అత్యధికమని తేల్చింది. ఈ నివేదికను కేంద్ర మైనారిటీ శాఖ మంత్రి నజ్మా హెప్తుల్లా బుధవారం ఢిల్లీలో విడుదల చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ఇది ఓ సవాలని, దీన్ని కచ్చితంగా అధిగమిస్తామని అన్నారు.
‘‘పేదరికం అన్నది చాలా పెద్ద సవాలు.. తదుపరి నివేదిక వచ్చేసరికి మనం కచ్చితంగా కాస్త మెరుగుపడగలమని నాకు విశ్వాసముంది’’ అని పేర్కొన్నారు. ‘అందరితో కలిసి, అందరికీ అభివృద్ధి’ అని పిలుపునిచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ పేదరిక నిర్మూలనకు చాలా చిత్తశుద్ధితో కృషి చేస్తారన్నారు. ఈ నివేదికలో చాలా అభివృద్ధి సూచికలపై చర్చ ఉన్నప్పటికీ.. వాటిలో భారత్కు అనుకూలంగా ఏదీ లేదన్నారు.
నివేదికలో ముఖ్యాంశాలు
►భారత్లో 60 శాతం మంది ఇప్పటికీ బహిర్భూమికే వెళుతున్నారు.
►ప్రపంచంలో సంభవిస్తున్న ప్రసూతి మరణాల్లో 17 శాతం భారత్లోనే జరుగుతున్నాయి.
►నిరుపేదలు ఎక్కువగా ఉన్న దేశాల్లో భారత్ తర్వాత స్థానంలో చైనా ఉంది.
►ప్రపంచ నిరుపేదల్లో 13 శాతం మంది చైనాలో, 9 శాతం మంది నైజీరియాలో, 5 శాతం మంది బంగ్లాదేశ్లో ఉన్నారు.