వాళ్లకు కిరాయి మనుషులే దిక్కు: హరీశ్
సాక్షి, సిద్దిపేట: బీజేపీ వాళ్లు వంద కార్లేసుకుని ఊర్లలోకి వస్తున్నరు, కానీ ఊరోళ్లు వంద మంది ఉంటలేరని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. పరాయి నాయకులు, కిరాయి మనుషులే వారికి దిక్కని విమర్శించారు. మిరుదొడ్డి మండలంలోని మోతె గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాతతో పాటు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి శనివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు.. అభివృద్ధిని కళ్లుండి చూడలేని గుడ్డి పార్టీలుగా అభివర్ణించారు. వాళ్లు సీసాలను, పైసలను, అబద్ధాలను నమ్ముకున్నారన్నారు.
కాంగ్రెస్ పాలనలో దొంగరాత్రి కరెంట్ వచ్చేదని మంత్రి విమర్శలు గుప్పించారు. వారి మాటలకు మోసపోతే గోసపడతమని జనాలను హెచ్చరించారు. టీఆర్ఎస్.. చేసేది చెబుతుందని, చెప్పిందే చేస్తున్నామని తెలిపారు. లక్ష రూపాయల రుణమాఫీ కచ్చితంగా చేస్తామని మరోసారి హామీ ఇచ్చారు. దీనికోసం అసెంబ్లీ ఆమోదం కూడా ఇదివరకే తీసుకున్నామని స్పష్టం చేశారు. నిజానికి రుణమాఫీ ఇదివరకే బ్యాంకుల్లో జమ అయ్యేవన్నారు. ఈసారి రుణమాఫీ చెక్కులను నేరుగా రైతులకే అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. (బీజేపీని 300 ఫీట్ల లోతులో పాతి పెట్టాలి )