ముడుపు విప్పి, మొక్కు తీర్చుకున్న కేసీఆర్
నిజామాబాద్ : టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ముడుపు విప్పి, పద్నాలుగేళ్ల నాటి మొక్కు తీర్చుకున్నారు. నిజామాబాద్ జిల్లా మోతెలో 2001లో ఆయన మట్టిని ముడుపు కట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ వచ్చాకే ఆ మట్టిని ముడుపు విప్పుతానని కేసీఆర్ గతంలో ప్రతిజ్ఞ చేశారు. కృతజ్ఞతతో తెలంగాణ సాధిస్తామని ఆయన అప్పట్లో ముడుపు కట్టారు.
ఈ సందర్భంగా కేసీఆర్ శుక్రవారం మాట్లాడుతూ తాను బతికున్నంత వరకూ మోతెనే తన స్వగ్రామం అన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం మోతె గ్రామం నుంచే శంకుస్థాపన చేస్తామన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ హామీల వర్షం కురిపించారు. ఉచిత నిర్బంధ విద్యను అమలు చేస్తామని ఆయన తెలిపారు.
రైతులకు లక్ష వరకూ రుణమాఫీ చేయటంతో పాటు, మోతెలో పసుపు పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. గల్ఫ్ బాధితుల్ని ఆదుకుంటామన్నారు. కాగా తెలంగాణా సాధించామని సంతోషపడితే సరికాదని, రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. టీఆర్ఎస్ తోనే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి సాధ్యమన్నారు.