అమృతహస్తం.. అందదు నేస్తం!
* అధికారుల్లో లోపించిన చిత్తశుద్ధి
* ఆగని మాతాశిశు మరణాలు
మంథని : ‘మొదటికే మోక్షం లేదుగానీ.. ’ అన్నట్లు ఉంది ఐసీడీఎస్ అధికారుల తీరు. మాతాశిశు మరణాలను తగ్గించేందుకు అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేసిన ఇందిరమ్మ అమృతహస్తం పడకేసినా.. రెండు విడతలు అమలు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ లక్ష్యం నెరవేరకపోయినా.. తాజాగా జిల్లావ్యాప్తంగా విస్తరిస్తామని చెప్పి విస్మయానికి గురిచేస్తున్నా రు. 2013 జనవరి 3న పైలట్ ప్రాజెక్టు కింద గత ప్రభుత్వం మంథని డివిజన్లోని మంథని, మహదేవపూర్, జగిత్యాల డివిజన్లోని మ ల్యాల ఐసీడీఎస్ ప్రాజెక్టులో మొదటి విడతగా ఎంపిక చేసింది.
అప్పటి కలెక్టర్ స్మితాసబర్వాల్ మంథనిలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే ఐకేపీ, ఐసీడీఎస్ అధికారుల సమన్వయలోపంతో పథకం పూర్తిగా నీరుగారిపోయింది. మొదటి విడతను సరిగ్గా అమలు చేయకుండానే.. రెండో విడతలో హుస్నాబాద్, గంగాధర, భీమదేవరపల్లిలో అమృతహస్తం పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. అయినా ఎక్కడా అమలైన దాఖలాలు లేవు. తీరా ఈనెల ఒకటి నుంచి జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు ఐసీడీఎస్ అధికారులు. మొదటి, రెండో విడతలో అమలుచేసిన కేంద్రాల్లో పథకం లక్ష్యం పక్కదారి పట్టినా చక్కదిద్దుకోని అధికారులు.. తామేదో సాధించామన్నట్లు అన్ని ప్రాజెక్టులకు విస్తరించాలని ఆదేశాలు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో 16 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 4,815 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. మరో 145 మినీకేంద్రాలు పనిచేస్తున్నాయి. ఈ కేంద్రాల్లో 30 వేలకుపైగా బాలింతలు, మరో 30వేల మంది గర్భిణులు, అలాగే లక్షాయాభై వేలకు పైగా ఏడేళ్లలోపు పిల్లలున్నారు. ఐకేపీ, అంగన్వాడీ కేంద్రాల సమన్వయంతో ఈ పథకం అమలు చేయాలి. పాలు, కూరగాయలు, గుడ్లను వీవో సంఘాలు అంగన్వాడీ కేంద్రాలకు తెస్తే అక్కడ ఆయా వండి గర్భిణులు, బాలింతలకు భోజనం పెట్టి పాలు అందించాలనేది పథకం లక్ష్యం. కానీ అంగన్వాడీ కార్యకర్తలు, వీవోల మధ్య సమన్వయం లేకపోవడం.. వండి పెట్టిన వీవో సంఘాలకు బిల్లులు రాకపోవడంతో పథకం లక్ష్యం నీరుగారింది.
ఈ విషయాన్ని అంగన్వాడీ కార్యకర్తలు పలు సమావేశాల్లో బహిరంగంగా చెప్పినా రెండు శాఖలను సమన్వయపరిచి పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడంలో మాత్రం ఉన్నతాధికారులకు చిత్తశుద్ధి లోపించింది. దొడ్డు బియ్యం, కుళ్లిపోయిన కూరగాయలతో భోజనం వండటం ద్వారా కడుపునొప్పి, వాంతులు వస్తున్నాయని పేర్కొంటూ కేంద్రాలకు రావడానికి కొంతమంది గర్భిణులు, బాలింతలు వెనుకంజ వేశారు. దీంతో కొందరు కార్యకర్తలు వారింటికే వెళ్లి పాలు, ఇతరత్రా వస్తువులను ఇచ్చేవారు. అయినా గర్భిణులు, బాలింతలు నిరాకరించి విమర్శలు చేసినా.. అధికారులు మాత్రం పథకాన్ని గాడిలో పెట్టలేకపోయారు. కొత్త ప్రభుత్వం వచ్చాక పథకాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లు అధికారులు ప్రకటిస్తుండడంతో కొత్త ఆశలు చిగురిస్తున్నా.. పాత ప్రభుత్వ హయాంలో పనిచేసిన అధికారులు, కార్యకర్తలే కావడంతో పథకం లక్ష్యం మళ్లీ నీరుగారుతుందని గర్భిణులు, బాలింతలు పేర్కొంటుండడం గమనార్హం.
కేంద్రాలకు సరఫరా కాని కోడిగుడ్లు
అంగన్వాడీ కేంద్రాలకు నెలరోజులుగా కోడిగుడ్లు సరఫరా కావడం లేదు. నెలకు నాలుగుసార్లు పిల్లలకు గుడ్డు వండి పెట్టాల్సి ఉండగా.. సరఫరా లేక నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. చిన్నపిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేందుకు పనిచేసే కేంద్రాలకు ఐసీడీఎస్ సరుకుల పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తుండటంతో అంగన్వాడీ కేంద్రాలు అస్తవ్యస్తంగా తయారవుతున్నాయి.
వీవోలు స్పందించడం లేదు
అమృతహస్తం పథకం ద్వారా అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు అందించే పౌష్టికాహారానికి సంబంధించిన సరుకులు వీవో సమైఖ్యల ద్వారా సరఫరా కావాలి. కానీ అలా జరగడం లేదు. వారికి డబ్బులు రావడం లేదని సరఫరా నిలిపివేశారు. దీంతో ఐసీడీఎస్ ద్వారా వచ్చే గు డ్లు, ఇతరాత్ర సరుకులను వారికి అందిస్తున్నాం. ఒకవేళ ఎవరైన రాలేకపోతే వారి ఇంటికి పంపిస్తున్నాం.- ఎల్లంకి శోభ,
అంగన్వాడీ కార్యకర్త, ,సూరారం
పైసల్లేక బంద్ పెట్టిన
ఆర్నెల్లుగా వీవో నుంచి సరుకులు వస్తలేవు. కొన్ని రోజులు బంద్ చేసినంక పైసలు పెట్టి అన్నం పెట్టమన్నరు. అక్కడాఇక్కడా అప్పు చేసి పథకాన్ని నడిపిం చిన. తొమ్మిది వేలదాక అప్పయ్యింది. పైసలు లేక ఇరువై రోజులుగా బందుపెట్టిన. అప్పులోళ్లు అచ్చి లొల్లి పెడుతాంటే మరోకాడ నాలుగు వేలు తీసుకుని వాళ్లకిచ్చిన. గిట్లా పైసలు లేకుంటే ఎట్లా అన్నం అండిపెట్టుడు. నెల రోజుల సంది గుడ్లు అత్తలేవు. సరకులు కూడా రాలేదు. ఏం పెట్టి వండిపెట్టాలే.
- పింగిలి కౌసల్య, కార్యకర్త, మల్లెపల్లి
ఒక్కసారి కూడా రమ్మనలే
మొదటి కాన్పులో అప్పుడప్పుడు భోజనానికి పిలిచేవాళ్లు. ఇప్పుడు నా కొడుకుకు 16నెలలు. పోయిన నెలదాంక ఒక్క గుడ్డు మాత్రమే ఇచ్చారు. కొద్దిరోజులకు ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు నేను గర్భవతిని. ఇప్పటికి ఒక్కసారి కూడా భోజనానికి పిలువలే. గిట్లయితే పథకం లక్ష్యం ఎలా నెరవేరుతది? - చిదురాల శైలజ, గర్భిణి, కన్నాల
పౌష్టికాహారం అందడం లేదు
మునుపటిలాగే వచ్చినప్పుడు గుడ్లు ఇస్తున్నారు. అవి కూడా సప్లై లేదని చెప్పి ఈ మధ్యన ఇస్తలేరు. మొదట్లో కేంద్రాల వద్ద పాలు, అ న్నం, పప్పు వంట చేసి పెట్టిన్రు. ఇ ప్పుడు అవేమి లేవు. పౌష్టికాహారం అనుకుంటనే అన్నం, ఇన్నన్ని పాలు తెచ్చి ఇంటికాడ ఇచ్చిపోతాన్రు. ఇలా అయితే మాకు పౌష్టికాహారం ఇ లా అందుతుంది.?- పోలం మాధవి. గర్భిణి, సూరారం