Mother Child Health
-
Andhra Pradesh: తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు విస్తరణ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవానంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి తరలించే తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ (102) సేవలను ప్రభుత్వం మరింత విస్తరించబోతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 270 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల్లో బాలింతలను ఇళ్లకు తరలిస్తున్నారు. వీటికి అదనంగా మరో 230 వాహనాలను కలిపి మొత్తంగా 500 వాహనాలతో సేవలను ప్రభుత్వం విస్తరిస్తోంది. రోజుకు 2 నుంచి 5 కాన్పులు జరిగే ప్రభుత్వ ఆసుపత్రికి తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉండేలా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. జనవరి నుంచి 500 వాహనాల సేవలు ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం సరిపడినన్ని వాహనాలు లేక కొన్ని ప్రాంతాల్లో సొంత ఖర్చులతో ఆటోలు, బస్సుల్లో బాలింతలు ఇళ్లకు వెళుతున్నారు. ఎక్కువ వాహన సేవలు అందుబాటులోకి తీసుకురావడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలపై రవాణా ఖర్చుల భారం తగ్గనుంది. ప్రస్తుతం తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ప్రొవైడర్‌గా జీవీకే సంస్థ వ్యవహరిస్తోంది. ఈ నెలాఖరుకు జీవీకే సంస్థ గడువు ముగియనుంది. జనవరి నుంచి 104, 108 వాహన సేవలను నిర్వహిస్తున్న అరబిందో ఫార్మా సంస్థ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ప్రొవైడర్‌గా వ్యవహరించనుంది. ఈ సంస్థ 500 నూతన వాహనాలతో సేవలను ప్రారంభించనుంది. ట్రిప్పుకు ఒక్కరినే ప్రస్తుతం తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో ట్రిప్పుకు ఇద్దరు బాలింతలను తరలిస్తున్నారు. ఇద్దరు బాలింతలు, వారి వెంట ఉన్న ఇద్దరు అటెండర్లు ఒకే వాహనంలో వెళ్లడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఈ ఇబ్బందులకు ప్రభుత్వం చెక్ పెడుతూ ట్రిప్పుకు ఒకే బాలింతను తరలించే విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది. దీంతో బాలింత వెంట ఉండే ఒకరిద్దరు కుటుంబ సభ్యులు సైతం వాహనంలో వెళ్లడానికి అవకాశం లభించనుంది. -
ఎనిమిది రోజుల శిశువు అపహరణ
సంగారెడ్డి టౌన్: ఎనిమిది రోజుల శిశువును ఓ గుర్తు తెలియని మహిళ అపహరించిన ఘటన కలకలం సృష్టించింది. మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని ఎంసీహెచ్ (మాతా శిశు సంరక్షణ కేంద్రం)లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రి లోపల, బయట సీసీ కెమెరాలు, 24 గంటల పాటు సెక్యూరిటీ ఉన్నా శిశువును అపహరించారు. సంగారెడ్డి మండలం కల్పగూర్‌కి చెందిన హన్మోజిగారి మల్లేశం భార్య మాధవి గత నెల 29న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. 4 రోజుల క్రితం శిశువుకు కామెర్లు రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఉదయం 9 గంటలకు గుర్తు తెలియని ఓ మహిళ ఆస్పత్రిలోని ఎస్ఎన్సీయూలోకి ప్రవేశించింది. అక్కడున్న వనిత అనే ఆయా నిర్లక్ష్యంతో ఆ గుర్తు తెలియని మహిళను మల్లేశం కుటుంబసభ్యులని భావించి శిశువును ఆమెకు అప్పగించింది. అనంతరం శిశువును తమకు ఇవ్వలేదని ఆందోళన చెందిన మాధవి ఆయాను ప్రశ్నించగా తాము సరైన వ్యక్తికి అప్పగించామని వారు చెప్పారు. ఆ శిశువు తల్లిదండ్రుల పేర్లు మల్లేశం, మాధవి అని ఒకసారి, మీ శిశువు లోపల ఉంది ఇస్తున్నామని మరోసారి చెప్పి తాత్సారం చేసింది. గంట గడిచినా శిశువును అప్పగించకపోవడంతో అనుమానం వచ్చి ప్రశ్నించగా అసలు విష యం బయటకు వచ్చింది. గుర్తు తెలియని మహిళ శిశువును తీసుకొని బయటకు వెళ్లినట్లు ఆస్పత్రిలోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. శిశువు కిడ్నాప్ ఘటన తెలుసుకున్న మాధవి కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆస్పత్రికి చేరుకొని ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫర్నిచర్ పగలగొట్టారు. సంగారెడ్డి డీఎస్పీ పి.శ్రీధర్‌రెడ్డి, టౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఆస్పత్రికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఆస్పత్రి, మెటర్నిటీ వార్డులోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఈ కేసు విషయమై ఆయా వనిత పాత్ర గురించి ఆరా తీస్తున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
చెక్కులు.. చిక్కులు
బాలింతలకు కష్టాలు జననీ సుర క్షా యోజనకు కొత్త నిబంధనలు నగదు ప్రోత్సాహకానికి పాట్లు సర్కారు దవాఖానాలో కాన్పు చేసుకుంటే నగదు ప్రోత్సాహం చేతికందటానికి బాలింతలు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కాదు. చెక్కుల జారీలో వైద్యాధికారుల కొత్త నిబంధనలే ఇందుకు కారణం.. నిన్నామొన్నటి వరకు బేరర్ చెక్కులు అందజేసిన అధికారులు తాజాగా అకౌంట్‌పే ఇవ్వడం బాలింతలను ఇబ్బందికి గురిచేస్తోంది. దీంతో బ్యాంకుల్లో ఖాతాలు లేక నగదు ప్రోత్సాహం కోసం వారు ఇబ్బందులకు గురౌతున్నారు. - తాండూరు ప్రభుత్వ ఆస్పత్రుల్లో కాన్పులు ప్రోత్సహించేందుకు జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమం (ఎన్ఆర్హెచ్ఎం) కింద కేంద్ర ప్రభుత్వం జననీ సురక్షా యోజన (జేఎస్వై) అమలు చేస్తోంది. సర్కారు ఆస్పత్రుల్లో కాన్పు చేసుకున్నందుకు గ్రామీణ ప్రాంతాల మహిళలకు రూ.1000, పట్టణ ప్రాంతాల వారికి రూ.700 చెక్కు రూపంలో అందజేస్తారు. ఇంతవరకు నేరుగా బ్యాంకుల నుంచి డబ్బులు తీసుకునేలా బేరర్ చెక్కులు ఇచ్చేవారు. తాజాగా అధికారులు ‘అకౌంట్‌పే’వి మాత్రమే ఇస్తున్నారు. దీంతో బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకుల్లో ఖాతాలు లేకపోవడంతో డబ్బులు పొందడం వారికి కష్టంగా మారింది. జిల్లా ఆస్పత్రిలో నెలకు సుమారు 200 నుంచి 300 వరకు కాన్పులు జరుగుతుంటాయి. వైద్యాధికారుల నిర్ణయాలు తరచూ మారుతుండడం వల్ల బాలింతలకు పురిటి నొప్పుల కన్నా డబ్బుల తీసుకోవడంలో ఎదురవుతున్న ఇబ్బందులు ఎక్కువయ్యాయి. పథకం నిబంధనలివీ.. ఆశ కార్యకర్తలు తమ పరిధిలో గర్భవతులను గుర్తించి ఆరోగ్య పరీక్షల కోసం ప్రభుత్వ ఆస్పత్రులకు తీసుకువెళ్లాలి. అక్కడ ఏఎన్ఎంలు లబ్ధిదారుల పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత గర్భవతులకు మదర్ చైల్డ్ హెల్త్ (ఎంసీహెచ్) కార్డులు ఇస్తారు. ఇదే సమయంలో బ్యాంకు అకౌంట్లు తీయాలని ఏఎన్ఎంలు సూచించాలి. ఈ ప్రక్రియ సజావుగా జరుగుతుందా లేదా అని సంబంధిత ైవె ద్యాధికారి పర్యవేక్షణ చేయాలి. అయితే ఈ ప్రక్రియ సజావుగా జరగడం లేదు. అకౌంట్ గురించి తెలియదు కర్ణాటక రాష్ర్టంలోని సేడం మా ఊరు. భర్త రమేష్‌తో కలిసి గోపన్‌పల్లిలోని పాలీషింగ్ యూనిట్లో పని చేస్తున్నాను. ఈ నెలలో తాండూరులోని జిల్లా ఆస్పత్రిలో కాన్పు చేసుకున్నాను. రూ.1000 చెక్కు ఇచ్చారు. బ్యాంక్‌కు వెళితే అకౌంట్ ఉంటేనే డబ్బులు ఇస్తామంటున్నారు. ఈ విషయం మాకు ముందుగా తెలియదు. - భారతి, బాలింత నగదునే అందించాలి కాన్పు చేసుకున్న వారికి ప్రభుత్వం నగదును అందించారు. ఒక వేళ.. కాన్పుకు వచ్చిన వారికి ముందుగానే ఈ విషయమై అవగాహన కల్పించాలి. లేదంటే డబ్బు తీసుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వ ఆస్పత్రిలో కాన్పు చేసుకుంటే నగదు ప్రోత్సాహం అందించడంలో ఎలాంటి ఇబ్బంది కలిగొంచొద్దు. - సావిత్రి, బాలింత