సంగారెడ్డి టౌన్: ఎనిమిది రోజుల శిశువును ఓ గుర్తు తెలియని మహిళ అపహరించిన ఘటన కలకలం సృష్టించింది. మంగళవారం సంగారెడ్డి జిల్లా కేంద్ర ఆస్పత్రిలోని ఎంసీహెచ్ (మాతా శిశు సంరక్షణ కేంద్రం)లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఆస్పత్రి లోపల, బయట సీసీ కెమెరాలు, 24 గంటల పాటు సెక్యూరిటీ ఉన్నా శిశువును అపహరించారు. సంగారెడ్డి మండలం కల్పగూర్‌కి చెందిన హన్మోజిగారి మల్లేశం భార్య మాధవి గత నెల 29న ఆడ శిశువుకు జన్మనిచ్చింది. 4 రోజుల క్రితం శిశువుకు కామెర్లు రావడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఉదయం 9 గంటలకు గుర్తు తెలియని ఓ మహిళ ఆస్పత్రిలోని ఎస్‌ఎన్‌సీయూలోకి ప్రవేశించింది. అక్కడున్న వనిత అనే ఆయా నిర్లక్ష్యంతో ఆ గుర్తు తెలియని మహిళను మల్లేశం కుటుంబసభ్యులని భావించి శిశువును ఆమెకు అప్పగించింది. అనంతరం శిశువును తమకు ఇవ్వలేదని ఆందోళన చెందిన మాధవి ఆయాను ప్రశ్నించగా తాము సరైన వ్యక్తికి అప్పగించామని వారు చెప్పారు.
ఆ శిశువు తల్లిదండ్రుల పేర్లు మల్లేశం, మాధవి అని ఒకసారి, మీ శిశువు లోపల ఉంది ఇస్తున్నామని మరోసారి చెప్పి తాత్సారం చేసింది. గంట గడిచినా శిశువును అప్పగించకపోవడంతో అనుమానం వచ్చి ప్రశ్నించగా అసలు విష యం బయటకు వచ్చింది. గుర్తు తెలియని మహిళ శిశువును తీసుకొని బయటకు వెళ్లినట్లు ఆస్పత్రిలోని సీసీ కెమెరాల్లో రికార్డయింది. శిశువు కిడ్నాప్ ఘటన తెలుసుకున్న మాధవి కుటుంబసభ్యులు, గ్రామస్తులు ఆస్పత్రికి చేరుకొని ఆందోళనకు దిగారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే ఈ ఘటన జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫర్నిచర్ పగలగొట్టారు. సంగారెడ్డి డీఎస్పీ పి.శ్రీధర్‌రెడ్డి, టౌన్ సీఐ వెంకటేశ్వర్లు ఆస్పత్రికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఆస్పత్రి, మెటర్నిటీ వార్డులోని సీసీ ఫుటేజీలను పరిశీలించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నామని డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి తెలిపారు. ఈ కేసు విషయమై ఆయా వనిత పాత్ర గురించి ఆరా తీస్తున్నామన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment