![Expansion Of Mother Child Express Services In Andhra Pradesh - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/11/Express-Services.jpg.webp?itok=hB1ehnVU)
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవానంతరం తల్లీబిడ్డలను సురక్షితంగా ఇంటికి తరలించే తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ (102) సేవలను ప్రభుత్వం మరింత విస్తరించబోతోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా 270 తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాల్లో బాలింతలను ఇళ్లకు తరలిస్తున్నారు. వీటికి అదనంగా మరో 230 వాహనాలను కలిపి మొత్తంగా 500 వాహనాలతో సేవలను ప్రభుత్వం విస్తరిస్తోంది. రోజుకు 2 నుంచి 5 కాన్పులు జరిగే ప్రభుత్వ ఆసుపత్రికి తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ అందుబాటులో ఉండేలా వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
జనవరి నుంచి 500 వాహనాల సేవలు ప్రారంభించడానికి కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం సరిపడినన్ని వాహనాలు లేక కొన్ని ప్రాంతాల్లో సొంత ఖర్చులతో ఆటోలు, బస్సుల్లో బాలింతలు ఇళ్లకు వెళుతున్నారు. ఎక్కువ వాహన సేవలు అందుబాటులోకి తీసుకురావడం వల్ల పేద, మధ్యతరగతి కుటుంబాలపై రవాణా ఖర్చుల భారం తగ్గనుంది. ప్రస్తుతం తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ప్రొవైడర్‌గా జీవీకే సంస్థ వ్యవహరిస్తోంది. ఈ నెలాఖరుకు జీవీకే సంస్థ గడువు ముగియనుంది. జనవరి నుంచి 104, 108 వాహన సేవలను నిర్వహిస్తున్న అరబిందో ఫార్మా సంస్థ తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్ సర్వీస్ ప్రొవైడర్‌గా వ్యవహరించనుంది. ఈ సంస్థ 500 నూతన వాహనాలతో సేవలను ప్రారంభించనుంది.
ట్రిప్పుకు ఒక్కరినే
ప్రస్తుతం తల్లి బిడ్డ ఎక్స్‌ప్రెస్‌లో ట్రిప్పుకు ఇద్దరు బాలింతలను తరలిస్తున్నారు. ఇద్దరు బాలింతలు, వారి వెంట ఉన్న ఇద్దరు అటెండర్‌లు ఒకే వాహనంలో వెళ్లడానికి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఈ ఇబ్బందులకు ప్రభుత్వం చెక్ పెడుతూ ట్రిప్పుకు ఒకే బాలింతను తరలించే విధానాన్ని అందుబాటులోకి తెస్తోంది. దీంతో బాలింత వెంట ఉండే ఒకరిద్దరు కుటుంబ సభ్యులు సైతం వాహనంలో వెళ్లడానికి అవకాశం లభించనుంది.
Comments
Please login to add a commentAdd a comment