‘తల్లి’డిల్లిన తనయుని గుండె..
అమ్మ కర్మకాండలకు సిద్ధమవుతూ హఠాన్మరణం
తిరుమలాయపాలెం: చిన్ననాటి నుంచి అమ్మ లేకుండా ఒక్కరోజు కూడా ఉండలేని ఆ తనయుడు... చివరకు ఆ అమ్మనే వెతుక్కుంటూ తల్లి కర్మకాండ రోజే తనువు చాలించాడు. మాతృమూర్తి దూరమైన నాటి నుంచి నిత్యం ఆమెను తలచుకొని మదనపడుతూ ఆమె కర్మకాండ రోజే గుండెపోటుతో హఠాన్మరణం పాలయ్యూడు. ఖమ్మం జిల్లా పిండిప్రోలులో శనివారం జరిగిన ఈ ఘటన పూర్వాపరాలు.. పిండిప్రోలు గ్రామానికి చెందిన లలితమ్మ(50), ఆమె భర్త బాబు స్థానిక గ్రానైట్ క్వారీలో వంట మనుషులుగా పనిచేసేవారు.
ఈనెల 9న క్వారీ పక్కనున్న గుంతలో నుంచి నీళ్లు తెచ్చేందుకు వెళ్లిన లలితమ్మ... ప్రమాదవశాత్తు కాలుజారి అందులో పడి మరణించింది. అమ్మంటే ఎనలేని ప్రేమ ఉన్న ఆమె కుమారుడు ఉపేందర్ (27) ఆ రోజు నుంచి తీవ్ర వేదనతో కుంగిపోయాడు. శనివారం లలితమ్మ దశ దినకర్మ నిర్వహించాల్సి ఉంది. దీనికోసం కార్డులు పంపిణీ చేసి బంధుమిత్రులను ఆహ్వానించాడు. బంధువులంతా ఇంటికి చేరుకుని కర్మకాండల కోసం కావాల్సిన సామగ్రిని సిద్ధం చేసే పనిలో ఉండగా, ఉపేందర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
ఆసుపత్రికి తరలించేలోపే ప్రాణాలు వదిలాడు. అయితే ఛాతీలో నొప్పి వస్తోందని అంతకు కొద్దిసేపటి ముందే ఉపేందర్ బంధుమిత్రుల్లో ఒకరిద్దరికి చెప్పాడు. డాక్టర్ వద్దకు వెళదామని వారు చెప్పినా... ఈ కార్యక్రమం పూర్తయ్యాక చూద్దామని చెబుతూ వచ్చాడు. చివరికి గుండెపోటుతో ప్రాణాలు వదిలాడు. ‘అమ్మంటే ఉపేందర్కు ఎంతో ఇష్టం.. ఆమెను విడిచి ఒక్కరోజు కూడా ఉండలేదు.
తల్లీ కొడుకులు ఇద్దరూ వెళ్లిపోయారు..’’ అంటూ ఉపేందర్ తండ్రి బాబు శోక సంద్రంలో మునిగిపోయాడు. తల్లి కర్మకాండ రోజే తమ్ముడు మరణించడాన్ని చూసి ఉపేందర్ అక్క స్పృహతప్పి పడిపోయింది. ఆమెను వెంటనే ఖమ్మంలోని ఓ ఆస్పత్రికి తరలించగా.. కోలుకుంటోంది. ఉపేందర్కు ఒక కుమారుడు ఉండగా.. ఆయన భార్య ఉప్పమ్మ ప్రస్తుతం గర్భవతి.