హీరో మోటోకార్ప్ లాభంలో స్వల్ప వృద్ధి
తగ్గిన బైక్ల విక్రయాలు
* క్యూ2 ఫలితాలు వెల్లడించిన కంపెనీ
న్యూఢిల్లీ: హీరో మోటోకార్ప్ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలానికి నికర లాభంలో స్వల్పంగానే వృద్ధిని సాధించింది. గ్రామీణ మార్కెట్లలో మందగమనం కారణంగా మోటార్ సైకిళ్ల అమ్మకాలు తగ్గాయని, అందుకే నికర లాభం స్వల్పంగానే పెరిగిందని హీరో మోటోకార్ప్ తెలిపింది. గత క్యూ2లో రూ.763 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 1 శాతం వృద్ధితో రూ.772 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఎండీ, సీఈఓ పవన్ ముంజాల్ చెప్పారు. నికర అమ్మకాలు రూ.6,864 కోట్ల నుంచి 2 శాతం క్షీణించి రూ.6,745 కోట్లకు తగ్గాయని తెలిపింది. టూ వీలర్ల విక్రయాలు 16,92,323 నుంచి 15,74,861కు తగ్గాయని పేర్కొన్నారు.
మైలురాయి త్రైమాసికం...
ఈ త్రైమాసికం తమకు మైలురాయి వంటిదని, ఎన్నో ఘనతలు సాధించామని ముంజాల్ చెప్పారు. ఈ క్వార్టర్లోనే మ్యాస్ట్రో ఎడ్జ్, డ్యూయట్ కొత్త స్కూటర్లను మార్కెట్లోకి తెచ్చామని తెలిపారు. అంతర్జాతీయ విస్తరణ కార్యకలాపాల్లో భాగంగా విదేశీ తొలి తయారీ ప్లాంట్ను కొలంబియాలో ఏర్పాటు చేశామన్నారు. దక్షిణ అమెరికాలో ఏర్పాటైన తొలి భారత టూ వీలర్ ప్లాంట్ ఇదేనని చెప్పారు. ఈ క్వార్టర్ నుంచే దేశీయంగా అమ్మకాలు పుంజుకోవడం ప్రారంభమైం దని తెలిపారు. ఈ జోరు మరో ఆర్నెల్ల పాటు కొనసాగగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.