అంకురం
ఆదర్శం
రాజస్థాన్‌లోని భీల్వారా జిల్లాలో ఉన్న మారుమూల గ్రామం ధాపరా గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. ఒకవేళ కాస్తో కూస్తో తెలిసిందంటే... ఆ చిన్న గ్రామంలో తిష్ట వేసిన అతి పెద్ద మద్యభూతం గురించే! ఈ ఊళ్లో పెద్దవాళ్లే కాదు... ఒక వయసు పిల్లలు కూడా రోజూ సాయంత్రం మద్యం సేవిస్తారు. విషాదం ఏమింటే ‘ఎనీటైమ్ మనీ’లాగా ‘ఎనీ టైమ్... ఎక్కడైనా మద్యం’ దొరకడం అనేది ఈ ఊరి ప్రత్యేకత. అక్రమంగా వెలసిన మద్యం దుకాణాలపై పోరాటానికి గతంలో కొంత ప్రయత్నమైతే జరిగిందికానీ... ఎక్కడ వేసిన గొంగళి అక్కడిలాగే తయారైంది పరిస్థితి. నిజానికి ప్రజల ఆలోచన ధోరణిలో మార్పు వస్తే... అక్రమంగానో, సక్రమంగానో ఎన్ని మద్యం దుకాణాలు వెలసినా అవి వెలవెలపోతాయి. అందుకే ఆ వైపు నుంచి నరుక్కు రావాలనుకుంది స్కూల్ ఆఫ్ డెమోక్రసీ (యస్‌ఎఫ్‌డీ) యస్‌ఎఫ్‌డీని ‘లోక్‌తంత్రశాల’ అని కూడా పిలుస్తారు.
భీల్వారా జిల్లాలో ఉన్న ‘బది కా బదియ’ గ్రామంలో ఉన్న నాన్–ఫార్మల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఈ యస్‌ఎఫ్‌డీ. వర్క్‌షాప్‌లు, ఉపన్యాసాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు, ప్రదర్శనలు... మొదలైన వాటి ద్వారా విద్యార్థులకు ప్రజాస్వామిక విద్యను అందించే ప్రయత్నం చేస్తుంది యస్‌ఎఫ్‌డీ. ‘కమ్యూనిటీ లైబ్రరీ ప్రోగ్రాం’లో భాగంగా భీల్వారా జిల్లాలోని ఎన్నో గ్రామాల్లో గ్రంథాలయాల స్థాపనకు కృషి చేస్తుంది. ధాపరా గ్రామాన్ని పట్టి పీడిస్తున్న మద్యపాన సమస్య... ఆ గ్రామస్థుడు లాడోసింగ్‌కు బాధ కలిగించేది.
తమ గ్రామసమస్యను ‘లోక్‌తంత్రశాల’ దృష్టికి తీసుకువచ్చాడు లాడో సింగ్. యస్‌ఎఫ్‌డీ ఊళ్లో గ్రంథాలయాన్ని స్థాపించింది. యస్‌ఎఫ్‌డీ వాలంటీర్లు ఈ గ్రంథాలయాన్ని అందంగా ముస్తాబు చేశారు. ‘‘పిల్లలు, యువత కోసం ఈ గ్రంథాలయాన్ని మొదలుపెట్టాం. దీని వల్ల పుస్తక పఠనాభిలాష పెరగడమే కాదు...రకరకాల నైపుణ్యాలు పెరుగుతాయి’’ అంటున్నారు యస్‌ఎఫ్‌డీ తరపున పనిచేస్తున్న రెనీ జోసెఫ్.
ఊరును ‘మద్యం సమస్య’ పట్టి పీడిస్తోంది. దీనికి ‘గ్రంథాలయం’ ఎలా పరిష్కారం చూపుతుంది? అనేది చాలామంది సందేహం.
అయితే యస్‌ఎఫ్‌డీ పుణ్యమా అని తమ తీరిక సమయాన్ని గ్రంథాలయంలోనే గడుపుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీని ప్రభావం ఊరికే పోలేదు... గ్రామస్థుల ప్రవర్తన, అలవాట్లకు సంబంధించిన విషయాల్లో క్రమంగా మార్పు వస్తుంది. ఇది ఒక శుభసంకేతంగా యస్‌ఎఫ్‌డీ భావిస్తుంది. గ్రంథాలయానికే పరిమితమైపోలేదు యస్‌ఎఫ్‌డీ. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్థానిక ప్రజలతో గడుపుతూ... మద్యం వల్ల తలెత్తే దుష్పరిణామాల గురించి ప్రచారం నిర్వహిస్తుంది. ఈ గ్రంథాలయ ఆవరణలో ‘కథా పఠనం’ కూడా నిర్వహిస్తున్నారు. ఆ కథలు తమ గురించి తమ శక్తియుక్తుల గురించి తెలుసుకునేలా చేయడమే కాదు... ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకునేలా ఉపకరిస్తున్నాయి.
‘‘సాయంత్రం అయ్యేసరికి గ్రామస్థులు ఇక్కడకు చేరుకుంటారు. వార్తాపత్రికలు చదవడం అలవాటు చేసుకుంటున్నారు. తాము చదివిన విషయాల గురించి చర్చ తప్ప... ఇతర విషయాలను పట్టించుకోవడం లేదు’’ అంటుంది యస్‌ఎఫ్‌డీ కార్యకర్త అదితి. ‘విలేజ్ బుక్ ఫెయిర్’ ‘రూరల్ లిటరరీ ఫెస్టివల్’లు నిర్వహించడం ద్వారా... పిల్లలు, పెద్దల్లో దాగి ఉన్న సృజనాత్మకతను బయటకు తీసుకువచ్చే ప్రయత్నాల్లో ఉంది ఎస్ఎఫ్డీ. అంతమాత్రాన రాత్రికి రాత్రే మార్పు వస్తుందని కాదు. అదితి మాటల్లో చెప్పాలంటే... ‘‘మార్పుకు సమయం పట్టవచ్చు. కానీ కచ్చితంగా మార్పు చోటు చేసుకుంటుంది’’ కాలక్షేప సమయం శ్రుతి మించితే... చెడు అలవాటు చేరువవుతుంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టి... కాలాన్ని సద్వినియోగం చేసుకోవడమే కాదు, తమ గురించి తాము ఆలోచించుకొని కొత్తదారిలో పయనించడానికి ఉపకరించే కేంద్రంగా ఎస్ఎఫ్డీ గ్రంథాలయం రూపుదిద్దుకుంటోంది.