moula ali
-
విషాదం: ఫ్లైఓవర్ పైనుంచి దూకి మహిళ ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. నగరంలోని మౌలాలి ఫ్లైఓవర్ పైనుంచి దూకి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. కాగా, తీవ్రగాయాలు కావడంతో ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ ఆమె మృతిచెందింది. వివరాల ప్రకారం.. గౌతమ్ నగర్‌కు చెందిన సుజి(37) ఆదివారం మౌలాలి ఫ్లైఓవర్ పైనుంచి దూకి వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. సదరు మహిళ ఆత్మహత్యాయత్నం గమనించిన స్థానికులు ఆమెను వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతురాలి కుటుంబసభ్యుల కోసం ఆరా తీస్తున్నట్లు మల్కాజిగిరి సీఐ రవికుమార్ తెలిపారు. ఆమె మృతికి గల కారణాల గురించి తెలుసుకుంటున్నామని చెప్పారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఇది కూడా చదవండి: విషాదం: రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి -
రైలు కిందపడి కానిస్టేబుల్ ఆత్మహత్య
హైదరాబాద్: ఫేస్బుక్ ద్వారా ఓ వివాహిత పరిచయం కానిస్టేబుల్ ఆత్మహత్యకు దారితీసింది. ఆ మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోపాటు, రహస్యంగా పెళ్లి చేసుకున్నాడని ఆమె భర్త ఫిర్యాదు మేరకు శంషాబాద్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఉన్నతాధికారులు బదిలీ వేటు వేయడంతో మస్తాపానికి గురైన కానిస్టేబుల్ రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సికింద్రాబాద్ రైల్వే పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలను ఎస్ఐ మీడియా కు వెల్లడించారు. మౌలాలి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి యువకుడు మృతి చెందినట్లు రైల్వే పోలీసులకు సమాచారం అందింది. మృతదేహం వద్ద లభించిన గుర్తింపు కార్డులు, సెల్‌ఫోన్ ఆధారంగా లాలాపేటకు చెందిన పి.సందీప్‌కుమార్ (24)గా గుర్తించారు. కుటుంబసభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. మనస్తాపానికి గురై...: సందీప్ మొఘల్‌పుర పీఎస్‌లో కానిస్టేబుల్. కొంత కాలం క్రితం ఒక వివాహితతో ఫేస్బుక్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది వివాహేతర సంబంధానికి దారి తీయడంతోపాటు తన భార్యను సందీప్ రహస్యంగా వివాహం చేసుకున్నట్లు ఆమె భర్త నాగార్జున శంషాబాద్ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఉన్నతాధికారులు సందీప్‌ను హెడ్‌క్వార్టర్‌కు అటాచ్ చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. సందీప్ తండ్రి ఆటోడ్రైవర్. చేతికందిన ఒక్క కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. -
ఎన్ఆర్ఐ అరెస్టు
మల్కాజిగిరి: భార్యను వేధిస్తున్న ఎన్ఆర్ఐ భర్తను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్ఐ సైదులు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మౌలాలి గాయత్రీనగర్‌కు చెందిన వాణి, సాప్ట్వేర్ ఉద్యోగి వినోద్‌కుమార్(45) దంపతులు. విదేశాల్లో పనిచేసే వినోద్‌కుమార్ ఇటీవల హైదరాబాద్ నగరానికి తిరిగి వచ్చాడు. భార్యాభర్తల మధ్య విభేదాలు నెలకొనడంతో వాణిని విడాకుల కోసం ఒత్తిడి చేస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నిందితుడు వినోద్‌కుమార్‌ను అరెస్టు చేశారు. -
షార్ట్‌సర్క్యూట్‌తో నిలిచిన గరీబ్‌రథ్
విశాఖపట్టణం: వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తున్న గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్ సికింద్రాబాద్ సమీపంలోని మౌలాలిలో బుధవారం ఉదయం నిలిచిపోయింది. జీ-11 బోగీపైన ఉండే రేకు ఒకటి కరెంట్ లైనుకు తాకటంతో షార్ట్‌సర్క్యూట్ అయింది. దీంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడి రైలు ఆగిపోయినట్లు సమాచారం. ఆ బోగీపై స్వల్పంగా మంటలు రేగటంతో భయపడిన ప్రయాణికులు కిందికి దిగిపోయారు. ఎలాంటి నష్టం వాటిల్లలేదని రైల్వే అధికారులు తెలిపారు. రైలు పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. -
లారీ - ఆటో ఢీ: ఒకరు మృతి
హైదరాబాద్: నగరం శివారులోని మౌలాలిలో ఆదివారం ఆటో - లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో లారీలోని స్టీల్ రాడ్లు ఆటోపై పడ్డాయి. ఈ ఘటనలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని కుషాయిగూడ పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.