Mouth ulcers
-
నోట్లో పొక్కులా? నో వర్రీ?
కొందరికి నాలుక మీద పగులు వచ్చినట్లుగా అనిపించడంతో పాటు నోట్లో పొక్కులు రావచ్చు. ఏవైనా వేడిపదార్థాలో లేదా కారంగా ఉన్నవో తింటే మామూలు కంటే ఎక్కువగా మంట, బాధ ఉంటాయి. నాలుక తరచూ పగలడానికి, నోట్లో తరచూ పొక్కులు రావడానికి (అఫ్తస్ అల్సరేషన్) చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా... విటమిన్–బి లోపంతో ఈ సమస్య రావచ్చు. దీనికి తోడు ఎసిడిటీ, నిద్రలేమి, మానసిక ఆందోళన (యాంగై్జటీ) వంటి కారణాల వల్ల ఈ సమస్య మరింత పెరుగుతుంది. అరుదుగా కొన్ని సిస్టమిక్ వ్యాధుల వల్ల కూడా ఇలాంటి సమస్యలు ఏర్పడవచ్చు. కొందరిలో పొగాకును వాడేవారికి నోటి పొరల్లో (లైనింగ్స్‌లో) మార్పులు వచ్చి అది క్రమంగా పొక్కుల్లా వ్యక్తమయ్యే అవకాశం ఉంది. కాబట్టి పైన చెప్పిన కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పొక్కులకు సరైన కారణం తెలుసుకుని దానికి తగిన చికిత్స చేయించాలి. అందుకే నోట్లో పొక్కులు వచ్చే వారు ముందుగా విటమిన్–బి కాంప్లెక్స్ టాబ్లెట్లు తీసుకుంటూ ఓ వారంపాటు చూసి, అప్పటికీ తగ్గకపోతే తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి. చదవండి: రేగి పండు.. పోషకాలు మెండు.. సరిగా బ్రష్ చేసుకుంటున్నారా? మనం బ్రష్ చేసుకునే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అవి మన దంతాల, చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడతాయి. నోటిని ఆరోగ్యంగా ఉంచి, కేవలం దంతాలను మాత్రమే కాకుండా మన పూర్తి దేహానికి ఆరోగ్యాన్నిస్తాయి. వాటిలో కొన్ని ముఖ్యమైనవి... ► బ్రష్ చేసుకునేందుకు మృదువైన బ్రిజిల్స్ ఉన్న బ్రష్‌నే వాడాలి. మరీ బిరుసైనవీ, గట్టివి అయితే పళ్లు త్వరగా అరిగిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు... చిగుళ్లు గాయపడే అవకాశమూ ఉంది. ►కిందివరసలో చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటి నుంచి కింద మళ్లీ చిగుళ్లూ, పళ్లూ కలిసే చోటు వరకు నిలువుగా బ్రష్ చేసుకోండి. ఇలా బ్రష్ చేసుకునే సమయంలో బ్రష్‌ను పైకీ, కిందికీ నేరుగా కాకుండా... గుండ్రగా తిప్పుతున్నట్లుగా మృదువుగా బ్రష్ చేసుకోవాలి. రఫ్‌గా బ్రష్ చేసుకుంటే చిగుళ్లు గాయపడి, త్వరగా వ్యాధుల బారిన పడే అవకాశం ఉంటుంది. ►బ్రషింగ్‌తో పాటు ముఖం కడుకున్న తర్వాత చివర్లో చేత్తో చిగుళ్లపై మృదువుగా మసాజ్ చేసినట్లు రుద్దితే దంతాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. -
అమ్మాయి నోట్లో పుండ్లు ఎందుకు?
పీడియాట్రిక్ కౌన్సెలింగ్ మా పాపకు ఆరేళ్లు. వారం క్రితం గొంతు నొప్పి అంటే వెంటనే డాక్టర్‌కు చూపించాం. మా పాప నోట్లో, నాలుక మీద, గొంతులోపలి భాగంలో రెండు మూడుసార్లు పుండ్లలాగా వచ్చి, తగ్గాయి. ఇన్ఫెక్షన్ వచ్చినట్లుగా గొంతు లోపలిభాగం ఎర్రబారింది. ఏదైనా తినడానికి వీలుగాక విపరీతంగా ఏడుస్తోంది. పాప కొంచెం సన్నబడింది. మా పాప సమస్యకు తగిన పరిష్కారం చూపండి. - మాధవి, మల్కాజ్గిరి మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే మీ పాపకు పదే పదే నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తున్నాయని తెలుస్తోంది. ఈ సమస్యను పిల్లల్లో చాలా సాధారణంగా చూస్తుంటాం. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. అవి... ఉద్వేగాల పరమైన ఒత్తిడి (ఎమోషనల్ స్ట్రెస్), బాగా నీరసంగా అయిపోవడం (ఫెటీగ్), * విటమిన్లు, పోషకాల లోపం... (ముఖ్యం విటమిన్ బి12, ఐరన్, ఫోలిక్ యాసిడ్, జింక్ ల వంటి పోషకాలు లోపించడం) వైరల్ ఇన్ఫెక్షన్లు (ప్రధానంగా హెర్పిస్ వంటివి) నోట్లో గాయాలు కావడం (బ్రషింగ్‌లో గాయాలు, బాగా ఘాటైన పేస్టులు వాడటం, కొన్ని ఆహారపదార్థాల (అబ్రేసివ్ ఫుడ్) వల్ల అయ్యే అనేక గాయాల కారణంగా) పేగుకు సంబంధించిన సమస్యలు, రక్తంలో మార్పులు, గ్లూటిన్ అనే పదార్థం సరిపడకపోవడం, తరచూ జ్వరాలు రావడం... వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యల వల్ల పిల్లలకు తరచూ నోటిలో పుండ్లు (మౌత్ అల్సర్స్) వస్తుంటాయి. మీరు లెటర్లో చెప్పిన కొద్ది పాటి వివరాలతో ఇదీ కారణం అని నిర్దిష్టంగా చెప్పలేకపోయినా... మీ పాపకు విటమిన్ల వంటి పోషకాల లోపం లేదా తరచూ వచ్చే ఇన్ఫెక్షన్స్తో ఈ సమస్య వస్తున్నట్లు భావించవచ్చు. ఇలాంటి పిల్లలకు నోటిలో బాధ తెలియకుండా ఉండేందుకు పైపూతగా వాడే మందులు, యాంటిసెప్టిక్ మౌత్ వాష్‌లు, విటమిన్ సప్లిమెంట్స్ వాడాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లల్లో చాలా అరుదుగా స్టెరాయిడ్ క్రీమ్స్ వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. మీరు పైన పేర్కొన్న అంశాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ మరోసారి మీ పిల్లల వైద్య నిపుణుడినిగానీ లేదా దంత వైద్య నిపుణుడినిగాని సంప్రదించి వారి ఆధ్వర్యంలో తగిన చికిత్స తీసుకోండి. ఇదేమీ ప్రమాదకరమైన సమస్య కాదు. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. డాక్టర్ రమేశ్‌బాబు దాసరి సీనియర్ పీడియాట్రీషియన్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హెదరాబాద్