అధికారులపై సభ్యుల ఆగ్రహం
రుణమాఫీ తీరుపై కాంగ్రెస్ వాకౌట్
జగిత్యాల రూరల్ : జగిత్యాల మండల సర్వసభ్య సమావేశంలో అధికారుల పని తీరుపై సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎంపీపీ గర్వందుల మానస అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగింది. అన్ని అర్హతలున్న 66 మంది రైతులకు రుణమాఫీ కాలేదని బాలపల్లి సర్పంచ్ గుంటి గంగారాం, వడగండ్ల పంట నష్టపరిహారం అంద లేదని వెల్దుర్తి సర్పంచ్ పోతుగంటి సత్యనారాయణ ప్రశ్నించారు. నివేదిక సమర్పించామని విడుదల కాగానే అందిస్తామని ఏవో రాంచంద్రం తెలిపారు. పశువైద్యాధికారి అజారోద్దీన్ మాట్లాడుతూ మండలంలో 14 వేల పశువులకు గాలికుంటు వ్యాధి టీకాలు వేశామని చెబుతుండగా టీకాలు సరిపోక గొర్రెలకాపరులు ప్రై వేటు షాపుల్లో కొనుగోలు చేస్తున్నారని బాలపల్లి సర్పంచ్ గంగారాం నిలదీశారు. డెప్యూటీ డీఈవో హాజరుకాకపోవడంతో ఎంపీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలను ప్రభుత్వ బడిలో చదివించిన వారినే పాఠశాలల్లో హెల్పర్లుగా నియమించాలని మోతె ఎంపీటీసీ శ్రీరాముల గంగాధర్, మండల ఉపాధ్యక్షుడు గంగం మహేశ్, హబ్సీపూర్ ఎంపీటీసీ ముస్కు దామోదర్‌రెడ్డి, ధరూర్ ఎంపీటీసీ శీలం సురేందర్ కోరగా ఎంఈవో హామీ ఇచ్చారు. ధరూర్‌కు కేటాయించిన డీజీబీ బ్యాంక్‌ను వెంటనే గ్రామంలో ఏర్పాటు చేయించాలని ఎంపీటీసీ శీలం సురేందర్, మోతె ఎంపీటీసీ శ్రీరాముల గంగాధర్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండా ప్రజాప్రతినిధులు చూడాలని ఎంపీపీ కోరారు. టీఆర్‌నగర్‌కు నిధులు కేటాయించాలని సర్పంచ్ కొండ శ్రీనివాస్ కోరారు. చెరువులు, కుంటలు నింపకుండా ఎస్సారెస్పీ నీటిని ఎల్ఎండీకి తరలించడంపై కాంగ్రెస్ ఎంపీటీసీలు, సర్పంచులు సభను బహిష్కరించారు. కార్యాలయం బయట నినాదాలు చేశారు. జెడ్పీటీసీ పెండెం నాగలక్ష్మి మాట్లాడుతూ అంగన్వాడీల్లో అందిస్తున్న భోజనానికి బదులు సరుకులు నేరుగా ఇవ్వాలని కోరగా సాధ్యం కాదని ఐసీడీఎస్ సూపర్వైజర్ రాజశ్రీ తెలిపారు. పొలాసలోని రెండు అంగన్వాడీ కేంద్రాలు సక్రమంగా పని చేయడం లేదని సర్పంచ్ చిర్ర నరేశ్ సభ దష్టికి తీసుకువచ్చారు. చెరువులు, కుంటలు ఎస్సారెస్పీ నీటితో నింపాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు. మిషన్ కాకతీయ ద్వారా జరిగిన పనుల్లో నాణ్యత లేదని ఎంపీటీసీ రాజన్న, నర్సింగాపూర్ ఎంపీటీసీ రొండి రాజనర్సయ్య అధికారుల దష్టికి తీసుకెళ్లారు. ఎంపీడీవో శ్రీలతరెడ్డి, డాక్టర్ జైపాల్‌రెడ్డి, ఏఈలు సదాశివరెడ్డి, రఘునందన్, శంషేర్‌అలీ, దివ్యశ్రీ, కుమారస్వామి, ఆయాగ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.