పేదల సంక్షేమమే లక్ష్యం
తాండూరు, న్యూస్‌లైన్: పేదల సంక్షేమమే తన లక్ష్యమని, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ పథకాలే తన విజయానికి తోడ్పడతాయని వైఎస్సార్ సీపీ తాండూరు అసెంబ్లీ అభ్యర్థి ఎం.ప్రభుకుమార్ అన్నారు. ఆదివారం ఆయన తాండూరు పట్టణంలోని సాయిపూర్, శాంతినగర్ తదితర ప్రాంతాల్లో ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుకుమార్ మాట్లాడుతూ.. మహానేత వైఎస్సార్ హయాంలోనే తాండూరు పట్టణ అభివృద్ధికి అధిక నిధులు మంజూరయ్యాయని గుర్తు చేశారు. తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాదిరిగా సంక్షేమ పథకాలు అమలు చేసి, పేదలను అన్ని విధాలా ఆదుకోవడమే వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ధ్యేయమన్నారు.
నియోజకవర్గంలో పెద్దేముల్, యాలాల, బషీరాబాద్, తాండూరు పట్టణంలో ప్రజలు తనపై ఎంతో ఆదరణ కనబరుస్తున్నారని పేర్కొన్నారు. తాండూరులో తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, టీడీపీల మాయమాటలు నమ్మవద్దని ఆయన ఓటర్లను కోరారు. అవకాశవాద రాజకీయాలకు పాల్పడే పార్టీలను తరిమికొట్టాలన్నారు. తాను గెలిచిన అనంతరం ఈ ప్రాంత అభివృద్ధితోపాటు పేద వర్గాల అభ్యున్నతికి పాటుపడతానన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు చంద్రశేఖర్ ముదిరాజ్, నాయకులు సంతోష్, మధు, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.