'ఎంపిలను నియంత్రించాలనుకోవడం సరికాదు'
విశాఖపట్నం: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలపై అనకాపల్లి ఎంపీ సబ్బం హరి మండిపడ్డారు. విభజన విషయంలో ఎంపీలను నియంత్రించాలనుకోవడం సరికాదన్నారు. తెలంగాణపై నిర్ణయాన్ని ఎలాంటి షరతులు లేకుండా వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రులు చిదంబరం, గులాం నబీ ఆజాద్, సోనియా గాంధీ రాజకీయ సలహాదారుడు అహ్మద్‌పటేల్ నిర్ణయాలను అమలు చేస్తే, కాంగ్రెస్ భూ స్థాపితం కావడం ఖాయం అని హెచ్చరించారు.
జనం ఉద్యమం చేస్తుంటే చిరంజీవి కేరళలో పర్యటించడం తెలుగుజాతిని అవమానించినట్లేనన్నారు. తెలంగాణ విభజనపై తమకేమీ ముందస్తు సమాచారం లేదని హరి చెప్పారు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ చరిత్ర చూసైనా సోనియా గాంధీ తీరు మార్చుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. తాను రాజీనామా చేసిన తరువాత పార్లమెంట్లో సంతకం పెట్టలేదని చెప్పారు. విమానం టికెట్ క్లెయిమ్ చేయలేదని తెలిపారు.