స్వల్ప ఘర్షణలు
సాక్షి, ఒంగోలు: తొలివిడత ప్రాదేశిక ఎన్నికల్లో భాగంగా జిల్లావ్యాప్తంగా ఆరు నియోజకవర్గాల్లోని 28 జెడ్పీటీసీ స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. మొత్తం 111 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
395 ఎంపీటీసీ స్థానాలకు 1056 మంది అభ్యర్థులు పోటీపడ్డారు. మొత్తం 1327 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలి విడతగా మొత్తం 10,21,189 మంది ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకోవాల్సి ఉండగా..పోలింగ్ మాత్రం మందకొడిగా సాగింది.
కొన్నిచోట్ల ఓటర్లు పోలింగ్‌కు హాజరు కాకపోవడంతో.. ఎన్నికల అధికార యంత్రాంగం ఆయా గ్రామాలకు వెళ్లి ఓటర్లను రప్పించాల్సి వచ్చింది. యర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఓ గ్రామంలో 496 ఓట్లకుగాను.. కేవలం 126 మంది మాత్రమే పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటేశారు. ఉదయం ఏడు నుంచి 12 గంటల వరకు.. ఆ తర్వాత సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటలకు మించి కూడా ఓటర్లు క్యూలైన్లలో బారులు తీరి ఓట్లు వేశారు.
అసౌకర్యాల నడుమ పోలింగ్..
పోలింగ్ కేంద్రాల వద్ద తాగునీటి, వైద్యసహాయ సౌకర్యాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేయడంలో అధికార యంత్రాంగం విఫలమైంది. ఫలితంగా, అద్దంకి మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఒక మహిళా ఓటరు ఓటేయడానికి వచ్చి క్యూలైన్లో సొమ్మసిల్లి పడిపోయింది.
చీరాల, పర్చూరు, మార్కాపురం నియోజకవర్గాల్లోని కొన్ని మండలాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్ల ఏర్పాటు కూడా ఓటర్లకు ఇబ్బందిగా మారింది. కేంద్రం లోపలికి, బయటకు వచ్చేందుకు ఒకే మార్గం పెట్టడంతో మహిళా ఓటర్లు ఇక్కట్లు పడ్డారు.
చీరాలలో పోలింగ్ కేంద్రాల వద్దనే స్వతంత్ర అభ్యర్థులు డబ్బులు, మద్యం పంపిణీ చేస్తున్నట్లు పలువురు అధికారులకు ఫిర్యాదులందించారు.
కలెక్టర్ విజయకుమార్, ఎస్పీ పి. ప్రమోద్‌కుమార్ ఎన్నికలు జరిగిన అన్ని నియోజకవర్గాల్లోనూ పర్యటించి.. పోలింగ్‌ను పరిశీలించారు.
స్వల్పఘర్షణలు..లాఠీచార్జి
తొలి ప్రాదేశికపోరుపై ప్రధాన పార్టీలన్నీ ప్రతిష్టాత్మకంగా పనిచేస్తుండటంతో.. పోలింగ్ కేంద్రాల వద్ద చిన్నచిన్న వివాదాలే ఇరువర్గాల ఘర్షణకు దారితీశాయి.
పర్చూరు నియోజకవర్గంలోని నాగులపాలెం, వీరన్నపాలెం, నూతలపాడు గ్రామాల్లో ఓటర్లను తరలించే విషయంలో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తల మధ్య స్వల్పఘర్షణ చోటు చేసుకుంది. పోలీసుల జోక్యంతో వివాదం సద్దుమణిగింది.
అద్దంకి నియోజకవర్గంలోని సంతమాగులూరు మండలం ఏల్చూరులో పోలింగ్‌బూత్‌లోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన టీడీపీ సీనియర్ నేత కరణం బలరాం తనయుడు వెంకటేష్‌ను పోలీసులు అరెస్టు చేశారు.
సింగరకొండపాలెంలో పోలింగ్ ఏజెంట్ల నడుమ స్వల్ప వివాదం నడిచింది.
బల్లికురవ మండలం పెదఅంబటిపూడిలో రాజకీయ పార్టీలు వేసిన టెంట్లను తొలగించే క్రమంలో.. అడ్డుకోబోయిన కార్యకర్తలపై డ్యూటీ సీఐ లాఠీచార్జి చేశారు.
యర్రగొండపాలెం నియోజకవర్గంలో పెద్దారవీడు మండలం, చాట్లమర అగ్రహారంలో వైఎస్సార్ సీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. యర్రగొండపాలెం మండలం అమానిగుడిపాడు గ్రామంలో ఓట్లను బహిరంగంగా చూపించి వేయాలని దళిత ఓటర్లను టీడీపీ ఏజెంట్ హెచ్చరించడం వివాదానికి దారితీసింది.
మార్కాపురం నియోజకవర్గం కొనకనమిట్ల మండలం నాయుడుపేటలో టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్ ఏజెంట్ల మధ్య ఘర్షణ తలెత్తగా.. వైస్సార్ సీపీ కార్యకర్త వాకా రమణారెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో జాయింట్ కలెక్టర్ యాకూబ్‌నాయక్ అక్కడ ప్రత్యేకంగా కూర్చొని ఎన్నికల కేంద్రం వద్ద పరిశీలించారు.
గిద్దలూరు నియోజకవర్గంలోని కొమరోలు, బేస్తవారిపేట మండలాల్లో పోలింగ్‌బూత్‌లకు నంబర్లు మార్చడంతో .. ఓటర్లు ఏబూత్లోకి ఓటేయాలనే తికమకతో అధికారుల దృష్టికి ఈవిషయాన్ని తీసుకెళ్లారు. దీంతో అక్కడ 2 గంటలపాటు పోలింగ్ నిలిచిపోయింది. కొమరోలు నియోజకవర్గం అల్లీనగరం గ్రామంలో వైఎస్సార్ సీపీ ఏజెంట్ ఫారాలు లేకపోవడంతో.
ఒక గంటపాటు పోలింగ్ ఆగింది. కొమరోలు మండలంలోని తాటిచర్ల గ్రామంలో పోలింగ్ అధికారి వృద్ధుల ఓట్లను సైకిల్ గుర్తుపై వేయాలని సూచిస్తున్నారన్న సమాచారం మేరకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు పోలింగ్ అధికారిని ప్రశ్నించేందుకు వెళుతున్న సమయంలో టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయి రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు స్వల్ప గాయాలయ్యాయి.