క్షిపణి ప్రయోగం విజయవంతం
బాలాసోర్: భూ ఉపరితలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణిని గురువారం భారత్ విజయవంతంగా ప్రయోగించింది. ఇజ్రాయెల్-భారత్ కలిసి తయారుచేసిన ఈ మిస్సైల్ ను ఒడిశాలోని చాందీపూర్ ప్రయోగ కేంద్రం నుంచి పరీక్షించారు. ఉదయం 8.15 నిమిషాలకు ఇంట్రిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి క్షిపణి ప్రయోగం చేసినట్లు డీఆర్డీవో అధికారులు తెలిపారు.
బంగాళాఖాతంలో మానవరహిత వాహనం 'బాన్షీ' టార్గెట్ గా మిస్సైల్ ను ప్రయోగించారు. మిస్పైల్ లోని మల్టీ ఫంక్షనల్ సర్వైలెన్స్ అండ్ త్రెట్ అలర్ట్ రాడార్ (ఎమ్ఎఫ్ఎస్టీఏఆర్) టెక్నాలజీ ద్వారా టార్గెట్ లక్ష్యంగా ప్రయాణిస్తుందని, అలానే 'బాన్షీ'ని ఛేదించినట్లు వివరించారు. ఇదే టెక్నాలజీతో మీడియం, లాంగ్ రేంజ్ లలో ఏడాదికి 100కు పైగా మిస్సైల్స్ ను ఉత్పత్తి చేసేందుకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ లో ప్లాంటును నెలకొల్పినట్లు చెప్పారు. గతంలో ఇదేకోవకు చెందిన లాంగ్ రేంజ్ ఎయిర్ మిసైళ్లను కోల్ కతా తీరంలో భారత నేవీ పరీక్షించింది.
మీడియం రేంజ్ మిస్సైళ్లు 50-70 కిలోమీటర్ల దూరంలో గల టార్గెట్లను ఛేదిస్తాయి. ప్రస్తుతం నడుస్తున్న ట్రయల్ రన్స్ పూర్తయిన తర్వాత మిగతా ఇవి కూడా భారత అమ్ములపొదిలోకి చేరుతాయి. కాగా, ప్రయోగసమయంలో చుట్టుపక్కల ప్రాంతాలవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మత్య్సకారులను వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
మీడియం రేంజ్ మిస్సైల్ ప్రయోగం విజయవంతంకావడంపై రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారీకర్ హర్షం వ్యక్తం చేశారు. డీఆర్డీవో, మిస్సైల్ తయారీలో సాయంచేసిన సంస్థలకు ఆయన ట్విట్టర్ ద్వారా అభినందనలు తెలిపారు.
I congratulate @DRDO_India & Industry teams for the successful flight test of MRSAM (Medium Range Surface to Air Missile) weapon system.
— Manohar Parrikar (@manoharparrikar) 30 June 2016