బాబు పాలనలో దళితులకు రక్షణ లేదు
ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మయ్య
సూదాపాలెం బాధితులకు పరామర్శ
అమలాపురం టౌన్ :
దళితులకు రక్షణ కల్పించడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మయ్య విమర్శించారు. సూదాపాలెంలో చర్మకారులపై దాడి జరిగి, ఆ ఘటనపై రాజ్యసభలో కూడా ప్రస్తావనకు వచ్చిందన్నారు. అయినప్పటికీ కూడా ఈ జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు దళిత బాధితులను పరామర్శించే తీరిక లేదంటే, ఆయనకు దళితులపై ఉన్న ప్రేమ ఏపాటిదో అర్థమవుతోందన్నారు. దాడిలో గాయపడి అమలాపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధిత దళితులను బ్రహ్మయ్య ఆదివారం సాయంత్రం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప సొంత మండలంలో దళితులపై ఇంతటి దారుణమైన దాడి జరగటం బాధాకరమని బ్రహ్మయ్య అన్నారు. దళితులకు రక్షణ దొరకని చంద్రబాబు ప్రభుత్వంలో ఇక తమకు తాము రక్షించుకునే క్రమంలో ప్రతిఘటన ఉద్యమాలకు సిద్ధమవుతున్నామన్నారు.
ఆ కానిస్టేబుల్పైనా కేసు నమోదు చేయాలి
దళితులపై దాడి జరిగాక కూడా ఘటనపై పూర్తి వివరాలు సేకరించకుండా, దాడి చేసినవారి కొమ్ము కాస్తూ బాధితుల కుటుంబీకులను మోకాళ్లపై నిలబెట్టిన పోలీసు కానిస్టేబుల్ కడలి ఏడుకొండలపై కూడా కేసు నమోదు చేయాలని బ్రహ్మయ్య డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాలకు ఐదేసి ఎకరాల భూమి, రూ.8.25 లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని కోరారు. ఆయనతో పాటు ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి దొండపాటి సుధాకర్, పొలిట్ బ్యూరో సభ్యుడు ఆకుమర్తి సూర్యనారాయణ, జిల్లా అధ్యక్షుడు ఆకుమర్తి చిన్నా, కోనసీమ విభాగం అధ్యక్షుడు గంపల సత్యప్రసాద్ బాధితులను పరామర్శించిన వారిలో ఉన్నారు.