‘డెంగీ’ పరీక్షే..! .
విజయనగరంఫోర్ట్ : ఎస్.కోట మండలానికి చెందిన ఎం.సతీష్ అనే 14 ఏళ్ల బాలుడికి డెంగీ లక్షణాలు కనిపించాయి. ప్రభుత్వ ఆస్పత్రిలోని ల్యాబొరేటరీకి వెళ్లడంతో డెంగీ టెస్టింగ్ కిట్లు లేవని చెప్పారు. దీంతో పట్టణంలోని ఓ ప్రైవేటు ల్యాబొరేటరీలో పరీక్ష చేయించారు. పరీక్షల్లో డెంగీ వ్యాధి ప్రాథమిక దశలో ఉందని నిర్ధారణ అయ్యింది. ప్రస్తుతం ఆ బాలుడు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ పరిస్థితి ఈ ఒక్క బాలుడికే మాత్రమే ఎదురైంది కాదు. డెంగీ వ్యాధి నిర్ధారణ పరీక్ష కోసం వచ్చే రోగులందరిదీ. డెంగీ వ్యాధిని నిర్ధారించే ఎలిసా టెస్ట్‌ను కేంద్రాస్పత్రిలో ఏర్పాటు చేశారు. దీంతో జిల్లాలో ఎక్కడ డెంగీ అనుమానిత లక్షణాలు గల రోగులున్నా నిర్ధారణ కోసం ఇక్కడికే పంపిస్తారు. అయితే ప్రస్తుతం కిట్లు లేకపోవడంతో రోగులు ప్రైవేటు ల్యాబొరేటరీలను ఆశ్రయించాల్సిన దుస్థితి.
ఇండెంట్ పెట్టి 15 రోజులయినా..
డెంగీ వ్యాధి నిర్ధారణ కిట్లు కావాలని కేంద్రాస్పత్రి ల్యాబొరేటరీ సిబ్బంది ఇండెంట్ పెట్టి 15 రోజులైనా కిట్లు ఇంతవరకు సరఫరా చేయని దుస్థితి. దీనిని బట్టి ప్రజారోగ్యం పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోంది. ప్రైవేటు ల్యాబొరేటరీలో రూ.800 వరకు వసూలుడెంగీ పరీక్షలకు ప్రైవేటు ల్యాబొరేటరీలో రూ.700 నుంచి రూ.800 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో నిరుపేదలకు ఇది తలకు మించిన భారమైనప్పటికీ గత్యంతరం లేక పరీక్ష చేయించాల్సిన పరిస్థితి. ఇదే విషయాన్ని డీసీహెచ్ఎస్ కె. సీతారామరాజు వద్ద సాక్షి ప్రస్తావించగా డెంగీ నిర్ధారణ కిట్ల కొరత ఉన్నట్టు తనకు ఇప్పుడే తెలిసిందని, త్వరగా వచ్చేటట్టు చర్యలు తీసుకుంటామని తెలిపారు.