కర్నూలు శివారులో కొత్త మార్కెట్
కర్నూలు(అర్బన్): జిల్లాలోని గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి రూ.20 కోట్లు విడుదలైనట్లు జిల్లా పంచాయతీ అధికారిణి ఎం. శోభా స్వరూపరాణి తెలిపారు. మంగళవారం స్థానిక జిల్లాపరిషత్ సమావేశ భవనంలో జిల్లాలోని ఎంపీడీఓలు, ఈఓఆర్డీలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుంచి 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.15,08,10,200, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ నిధులు రూ.4,96,18,200 విడుదలైనట్లు చెప్పారు. ఈ నిధులను 2011 జనాభా ప్రాతిపదికన అన్ని గ్రామ పంచాయతీలకు విడుదల చేస్తామన్నారు. 13వ ఆర్థిక సంఘం నిధులను ఆయా గ్రామ పంచాయతీల్లో తాగునీరు, పారిశుద్ధ్య పనులకు వెచ్చించాల్సి ఉంటుందన్నారు.
ఎస్ఎఫ్సీ నిధులను ఇతర అభివృద్ధి పనులకు వినియోగించుకోవచ్చన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులకు గ్రామీణ పాలనపై అవగాహన కల్పించేందుకు సర్పంచుల పరిచయ వేదిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ నెల 24వ తేదీన నంద్యాల డివిజన్లోని సర్పంచులకు, 29న కర్నూలు, 30న ఆదోని డివిజన్లలోని సర్పంచులకు పరిచయ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీల్లో డిమాండ్ మేరకు పన్నుల వసూలుపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యం, వీధిలైట్లు తదితర వాటిపై పంచాయతీ కార్యదర్శులు, ఈఓఆర్డీలు దృష్టి సారించాలన్నారు. గ్రామ పంచాయతీ పరిధిలోని లే అవుట్లపై సమగ్ర సమాచారాన్ని పంపాలన్నారు. తాగునీటి సరఫరాకు సంబంధించి పీడబ్ల్యుఎస్ పథకాల్లో క్లోరినేషన్ చాలా ముఖ్యమన్నారు. గ్రామ పంచాయతీల్లో రికార్డులను జాగ్రత్తగా నిర్వహించి ప్రతి నెలా నివేదికలు అందించాలన్నారు.