జడ్జీలకు వీడ్కోలు
సాక్షి, హైదరాబాద్: పదోన్నతిపై హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన రంగారెడ్డి జిల్లా కోర్టు ప్రిన్సిపల్ జడ్జి ఎం.ఎస్.కె. జైస్వాల్‌కు మంగళవారం జిల్లా కోర్టులో ఘనంగా వీడ్కోలు పలికారు. జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జైస్వాల్‌ను ఘనంగా సన్మానించారు. జిల్లా న్యాయమూర్తిగా సేవలందించిన హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి లభించడం తనకు తీపిగుర్తు అని, రంగారెడ్డి జిల్లా కోర్టు తనకు మార్గదర్శకమని జైస్వాల్ అన్నారు. రాగద్వేషాలకు అతీతంగా వృత్తిధర్మాన్ని కొనసాగించానని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిపై వెళ్లడం సంతోషాన్ని కలిగిస్తున్నా జిల్లా కోర్టును వదిలి వెళ్తున్నందుకు కొంత బాధగా ఉందన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజిరెడ్డి, కార్యదర్శి సుధాకర్‌రెడ్డి, పలువురు జడ్జీలు, ప్రిపైడింగ్ అధికారులు, బార్ కౌన్సిల్ సభ్యులు, పలువురు న్యాయవాదులు కార్యక్రవుంలో పాల్గొన్నారు.
పలువురి రిలీవ్
హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు, సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి సీతారామమూర్తి, ఎండోమెంట్స్ ట్రిబ్యునల్ చైర్మన్ శివశంకర్‌లు మంగళవారం రిలీవ్ అయ్యారు. బుధవారం వీరు హైకోర్టు న్యాయమూర్తులుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇదిలా ఉండగా సీబీఐ ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయస్థానానికి ఇన్‌ఛార్జ్‌గా సీబీఐ రెండో అదనపు కోర్టు జడ్జి ఎంవీ రమేష్ నియమితులయ్యారు. ఇప్పటికే ఖాళీగా ఉన్న మొదటి కోర్టుకు కూడా రమేష్ ఇన్‌ఛార్జ్‌గా వ్యవహరిస్తున్నారు.
నేడు హైకోర్టులో అదనపు న్యాయమూర్తుల ప్రమాణం
రాష్ట్ర హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా తొమ్మిది మంది బుధవారం ఉదయం ప్రమాణం చేయనున్నారు. వీరితో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతిసేన్‌గుప్తా ఉదయం 10.30 గంటలకు ప్రమాణం చేయించనున్నారు. జిల్లా జడ్జీలుగా ఉన్న 9 మందిని పదోన్నతిపై హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా నియమిస్తూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. బులుసు శివశంకరరావు, ఎం.సీతారామమూర్తి, సరిపెళ్ల రవికుమార్, ఉప్మాక దుర్గాప్రసాదరావు, తాళ్లూరి సునీల్ చౌదరి, మల్లవోలు సత్యనారాయణమూర్తి, మిస్రిలాల్ సునీల్ కిషోర్ జైస్వాల్, అంబటి శంకర నారాయణ, అనీస్ అదనపు న్యాయమూర్తులుగా ప్రమాణం చేసే వారిలో ఉన్నారు.