ఆనందన్ ప్రమాణ స్వీకారం
రాష్ట్ర అటవీ శాఖా మంత్రిగా ఎంఎస్ఎం ఆనందన్ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన చేత రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే, సమాచార కమిషనర్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.ప్రమాణ స్వీకారం రోజు కొత్త మంత్రికి సమస్య బయలు దేరింది. ఆయనపై సీఎం జయలలితకు ఫిర్యాదు చేయడానికి యత్నించిన ఓ మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సాక్షి, చెన్నై : రాష్ర్ట అటవీ శాఖ మంత్రిగా వ్యవహరిస్తూ వచ్చిన ఎంఎస్ఎం ఆనందన్‌ను గతంలో సీఎం జయలలిత తన కేబినెట్ నుంచి ఉద్వాసన పలికిన విషయం తెలిసిందే. మళ్లీ ఆయనకు అవకాశం కల్పిస్తూ రెండు రోజుల క్రితం నిర్ణయం తీసుకున్నారు. అదే శాఖను ఆయనకు కట్టబెడుతూ మళ్లీ తన కెబినెట్లోకి చేర్చుకున్నారు. మంత్రిగా నియమించ బడ్డ ఎంఎస్ఎం ఆనందన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం మధ్యాహ్నం మూడు గంటలకు రాజ్ భవన్లో జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం జె జయలలిత హాజరు అయ్యారు. ఆమె సమక్షంలో రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్య ఎంఎస్ఎం ఆనందన్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
అలాగే సమాచార చీఫ్ కమిషనర్‌గా రామానుజం, కమిషనర్లుగా మురుగానందన్, దక్షిణామూర్తిల చేత కూడా రాష్ట్ర గవర్నర్ రోశయ్య ప్రమాణ స్వీకారం చేయించారు. ఈసందర్భంగా కొత్త మంత్రి ఎంఎస్ఎం ఆనందన్‌ను సీఎం జయలలితతో పాటుగా సహచర మంత్రులు ఓ పన్నీరు సెల్వం, నత్తం విశ్వనాథన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే, మంత్రులందరూ గవర్నర్ రోశయ్య, సీఎం జయలలితతో కలసి గ్రూప్ ఫోటో దిగారు. అనంతరం నేరుగా సచివాలయంలోని తన చాం బర్కు చేరుకున్న ఎంఎస్ఎం ఆనందన్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆర్థిక మంత్రి ఓ పన్నీరు సెల్వం, సీని యర్ మంత్రులు నత్తం విశ్వనాథన్, వైద్యలింగం, ఎడ పా డి పళని స్వామి, పళనియప్పన్, వలర్మతి, గోకుల ఇందిరఈసందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఫిర్యాదుకు యత్నం : మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజే ఎంఎస్ఎం ఆనందన్‌కు కొత్త చిక్కులు బయలు దేరాయి. తిరుప్పూర్‌కు చెందిన జయమణి(33) ఆయన తనకు మోసం చేశారంటూ సీఎం జయలలితకు ఫిర్యాదు చేయడానికి యత్నించారు. పోయెస్ గార్డెన్ వైపుగా వెళ్లిన ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అన్నాడీఎంకే వర్గాల సమాచారం మేరకు తిరుప్పూర్‌కు చెందిన ఆ మహిళకు ఓ కుమారుడు,కుమార్తె ఉన్నట్టు పేర్కొంటున్నారు. భర్తను విడిచి దూరంగా ఉన్న ఆ మహిళతో ఎంఎస్ఎం ఆనందన్‌కు పరిచయం ఉండేదని,ఇప్పుడు ఆమెను విస్మరించ బట్టే ఫిర్యాదు చేయడానికి సిద్ధమైనట్టుందని ఆరోపిస్తుండడం గమనార్హం. ఈ ఫిర్యాదులో ఏ మేరకు వాస్తవం ఉందోనన్నది పక్కన బెడితే, దీనిని సీఎం జయలలిత తీవ్రంగా పరిగణించిన పక్షంలో పదవి ఊడేది మాత్రం ఖాయం.