ఉద్యోగుల ధూంధాం
కలెక్టరేట్లో అట్టహాసంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వారోత్సవాలు స్వాతంత్య్ర సమరయోధులు, అమరుల కుటుంబసభ్యులు, వివిధ రంగాల్లో సేవలందించిన విశిష్ట వ్యక్తులకు ఘన సన్మానం అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు.
సాక్షి, రంగారెడ్డి జిల్లా : తెలంగాణ ఆవిర్భావ వారోత్సవాలను గురువారం కలెక్టరేట్లో అట్టహాసంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ బి.శ్రీధర్ మాట్లాడుతూ.. ఉద్యమాలతో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికోసం ఉద్యోగులు కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. 29వ రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణను అన్ని విధాలుగా అభివృద్ధి చెందేలా చూడాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ఎం.సుధీర్‌రెడ్డి, కాలె యాదయ్య, సంజీవరావు, కనకారెడ్డి, తీగల కృష్ణారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తదితరులు ప్రసంగిస్తూ ఉద్యమంలో ఉద్యోగుల కృషిని కీర్తించారు.
చివరగా స్వాతంత్య్ర సమరయోధులు ఆండాలమ్మ, లక్ష్మీకాంతమ్మ, చంద్రకాంతమ్మ, సీతలను సత్కరించారు. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబ సభ్యులు అనిత (మంచాల), రమేష్ (గండేడ్), ప్రముఖ వాలీబాల్ క్రీడాకారుడు రవికాంత్‌రెడ్డితో పాటు జర్నలిస్టులు బి.సురేష్, గిరీష్, రాజు, విద్యావెంకట్, చందు, బాలరాజులను శాలువా, మెమెంటోలతో సన్మానించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్లు చంపాలాల్, ఎంవీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ధూంధాం, సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి.