mts
-
1998 DSC: ఎమ్టీఎస్‌పై నియామకాలు
సాక్షి, అమరావతి: 1998 డీఎస్సీలో పోస్టుల ఎంపికకు అర్హత సాధించినప్పటికీ, నియామక అవకాశం దక్కని అభ్యర్థుల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు ఫలితం దక్కింది. 24 ఏళ్ల వారి కలలను సీఎం వైఎస్ జగన్ సాకారం చేశారు. వీరు ఇటీవల ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిని మినిమం టైమ్ స్కేలుపై టీచర్లుగా నియమించేందుకు పాఠశాల విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ గురువారం మెమో జారీ చేశారు. 1998 డీఎస్సీ ఎలిజిబుల్ అభ్యర్థుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణలను స్వీకరించనున్నారు. వీరిని 2008 డీఎస్సీ అభ్యర్థులకు మాదిరిగానే ఎమ్.టీ.ఎస్ పై టీచర్ పోస్టుల్లో అడహాక్ పద్ధతిలో నియమిస్తారు. క్లస్టర్ రిసోర్స్ పర్సన్, కేజీబీవీ అకడమిక్ ఇన్స్ట్రక్టర్, మోడల్ స్కూళ్లలో గెస్ట్ లెక్చరర్లు, డీఈవో పరిధిలోని టీచర్ల పూల్‌లో నియమించనున్నారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ను ఆదేశించారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు 98 డీఎస్సీ ఫైల్ పై సీఎం జగన్ సంతకం చేసి న్యాయం చేకూర్చడం పట్ల అభ్యర్థులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. సీఎం నిర్ణయం వల్ల 4,565 మందికి ఇప్పుడు న్యాయం జరగనుందని ఎమ్మెల్సీ కల్పాలతారెడ్డి తెలిపారు. -
వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులకు భరోసా
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో ఉన్న యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు మినిమమ్ టైం స్కేల్ (ఎంటీఎస్) అమలు చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొ. కె.హేమచంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు అవసరంలేదని, దీనిపై మంత్రుల బృందం చర్చిస్తోందని తెలిపారు. ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శనివారం ఆయనతోపాటు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి (ఉన్నత విద్యాశాఖ) సతీష్‌చంద్ర మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వం 2019 ఎన్నికల వేళ ఇచ్చిన జీఓ–24లోని అంశాల్లో నెలకొన్న గందరగోళంతోనే వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులకు ఎంటీఎస్ అమలులో జాప్యం జరుగుతోందని హేమచంద్రారెడ్డి వివరించారు. కాంట్రాక్టు అధ్యాపకులను మభ్యపెట్టేందుకే ఆ సర్కారు జీఓ 24ను ఇచ్చిందన్నారు. అంతేకాక.. ‘గత ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్ల కాలంలో కాంట్రాక్టు అధ్యాపకుల గురించి అస్సలు పట్టించుకోలేదు. 2015 సవరించిన పే స్కేల్స్ ప్రకారం కాంట్రాక్టు అధ్యాపకులకు ఎంటీఎస్ ఇవ్వాలని జీఓలో పేర్కొనడంవల్లే వారికి దాని అమలులో ఆటంకం ఏర్పడింది. వర్సిటీ అధ్యాపకులకు రాష్ట్ర రివైజ్డ్ పే స్కేళ్లు వర్తించవు. వారికి యూజీసీ రివైజ్డ్ పే స్కేళ్లు వర్తిస్తాయి. అయినా.. నాటి ప్రభుత్వం అవేవీ పట్టించుకోకుండా జీఓ ఇచ్చింది’.. అని హేమచంద్రారెడ్డి వివరించారు. ఈ నేపథ్యంలో.. కాంట్రాక్టు అధ్యాపకులకు ఎంటీఎస్ ఎలా వర్తింపజేయాలనే దానిపై ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుత ప్రభుత్వం జీఓ–40 తీసుకొచ్చిందన్నారు. జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో ఎంటీఎస్ సక్రమంగా అమలుచేస్తున్నప్పటికీ యూనివర్సిటీ స్థాయిలో అమలుచేయడం లేదంటూ వస్తున్న వార్తలలో వాస్తవంలేదని ఆయన కొట్టిపారేశారు. గతంలో యూనివర్సిటీల్లో జరిగిన నియామకాల్లో ఒక క్రమపద్ధతి పాటించకపోవడంవల్లే ఇప్పుడు సమస్యలు తలెత్తున్నాయన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులు, ఆర్థికశాఖ అనుమతిలేకుండా నియామకాలు చేశారని.. కనీసం నోటిఫికేషన్ ఇవ్వడం, రిజర్వేషన్లను, రోస్టర్ పాయింట్లను పాటించడం వంటి నిబంధనలు పట్టించుకోలేదన్నారు. ఇక రాష్ట్రంలోని 16 యూనివర్సిటీల్లో ప్రస్తుతం 2,100 కాంట్రాక్టు అధ్యాపకులు ప్రస్తుతం పనిచేస్తున్నారని.. వీరిలో నిబంధనల ప్రకారం నియమితులైన వారెంతమంది? నోటిఫికేషన్ లేకుండా నియమితులైన వారెంతమంది అన్నదానిపై వర్సిటీల్లో స్పష్టతలేకపోవడం ఎంటీఎస్ అమలుకు ఆటంకంగా ఉందన్నారు. జూనియర్, డిగ్రీ కాలేజీల్లో కాంట్రాక్టు అధ్యాపకుల నియామకాలు నిబంధనల ప్రకారం జరుగుతున్నాయని, వర్సిటీల్లో అలా జరగకపోవడంవల్ల ఇబ్బంది అవుతోందని హేమచంద్రారెడ్డి వివరించారు. ‘అయినప్పటికీ కొన్ని వర్సిటీల్లో కాంట్రాక్టు అధ్యాపకులకు వేతనాలు పెంచేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అదికవి నన్నయ్య, జేఎన్టీయూ (కాకినాడ), జేఎన్టీయూ (అనంతపురం), శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీల్లో కాంట్రాక్టు అధ్యాపకులకు ఇప్పటికే 40వేల వరకూ వేతనాలు పెంచాం. అన్నిచోట్ల ఒకే విధంగా వేతనం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం’ అని ఆయన తెలిపారు. కేసులతోనే ఎంటీఎస్ అమలులో సమస్యలు ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర మాట్లాడుతూ.. కనీస టైం స్కేల్ అమలు విషయంలో కొన్ని వర్సిటీల్లోని కొంతమంది ఉద్యోగులు కోర్టుకు వెళ్లిన నేపథ్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేకపోతోందన్నారు. ఇటీవల ఎయిడెడ్ కాలేజీల్లోని ఎయిడెడ్ సిబ్బందిని వర్సిటీల్లో నియమించడం ద్వారా వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులను తొలగిస్తారంటూ కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని సూచించారు. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, ఏ ఒక్క కాంటాక్టు అధ్యాపకుడినీ, ఉద్యోగినీ ప్రభుత్వం తొలగించబోదని ఆయన స్పష్టంచేశారు. ఎయిడెడ్ అధ్యాపకులు 700–800 మంది ఉన్నారని, వారిలో 300 మంది మాత్రమే యూనివర్సిటీలకు అర్హత కలిగి ఉన్నారని తెలిపారు. వారిని నియమించినా కాంట్రాక్టు ఉద్యోగులను తొలగించబోమన్నారు. వచ్చే ఏడాది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం ఇక ప్రభుత్వ జాబ్ క్యాలెండర్ ప్రకారం.. వచ్చే ఏడాది ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వం 2000 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకం చేయనుందని సతీష్‌చంద్ర వెల్లడించారు. వర్సిటీ కాంట్రాకు అధ్యాపకులకు ఇది మంచి అవకాశమన్నారు. ఏపీపీఎస్సీ రాతపరీక్ష ద్వారా ఈ నియామకాలు జరుగుతాయని చెప్పారు. నిజానికి.. కాంట్రాక్టు అధ్యాపకులను, ఉద్యోగులను రెగ్యులర్ చేసే అధికారం రాష్ట్రాలకులేదని సుప్రీంకోర్టు ఇప్పటికే తీర్పులిచ్చిందని ఆయన చెప్పారు. అంతేకాక.. 1994లో తెచ్చిన చట్టం ప్రకారం కూడా కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేసే అవకాశంలేదన్నారు. గతంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు న్యాయం జరిగేది కాదని.. ప్రస్తుత ప్రభుత్వం వారికి అనేక రకాలుగా మేలు చేస్తోందని సతీష్‌చంద్ర వివరించారు. అప్పట్లో ఏజెన్సీల ద్వారా జరిగే నియామకాల్లో అవినీతి జరిగేదని, జీతాలు కూడా కోతపెట్టేవారని గుర్తుచేశారు. కానీ, ప్రస్తుత ప్రభుత్వం అవుట్ సోర్సింగ్‌కు కార్పొరేషన్‌ను (ఆప్కాస్) ఏర్పాటుచేసి అందరికీ ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐతో కూడిన వేతనాలను సమయానికి ఇస్తోందన్నారు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల బాధ్యత ప్రభుత్వానిదేనని, దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదని సతీష్‌చంద్ర భరోసా ఇచ్చారు. -
రాపిడ్ మెట్రోలో వైఫై
గుర్గావ్: రాపిడ్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. 5.1 కిలోమీటర్ల పరిధిలోని ఆరు స్టేషన్ల మీదుగా ప్రయాణించే అన్ని రైళ్లలో ఉచిత వైఫై సేవలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఎంటీఎస్ బ్రాండ్ పేరు కింద పనిచేస్తున్న సిస్టిమా శ్యామ్ టెలిసర్వీసెస్ భాగస్వామ్యంతో రాపిడ్ మెట్రో రైల్ గుర్గావ్ లిమిటెడ్ ఈ సేవలను ప్రయాణికులకు అందిస్తోంది. రాపిడ్ మెట్రో రైళ్లలోనే కాకుండా సికందర్పూర్, ఇండస్ఇండ్ బ్యాంక్ సైబర్ సిటీ, ఫేజ్ 2, మైక్రోమ్యాక్స్ మౌల్శారి అవెన్యూ స్టేషన్లలో కూడా ఎంటీఎస్ ఈ సేవలను కల్పిస్తోంది. ఇందుకోసం ఆయా స్టేషన్లలో ఐదు దుకాణాలను ఏర్పాటుచేసింది. ఇక్కడ ప్రయాణికులకు వైఫై కూపన్లను అందుబాటులో ఉంచింది. ప్రతిరోజు 30వేల మంది ప్రయాణికులు అనుభూతి పొందనున్న ఈ వైఫై సేవలు ఆరు నెలల పాటు ఉచితంగానే అందజేస్తామని ఎంటీఎస్ కంపెనీ ప్రకటించింది. ఎంటీఎస్ 3జీ ప్లస్ నెట్‌వర్క్‌లో 9.8 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ఎంటీఎస్ ఇండియా ప్రధాన కార్యనిర్వహణ అధికారి డిమిత్రి సుకోవ్ మీడియాకు తెలిపారు. ఇతర నగరాల్లోని మెట్రో, విద్యా సంస్థలతో పాటు ఇతర బహిరంగ ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో వైఫై సేవలను అందించాలనుకుంటున్నామని ఆయన వివరించారు. ఈ కాలంలో అనేక మంది వైఫై సేవలను వినియోగించేందుకే ఆసక్తి కనబరుస్తున్నారన్న విషయం తమ కంపెనీ అంతర్గత పరిశోధనలో తేలిందన్నారు. అందుకే రాపిడ్ మెట్రో రైళ్లలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. రాపిడ్ మెట్రోలో ప్రయాణించే వారిలో సుమారు 95 శాతం మంది ఇంటర్నెట్ కావాలన్న విషయాన్ని తాము నిర్వహించిన ఏజే రీసెర్చ్‌లో తెలిసిందని చెప్పారు. వీరిలో 15 నుంచి 35 మధ్య వయస్సు ఉన్నవారే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. ‘రాపిడ్ మెట్రోలో ప్రతిరోజు వెళ్లే ప్రయాణికులు స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు ఉపయోగిస్తున్నారు. ఈ రోజు ప్రారంభించిన ఎంటీఎస్ 3జీ ప్లస్ నెట్‌వర్క్‌లో అధిక వేగంతో ఇంటర్నెట్ సౌకర్యం పొందవచ్చ’ని రాపిడ్ మెట్రో గుర్గావ్ ఎండీ, సీఈవో సంజీవ్ రాయ్ వెల్లడించారు. ఈ వైఫై సేవల వల్ల ప్రయాణికులు తమ విలువైన సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు తమకు కావల్సిన సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి అప్పటికప్పుడు పొందేందుకు వీలుంటుందని తెలిపారు. ఎంటీఎస్ అందిస్తున్న ఈ ఉచిత వైఫై సేవలను అందరు వినియోగించుకోవాలని కోరారు. ఇలాంటి ఆధునిక సేవలు అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు. -
ర్యాపిడ్ మెట్రో రైళ్లలో ఉచితంగా వై-ఫై
గుర్గావ్ ప్రాంతంలో ర్యాపిడ్ మెట్రో రైళ్లలో ప్రయాణికులకు ఉచితంగా వై-ఫై సౌకర్యాన్ని కల్పించాలని నిర్ణయించారు. 5.1 కిలోమీటర్ల పొడవున ఆరు స్టేషన్లలో ఆగే ఈ రైళ్లలో బుధవారం నుంచే ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఎంటీఎస్ బ్రాండ్‌నేమ్‌తో సేవలు అందించే సిస్టెమా శ్యామ్ టెలి సర్వీసెస్, ర్యాపిడ్ మెట్రోరైల్ గుర్గావ్ లిమిటెడ్ కలిసి దీన్ని అందిస్తున్నాయి. ర్యాపిడ్ మెట్రోలతో పాటు ఇంకా సికందర్పూర్, ఇండస్ఇండ్ బ్యాంక్ సైబర్ సిటీ, ఫేజ్2, మైక్రోమాక్స్ మౌల్సరి ఎవెన్యూ స్టేషన్లలో కూడా వై-ఫైని ఉచితంగా అందించాలని ఎంటీఎస్ నిర్ణయించింది. అయితే.. ఈ ఉచిత సేవలు 6నెలల పాటు మాత్రమే కొనసాగుతాయి. ఆ తర్వాతి నుంచి వీటికి కొంత రుసుము చెల్లించాల్సి ఉంటుంది. దీని ద్వారా 9.8 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ అందుబాటులోకి వస్తుందని ఎంటీఎస్ సీఈవో దిమిట్రీ షుకోవ్ తెలిపారు. ఇతర నగరాల్లో కూడా ఈ సేవలు అందించడానికి తాము ప్రయత్నిస్తున్నామన్నారు. 95 శాతానికి పైగా ప్రయాణికులు మెట్రోలో వెళ్లేటప్పుడు ఇంటర్నెట్ ఉపయోగించుకోవాలని భావిస్తున్నారని, 15-35 మధ్య వయస్కులలో ఇది మరీ ఎక్కువగా ఉందని సంస్థ తెలిపింది.