గుర్గావ్: రాపిడ్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. 5.1 కిలోమీటర్ల పరిధిలోని ఆరు స్టేషన్ల మీదుగా ప్రయాణించే అన్ని రైళ్లలో ఉచిత వైఫై సేవలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఎంటీఎస్ బ్రాండ్ పేరు కింద పనిచేస్తున్న సిస్టిమా శ్యామ్ టెలిసర్వీసెస్ భాగస్వామ్యంతో రాపిడ్ మెట్రో రైల్ గుర్గావ్ లిమిటెడ్ ఈ సేవలను ప్రయాణికులకు అందిస్తోంది. రాపిడ్ మెట్రో రైళ్లలోనే కాకుండా సికందర్‌పూర్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ సైబర్ సిటీ, ఫేజ్ 2, మైక్రోమ్యాక్స్ మౌల్‌శారి అవెన్యూ స్టేషన్‌లలో కూడా ఎంటీఎస్ ఈ సేవలను కల్పిస్తోంది. ఇందుకోసం ఆయా స్టేషన్‌లలో ఐదు దుకాణాలను ఏర్పాటుచేసింది. ఇక్కడ ప్రయాణికులకు వైఫై కూపన్‌లను అందుబాటులో ఉంచింది. ప్రతిరోజు 30వేల మంది ప్రయాణికులు అనుభూతి పొందనున్న ఈ వైఫై సేవలు ఆరు నెలల పాటు ఉచితంగానే అందజేస్తామని ఎంటీఎస్ కంపెనీ ప్రకటించింది.
ఎంటీఎస్ 3జీ ప్లస్ నెట్‌వర్క్‌లో 9.8 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ఎంటీఎస్ ఇండియా ప్రధాన కార్యనిర్వహణ అధికారి డిమిత్రి సుకోవ్ మీడియాకు తెలిపారు. ఇతర నగరాల్లోని మెట్రో, విద్యా సంస్థలతో పాటు ఇతర బహిరంగ ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో వైఫై సేవలను అందించాలనుకుంటున్నామని ఆయన వివరించారు. ఈ కాలంలో అనేక మంది వైఫై సేవలను వినియోగించేందుకే ఆసక్తి కనబరుస్తున్నారన్న విషయం తమ కంపెనీ అంతర్గత పరిశోధనలో తేలిందన్నారు. అందుకే రాపిడ్ మెట్రో రైళ్లలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. రాపిడ్ మెట్రోలో ప్రయాణించే వారిలో సుమారు 95 శాతం మంది ఇంటర్నెట్ కావాలన్న విషయాన్ని తాము నిర్వహించిన ఏజే రీసెర్చ్‌లో తెలిసిందని చెప్పారు.
వీరిలో 15 నుంచి 35 మధ్య వయస్సు ఉన్నవారే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. ‘రాపిడ్ మెట్రోలో ప్రతిరోజు వెళ్లే ప్రయాణికులు స్మార్ట్‌ఫోన్‌లు, టాబ్లెట్లు ఉపయోగిస్తున్నారు. ఈ రోజు ప్రారంభించిన ఎంటీఎస్ 3జీ ప్లస్ నెట్‌వర్క్‌లో అధిక వేగంతో ఇంటర్నెట్ సౌకర్యం పొందవచ్చ’ని రాపిడ్ మెట్రో గుర్గావ్ ఎండీ, సీఈవో సంజీవ్ రాయ్ వెల్లడించారు. ఈ వైఫై సేవల వల్ల ప్రయాణికులు తమ విలువైన సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు తమకు కావల్సిన సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి అప్పటికప్పుడు పొందేందుకు వీలుంటుందని తెలిపారు. ఎంటీఎస్ అందిస్తున్న ఈ ఉచిత వైఫై సేవలను అందరు వినియోగించుకోవాలని కోరారు. ఇలాంటి ఆధునిక సేవలు అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు.
రాపిడ్ మెట్రోలో వైఫై
Published Wed, May 14 2014 11:20 PM | Last Updated on Thu, Sep 27 2018 2:34 PM
Advertisement
Advertisement