Rapid Metro
-
రాపిడ్ మెట్రోలో వైఫై
గుర్గావ్: రాపిడ్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. 5.1 కిలోమీటర్ల పరిధిలోని ఆరు స్టేషన్ల మీదుగా ప్రయాణించే అన్ని రైళ్లలో ఉచిత వైఫై సేవలు బుధవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఎంటీఎస్ బ్రాండ్ పేరు కింద పనిచేస్తున్న సిస్టిమా శ్యామ్ టెలిసర్వీసెస్ భాగస్వామ్యంతో రాపిడ్ మెట్రో రైల్ గుర్గావ్ లిమిటెడ్ ఈ సేవలను ప్రయాణికులకు అందిస్తోంది. రాపిడ్ మెట్రో రైళ్లలోనే కాకుండా సికందర్పూర్, ఇండస్ఇండ్ బ్యాంక్ సైబర్ సిటీ, ఫేజ్ 2, మైక్రోమ్యాక్స్ మౌల్శారి అవెన్యూ స్టేషన్లలో కూడా ఎంటీఎస్ ఈ సేవలను కల్పిస్తోంది. ఇందుకోసం ఆయా స్టేషన్లలో ఐదు దుకాణాలను ఏర్పాటుచేసింది. ఇక్కడ ప్రయాణికులకు వైఫై కూపన్లను అందుబాటులో ఉంచింది. ప్రతిరోజు 30వేల మంది ప్రయాణికులు అనుభూతి పొందనున్న ఈ వైఫై సేవలు ఆరు నెలల పాటు ఉచితంగానే అందజేస్తామని ఎంటీఎస్ కంపెనీ ప్రకటించింది. ఎంటీఎస్ 3జీ ప్లస్ నెట్‌వర్క్‌లో 9.8 ఎంబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని ఎంటీఎస్ ఇండియా ప్రధాన కార్యనిర్వహణ అధికారి డిమిత్రి సుకోవ్ మీడియాకు తెలిపారు. ఇతర నగరాల్లోని మెట్రో, విద్యా సంస్థలతో పాటు ఇతర బహిరంగ ప్రాంతాల్లోనూ ఇదే తరహాలో వైఫై సేవలను అందించాలనుకుంటున్నామని ఆయన వివరించారు. ఈ కాలంలో అనేక మంది వైఫై సేవలను వినియోగించేందుకే ఆసక్తి కనబరుస్తున్నారన్న విషయం తమ కంపెనీ అంతర్గత పరిశోధనలో తేలిందన్నారు. అందుకే రాపిడ్ మెట్రో రైళ్లలో ఈ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. రాపిడ్ మెట్రోలో ప్రయాణించే వారిలో సుమారు 95 శాతం మంది ఇంటర్నెట్ కావాలన్న విషయాన్ని తాము నిర్వహించిన ఏజే రీసెర్చ్‌లో తెలిసిందని చెప్పారు. వీరిలో 15 నుంచి 35 మధ్య వయస్సు ఉన్నవారే ఎక్కువ మంది ఉన్నారని తెలిపారు. ‘రాపిడ్ మెట్రోలో ప్రతిరోజు వెళ్లే ప్రయాణికులు స్మార్ట్ఫోన్లు, టాబ్లెట్లు ఉపయోగిస్తున్నారు. ఈ రోజు ప్రారంభించిన ఎంటీఎస్ 3జీ ప్లస్ నెట్‌వర్క్‌లో అధిక వేగంతో ఇంటర్నెట్ సౌకర్యం పొందవచ్చ’ని రాపిడ్ మెట్రో గుర్గావ్ ఎండీ, సీఈవో సంజీవ్ రాయ్ వెల్లడించారు. ఈ వైఫై సేవల వల్ల ప్రయాణికులు తమ విలువైన సమయాన్ని ఆదా చేసుకోవడంతో పాటు తమకు కావల్సిన సమాచారాన్ని ఇంటర్నెట్ నుంచి అప్పటికప్పుడు పొందేందుకు వీలుంటుందని తెలిపారు. ఎంటీఎస్ అందిస్తున్న ఈ ఉచిత వైఫై సేవలను అందరు వినియోగించుకోవాలని కోరారు. ఇలాంటి ఆధునిక సేవలు అందుబాటులోకి రావడం వల్ల ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశముందన్నారు. -
లాంఛనంగా ర్యాపిడ్ మెట్రో ప్రారంభం
గుర్గావ్: ర్యాపిడ్ మెట్రో సేవలను హర్యానా ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా ఆదివారం లాంఛనంగా ప్రారంభించారు. సికందర్పూర్ మెట్రో స్టేషన్లో జరిగిన ఈ కార్యక్రమంలో హుడాతో పాటు ఆ రాష్ట్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. ఇందుకోసం ఉదయం పది నుంచి రెండు గంటల పాటు మెట్రో సేవలను నిలిపివేశారు. నవంబర్ 14నే అనధికారికంగా ర్యాపిడ్ రైళ్ల సేవలు అందుబాటులోకి వచ్చాయని మెట్రో అధికారులు తెలిపారు. కాగా, 5.1 కిలోమీటర్ల మేర ఆరు స్టేషన్లు ఉన్న మార్గంలో ఈ ర్యాపిడ్ మెట్రో రైళ్లు సేవలు అందిస్తున్నాయని చెప్పారు. -
ర్యాపిడ్ మెట్రోకు ఆదరణ అంతంతే..
అధికారులు మాత్రం ఇది మంచి స్పందనేనని, భవిష్యత్‌లో ఫలితాలు మరింత బాగుంటాయని చెబుతున్నారు. ‘ప్రజల స్పందన బాగుంది.వినియోగదారులకు మా కృతజ్ఞతలు. భవిష్యత్‌లో మరిన్ని మైలురాళ్లు అధిగమించడానికి మేం ప్రయత్నిస్తాం’ అని ర్యాపిడ్ మెట్రో సీఈవో సంజీవ్ రాయ్ అన్నారు. డీఎల్ఎఫ్ ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా ర్యాపిడ్మెట్రోరైలు సేవలు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఢిల్లీవాసులు ఎక్కువలో ఎక్కువ మంది మోనోరైలు వినియోగిస్తారని అధికారులు మొదట భావించారు. ప్రతి రోజు మూడు నుంచి నాలుగు శాతం అధికంగా ప్రయాణికుల సంఖ్య నమోదవుతున్నట్టు అధికారిక సమాచారం.ఉదయం 8-30 గంటల నుంచి 11 గంటలవరకు, సాయంత్రం 5 గంటల నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే ప్రయాణికుల రద్దీ ఉంటోంది. సికిందర్పురా స్టేషన్‌ను ఇంటర్చేంజ్ స్టేషన్‌గా వినియోగిస్తుండడంతో ఇక్కడ రద్దీ అధికంగా కనిపిస్తోంది. ఢిల్లీ-గుర్గావ్ ఎక్స్‌ప్రెస్ వేకు సమీపంలోనిర్మిస్తున్న గేట్‌వే టవర్ స్టేషన్ పూర్తయితే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. ర్యాపిడ్ మెట్రో ప్రయాణికుల్లో ఎక్కువగా ఉద్యోగులే ఉంటున్నారు. ఆయా ప్రాంతాల్లోని కార్యాలయాల్లో పనిచేసేవారంతా ఈ రైలును వినియోగిస్తున్నారు. దీంతో వారాంతాలు, సెలవుల్లో ప్రయాణికుల సంఖ్య పూర్తిగా తగ్గిపోతోంది. ఇంటర్చేంజ్ స్టేషన్ అయిన సికిందర్పురా స్టేషన్లో పార్కింగ్ వ్యవస్థ లేకపోవడం ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి మరో కారణమవుతోంది. సెక్టార్-17 వరకు ర్యాపిడ్ మెట్రోను విస్తరిస్తే ప్రయాణికుల సంఖ్య మరింత పెరుగుతందని స్థానిక ఉద్యోగులు చెబుతున్నారు. ప్రతినిత్యం లక్ష మందికి సేవలు అందించాలని ర్యాపిడ్‌మెట్రో లక్ష్యంగా నిర్దేశించుకుంది. ‘ఈ సేవలను నెల మధ్యలో ప్రారంభించడం వల్ల ఇతర రవాణా సంస్థల్లో నెలవారీ పాసులు కొన్న ఉద్యోగులు ఇంకా ర్యాపిడ్ మెట్రో వినియోగించడం లేదు. డిసెంబర్ ఒకటి నుంచి ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నాం’ అని ర్యాపిడ్‌మెట్రో అధికార ప్రతినిధి తెలిపారు. నగరప్రజలు ముఖ్యంగా సైబర్‌సిటీ ఉద్యోగుల్లో ర్యాపిడ్ మెట్రోపై అవగాహన పెంచేందుకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని అధికారులు ప్రకటించారు. హర్యానా రోడ్డు రవాణాసంస్థ ఫీడర్ బస్సు సేవలను కూడా ప్రవేశపెట్టినందువల్ల మెట్రో ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని తెలిపారు. మౌల్సారీ ఎవెన్యూ మెట్రోస్టేషన్ నుంచి తమ దుకాణం వరకు ఏంబియెన్స్ మాల్ కూడా షటిల్ బస్సు ప్రారంభించిందని ర్యాపిడ్‌మెట్రో అధికార ప్రతినిధి వివరించారు. ర్యాపిడ్‌మెట్రో గుర్గావ్ లిమిటెడ్ ఈ నెల 11 నుంచి ఈ సేవలను ప్రారంభించింది. సికందర్పూర్ నుంచి ఫేజ్ 3 స్టేషన్ వరకు నిర్మించిన ఈ 5.1 కిలోమీటర్ల మార్గంలో మొత్తం ఆరు స్టేషన్లు ఉంటాయి. -
ర్యాపిడ్ మెట్రో ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: సైబర్‌సిటీ గుర్గావ్ను ఢిల్లీ మెట్రో నెట్‌వర్క్‌తో అనుసంధానించే రాపిడ్‌మెట్రో రైలు సేవలు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో ఉద్యోగ, వ్యాపారాల కోసం ఢిల్లీ-గుర్గావ్ల మధ్య ప్రయాణించేవారి ఇబ్బందులు ఇక దూరమైనట్లే. అంతేగాకుండా ఈ రెండు నగరాల మధ్య ట్రాఫిక్ సమస్య కూడా కనుమరుగవనుంది. దేశంలోనే ఇది మొట్టమొదటి ప్రైవేట్ మెట్రో . దీనిని ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ సంస్థ నడుపుతోంది. గురువారం బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్కూలు పిల్లలకు ర్యాపిడ్ మెట్రోలో ఉచిత ప్రయాణాన్ని కానుకగా అందించారు. ట్రయల్ రన్ తర్వాత గతవారం తుది తనిఖీ నిర్వహించిన రైల్వే భద్రతా కమిషనర్ ర్యాపిడ్ మెట్రో నడపడానికి అనుమతించడంతో 5.1 కిలోమీటర్ల తొలిదశ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మెట్రో మార్గంలో సికిందర్‌పూర్, డీఎల్ఎఫ్ ఫేజ్-2, బెల్వర్డేర్ టవర్, మోల్సారీ ఎవెన్యూ, డీఎల్ఎఫ్ ఫేజ్-3 స్టేషన్లు ఉన్నాయి. ర్యాపిడ్ మెట్రోను సికిందర్‌పూర్ మెట్రో స్టేషన్ వద్ద ఢిల్లీ మెట్రోతో అనుసంధానం చేశారు. ర్యాపిడ్ మెట్రో వేళలు ఢిల్లీ మెట్రో వేళలతో సమన్వయం చేస్తారు. దీంతో ప్రయాణికులు ర్యాపిడ్ మెట్రో కోసం వేచిచూడవలసిన అవసరముండదు. ర్యాపిడ్ మెట్రో కోసం 12 రూపాయల టికెట్‌గా నిర్ధారించారు.