మనస్పర్థలు...అభివృద్ధిపై నీలినీడలు
నగరపాలక సంస్థలో అంతర్యుద్ధం
మేయర్, కమిషనర్ మధ్య సమన్వయలోపం
మేయర్ అనుమతికి విరుద్ధంగా ఎజెండాలోకి అంశాలు
స్థాయీ సంఘం సమావేశంలో మరోసారి బయటపడిన విభేదాలు
సాక్షి, రాజమహేంద్రవరం/ రాజమహేంద్రవరం సిటీ : రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో కమిషనర్ వి.విజయ రామరాజు, మేయర్ పంతం రజనీ శేషసాయిల మధ్య సమన్వయ లోపం నగర అభివృద్ధికి శాపంగా మారింది. కలిసి పని చేయాల్సిన మేయర్, కమిషనర్ ఎవరి దారి వారిదన్నట్లుగా కొద్ది నెలలుగా వ్యవహరిస్తుండడంతో కౌన్సిల్లో ఆమోదం పాందిన పనులు ముందుకు సాగడం లేదన్న విమర్శలున్నాయి. ఇదే విషయాన్ని నగర ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ విలేకర్ల సమావేశంలో ప్రస్తావించారంటే నగర అభివృద్ధిపై ఏ మేరకు నీలినీడలు కమ్ముకుంటున్నాయో బయటపడుతోంది. మూడు నెలలకోసారి నిర్వహించే కౌన్సిల్ సమావేశంలో నగర అభివృద్ధిపై పలు నిర్ణయాలు తీసుకుంటారు. మిగిలిన రోజుల్లో చేపట్టాల్సిన పనుల కోసం ప్రతి వారం మేయర్ అధ్యక్షతన ఐదుగురు సభ్యులతో స్థాయీ సంఘం సమావేశం జరుగుతుంది. ఈ రెండు సమావేశాల్లో తీసుకున్న పలు ప్రతిపాదనలు, తీర్మానాలకు అనుగుణంగా అంచనాలు రూపొందించి సభ్యుల ఆమోద ముద్రతో పనులకు శ్రీకారం చుట్టారు. దీనికి భిన్నంగా నిప్పూ, ఉప్పుగా కమిషనర్, మేయర్ ఉండడంతో వారం వారం జరగాల్సిన స్థాయీ సంఘం సమావేశం కూడా జరగడం లేదు. దీంతో ప్రగతి పడకేస్తోంది.
మరోసారి విభేదాలుబట్టబయలు...
తాజాగా సోమవారం జరిగిన స్థాయీ సంఘం సమావేశం వాయిదా పడడం మరోసారి మేయర్, కమిషనర్ మధ్య జరుగుతున్న వర్గపోరును బహిర్గతం చేసింది. గత నెల 25న 16 అంశాలతో రూపొందించిన ఎజెండాను నగరపాలక సంస్థ సెక్రటరీ మేయర్ అనుమతి కోసం పంపారు. అదే నెల 28న సమావేశం నిర్వహించాలని మేయర్ నిర్ణయించారు. అనంతరం సెక్రటరీ సెలవుపై వెళ్లారు. ఆ స్థానంలో ఇన్ చార్జిగా వ్యవహరిస్తున్న అధికారి కమిషనర్ ఆదేశాలతో మరో తొమ్మిది అంశాలు ఉన్నాయంటూ 28న మేయర్ దృష్టికి తీసుకొచ్చారు. అప్పటికే నిర్ణయించిన ప్రకారం 16 అంశాలతో నవంబర్ 7న స్థాయీ సంఘం సమావేశం నిర్వíßంచాలని మేయర్ ఇన్ చార్జ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్న అధికారికి సూచించారు. అయితే సోమవారం 25 అంశాలతో కూడిన ఎజెండా స్థాయీ సంఘం సమావేశం ముందుకు వచ్చింది. తన నిర్ణయానికి వ్యతిరేకంగా 25 అంశాలతో ఎజెండా పెట్టడడంతో మేయర్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సమావేశాన్ని వాయిదా వేశారు. ఇలా ఎందుకు జరిగిందో వివరణ ఇవ్వాలంటూ అధికారులను ఆదేశించారు. అయితే సమావేశాన్ని మేయర్ వాయిదా వేయడాన్ని అధికార పార్టీకి చెందిన సంఘ సభ్యులు వ్యతిరేకిస్తూ ఇన్ చార్జి సెక్రటరీకి లేఖ రాశారు. చైర్మన్ నిర్ణయాన్ని వ్యతిరేకించే అవకాశం లేకపోయినప్పటికీ సభ్యులు లేఖ రాయడం గమనార్హం. ఈ ఘటనతో మేయర్, అధికార పార్టీ సభ్యుల మధ్య ఉన్న లుకలుకలు మరింత ముదిరి పాకానపడ్డట్టయింది.