వైజాగ్‌లో ‘దాల్ లేక్’!
ఇదీ దాల్ లేక్...
జమ్మూ, కశ్మీర్లో ఇది రెండో అతిపెద్ద సరస్సు. దీనిని ఫ్లవర్ లేక్, శ్రీనగర్ జ్యువెల్ అని కూడా పిలుస్తారు. 5 అడుగుల నుంచి 20 అడుగుల లోతుతో 18 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే ఈ లేక్‌లో బోటింగ్‌తో పాటు అక్కడ సేద తీరేందుకు రూమ్స్, భోజనం చేసేందుకు హోటల్స్ మాత్రమే కాకుండా షాపింగ్ చేసేందుకు షాపులు కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ హోటల్స్, షాప్స్ కూడా బోట్ల మీదనే ఏర్పాటు చేయడంతో పాటు లేక్‌లోనే ఉండటం పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఒక వైపు మంచుకొండలు.. మరోవైపు సరస్సు అందాలను చూస్తూ బోటింగ్ చేయడం పర్యాటకులను కట్టిపడేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మంది పర్యాటకులు ఇక్కడకు వచ్చి బోటింగ్ చేసి సేదతీరడాన్ని అమితంగా ఆస్వాదిస్తున్నారు. ఇదేతరహాలో ఇక్కడ ముడసర్లోవను అభివృద్ధి చేసే అవకాశం ఉందన్న అభిప్రాయం జీవీఎంసీ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ముడసర్లోవ రిజర్వాయర్‌లో బోటులో విహరిస్తూ కంబాలకొండ అందాలను తనివితీరా చూస్తూ కాఫీ తాగాలని ఉందా? అక్కడే నచ్చిన వాటిని కొనుగోలు చేసి ప్రకృతిని ఆస్వాదించాలని ఉందా? అచ్చంగా శ్రీనగర్‌లోని దాల్ లేక్ తరహాలో... ఇక్కడ పర్యాటకులను ఆకర్షించేందుకు...నగర వాసులకు ఆహ్లాదాన్ని అందించేందుకు గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) సమాయత్తమవుతోంది. తాజాగా జీవీఎంసీ అధ్యయన యాత్రలో భాగంగా శ్రీనగర్ మునిసిపల్ కార్పొరేషన్ పర్యటనలో ‘దాల్ లేక్’ను పరిశీలించారు.
పర్యాటకులకు ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచేందుకు వీలుగా దాల్ లేక్‌ను అభివృద్ధి చేశారు. బోటులో షికారు చేస్తూ... ఫ్యామిలీతో కలిసి అక్కడే భోజనం చేయడం, షాపింగ్ చేసేందుకు వీలుగా దీనిని అభివృద్ధి చేశారు.అదేతరహాలో ఇక్కడ ముడసర్లోవను అభివృద్ధి చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై మేయర్ గొలగాని హరి వెంకటకుమారి అధికారులతో సమీక్షించారు. దీనిపై అధ్యయనం చేయాలని జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులను ఆమె ఆదేశించారు. ప్రధానంగా నగర వాసులతో పాటు విశాఖకు విచ్చేసే పర్యాటకులను ఆకర్షించే విధంగా అభివృద్ధి చేయాలని సూచించారు.
ముడసర్లోవలో....!
వాస్తవానికి గతంలో జీ–20 సమావేశాల సందర్భంగా వచ్చిన ప్రపంచదేశాల అతిథుల బృందం ముడసర్లోవలో పర్యటించారు. అక్కడ ఏర్పాటు చేసిన నీటిపై తేలియాడే సౌర విద్యుత్ ప్లాంటు (ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్)ను పరిశీలించారు. ఇప్పటికే ముడసర్లోవ వివిధ రకాలుగా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ఈ రిజర్వాయర్ మొత్తం 62 ఎకరాల్లో విస్తరించి ఉంది. నగర ప్రజలకు మరింత ఆహ్లాదాన్ని పంచేందుకు నిరంతరం ప్రయత్నించడంలో భాగంగా దాల్ లేక్ తరహాలో ముడసర్లోవ లేక్‌ను అభివృద్ధి చేయాలని జీవీఎంసీ మేయర్ భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా దీనిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని ఇంజినర్స్ డే సందర్భంగా అధికారులను ఆదేశించారు. ప్రధానంగా రిజర్వాయర్ ఎంత లోతులో ఉన్నది? బోటింగ్ సమయంలో పర్యాటకులకు ఇబ్బంది లేకుండా ఏ విధంగా చర్యలు తీసుకోవాలి? ఎక్కడెక్కడ సేదతీరేందుకు షాపింగ్, హోటల్స్ వంటి సౌకర్యాలు కల్పించే అవకాశం ఉంది? అనే అంశాలను పరిశీలించి నివేదిక రూపొందించాలని సూచించారు.
అధ్యయనం చేయాలని ఆదేశించాం
శ్రీనగర్‌లో కార్పొరేటర్లతో కలిసి పర్యటించాం. అక్కడ నగరంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను గమనించాం. అక్కడ 4 జోనల్ కార్యాలయాలు ఉన్నాయి. మనతో పోలిస్తే చిన్న ప్రాంతం. అయినప్పటికీ అక్కడ దాల్ లేక్‌ను పర్యాటకంగా అభివృద్ధి చేశారు. అదేతరహాలో ఇక్కడ ముడసర్లోవలో అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని భావిస్తున్నాం. ఇదే విషయంపై అధ్యయనం చేయాలని జీవీఎంసీ అధికారులను ఆదేశించాం. ఇప్పటికే నగరవాసులకు సౌకర్యాలను కల్పించడంలో జీవీఎంసీ ముందంజలో ఉంది. బస్ బేలు, రోడ్ల వెడల్పు, జంక్షన్ల అభివృద్ధి, వైఎస్సార్ వ్యూ పాయింట్ ఏర్పాటు, బీచ్ క్లీనింగ్ యంత్రాలతో ఎప్పటికప్పుడు బీచ్‌ను పరిశుభ్రంగా ఉంచడం వంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాం. ముడసర్లోవ రిజర్వాయర్‌ను దాల్ లేక్ తరహాలో అభివృద్ధిపై అధ్యయనం చేసిన తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ముందుకు వెళతాం.
– గొలగాని హరి వెంకటకుమారి, మేయర్