ముడసర్లోవ రిజర్వాయర్‌లో మునిగి యువకుడి మృతి
మృతదేహాన్ని వెలికితీసిన గజ ఈతగాళ్లు
విశాఖపట్నం : ముడసర్లోవ రిజర్వాయర్‌లో స్నేహితులతో ఈతకు దిగిన ఓ యువకుడు బురదలో కూరుకుపోయి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం మేరకు వివరాలిలావున్నాయి. నగరంలో కొబ్బరితోటకు చెందిన దానల సంతోష్(21), ఆరిలోవకు చెందిన శంకర్, శివ, వెంకటేశ్వరరావు స్నేహితులు. వీరిలో శివ ఇటీవల బైక్ కొన్నాడు. ఈ సందర్భంగా ఆదివారం సాయంత్రం మిగిలిన స్నేహితులకు పార్టీ ఇచ్చాడు. దీనిలో భాగంగా ముడసర్లోవ రిజర్వాయర్ వెనుక భాగంలో పూటుగా కల్లు తాగిన నలుగురు రిజర్వాయర్ ఒడ్డున కొంత సేపు కూర్చొన్నారు.
తనకు జెట్టీలో ఈత అనుభవం ఉందని, ఈ రిజర్వాయర్‌లో ఈదడం పెద్ద కష్టం కాదని తోటి స్నేహితులతో సంతోష్ చెప్పాడు. శివకు కూడా కొంతవరకు ఈత వచ్చు. దీంతో శివ, సంతోష్ రిజర్వాయర్‌లో ఈతకు దిగారు. ఒడ్డు నుంచి కొంత దూరం వెళ్లిన శివ తిరిగి వెనుదిరిగాడు. సంతోష్ మాత్రం మరికొంత దూరం వెళ్లి ఊపిరాడక నీటిలో మునిగిపోయాడు. గాబరాపడిన మిగిలిన స్నేహితులు రాత్రి 10 గంటల తర్వాత ఆరిలోవ పోలీసులకు, సంతోష్ తల్లిదండ్రులకు విషయాన్ని తెలియజేశారు.
వెంటనే రిజర్వాయర్ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు మృతదేహం కోసం గాలించారు. ఆచూకీ లభ్యం కానందున సోమవారం ఉదయం జోడుగుళ్లుపాలెం ప్రాంతానికి చెందిన గజ ఈతగాళ్లను తీసుకువచ్చి రిజర్వాయర్‌లో గాలింపు చేపట్టారు. బురదలో కూరుకుపోయిన సంతోష్ మృతదేహాన్ని సాయంత్రం బయటకు తీశారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు కేజీహెచ్‌కు తరలించారు. సంతోష్‌కు ఏడాది క్రితం వివాహమైందని, అతని భార్య గర్భవతి అని తండ్రి వెంకటరమణ కన్నీటి పర్యంతమయ్యారు.
ప్రాణం తీసిన ఈత సరదా
Published Tue, Apr 7 2015 2:41 AM | Last Updated on Wed, Aug 1 2018 2:31 PM
Advertisement