అక్బర్‌పై సీఎం యోగి సంచలన వ్యాఖ్యలు
లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మొఘల్ చక్రవర్తులు అక్బర్, ఔరంగజేబు, బాబర్‌లపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. బాబర్, అక్బర్, ఔరంగజేబు భారతదేశాన్ని నాశనం చేసి ఆక్రమించుకోవడానికి వచ్చినవారని యోగి వ్యాఖ్యానించారు. మహారాణా ప్రతాప్ చూపిన మార్గాన్ని యువత అనుసరించాలని సూచించారు. ఈ నిజాన్నియువత అంగీకరిస్తే భారతదేశానికి ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయని తెలిపారు.
మహారాణా ప్రతాప్ 477వ జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే మహారాణా ప్రతాప్, గురు గోవింద్ సింగ్, ఛత్రపతి శివాజీ మనందరికీ ఆదర్శప్రాయులన్నారు. యువకులు మహారాణా ప్రతాప్ నుంచి ఆత్మగౌరవంతో ఎలా జీవించాలి, జీవితంలో ఎలా బతకాలో నేర్చుకోవాలన్నారు. గొప్ప చరిత్ర ఉన్న భారతదేశ ఔన్నత్యాన్ని కాపాడాలని యువకులను కోరారు. గొప్ప చరిత్రను కాపాడుకోలేని వారు.. భారతదేశాన్ని ఆక్రమణదారుల నుంచి కాపాడలేరని సీఎం అన్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ రాం నాయక్, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రిటైర్డ్ జనరల్ వీకే సింగ్ కూడా పాల్గొన్నారు.