బైరి నరేశ్ అనుచిత వ్యాఖ్యలు.. నిజామాబాద్‌లో టెన్షన్.. టెన్షన్..
సాక్షి, బాల్కొండ(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బైరి నరేశ్ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ సభలో పాల్గొని చప్పట్లు కొట్టిన రెంజర్ల రాజేశ్ అనే గాయకుడి ఇంటి ముందు అయ్యప్ప భక్తులు శుక్రవారం సాయంత్రం నుంచి సుమారు 6 గంటలపాటు(అర్థరాత్రి వరకు) ధర్నా చేశారు. గతంలోనూ రాజేశ్ అయ్యప్పను కించపరుస్తూ పాటలు పాడి యూట్యూబ్‌లో పెట్టాడని ఆరోపించారు. అయితే అతను ఇంట్లో లేకపోవడంతో వెంటనే పిలిపించాలని కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు.
ఈ క్రమంలో అతని స్నేహితుడు సుమన్ వచ్చి నిరసన తెలుపుతున్న అయ్యప్ప భక్తులను వీడియో తీస్తూ అనుచిత వ్యాఖ్యలు చేయడంతో అయ్యప్ప భక్తులు మరింత ఆగ్రహానికి లోనయ్యారు. రాజేశ్‌తోపాటు సుమన్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయం తెలుసుకొని అక్కడకు చేరుకున్న పోలీసులు అయ్యప్ప భక్తులను సముదాయించారు. రాత్రి 11 గంటల సమయంలో సుమన్ చేత అయ్యప్ప భక్తులకు బహిరంగ క్షమాపణ చెప్పించి అతన్ని అదుపులోకి తీసుకోవడంతో భక్తులు ఆందోళన విరమించారు.
ప్రస్తుతం రాజేష్ నెల్లూరులో ఉన్నట్టు సమాచారం. రాజేష్‌ను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ శనివారం కూడా అయ్యప్ప స్వాములు ఆందోళనకు దిగారు. దీంతో రేంజర్లలో పోలీసులు భారీగా మోహరించారు.
చదవండి: కొడంగల్: భైరి నరేష్‌పై కేసు నమోదు
కోస్గిలో ఉద్రిక్త పరిస్థితి
సాక్షి, మహబూబ్‌నగర్: నాస్తిక సమాజ రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేశ్ ఇటీవల వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో నిర్వహించిన సభలో అయ్యప్ప సహా హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని నిరసిస్తూ హిందూ సంఘాల ప్రతినిధులు శుక్రవారం నారాయణపేట జిల్లా కోస్గిలో చేపట్టిన ధర్నా, నిరసన ఉద్రిక్తతకు దారితీసింది.
స్థానిక శివాజీ చౌరస్తాలో పాలమూరు–తాండూరు ప్రధాన రహదారిపై పలువురు హిందూ సంఘాల ప్రతినిధులు బైఠాయించి నిరసన తెలుపుతుండగా గుండుమాల్‌కు చెందిన బాలరాజు అనే యువకుడు తన సెల్ఫోన్లో వీడియో తీస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో నిరసనకారులు బాలరాజుపై దాడి చేయగా పోలీసులు ఆ యువకుడిని పోలీసుస్టేషన్‌కు తరలించారు. కాగా, బైరి నరేశ్‌పై 153ఏ, 295ఏ, 298, 505 సెక్షన్ల కింద కొడంగల్ పోలీస్ స్టేషన్లో కేసులు నమోదు చేసినట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.
కఠినంగా శిక్షించాలి: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: కోట్లాది మంది హిందువుల మనోభావాలను కించపరిచిన బైరి నరేష్‌ను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాషాతోపాటు వీహెచ్‌పీ రాష్ట్ర నేతలు డిమాండ్ చేశారు.