నెట్టింట్లో యూనివర్సిటీ..
కంప్యూటరీకరణ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో కొత్త పుంతలతో ప్రపంచం గ్లోబల్ విలేజ్‌గా మారిపోయింది. ఇదే ఒరవడితో విద్యారంగంలోనూ ఆధునికత సంతరించుకుంటోంది. ఈ క్రమంలో విద్యార్థులకు అందుబాటులోకి వచ్చి.. దినదిన ప్రవర్థమానం అవుతోంది మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ (మూక్స్). ఇంటర్నెట్ ఉంటే చాలు.. అంతర్జాతీయ స్థాయి ఇన్స్టిట్యూట్లలో కోర్సులు అభ్యసించొచ్చు. తక్కువ ఖర్చుతో ఉన్నత ప్రమాణాలతో కూడిన కోర్సులు పూర్తిచేసుకోవడమే కాకుండా.. ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉండే సర్టిఫికెట్లు పొందేందుకు సరికొత్త మార్గంగా నిలుస్తున్న మూక్స్ వివరాల గురించి ఈరోజు తెలుసుకుందాం..! - సాక్షి,స్కూల్ ఎడిషన్
► మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్.. విద్యారంగంలో సరికొత్త విప్లవం. ఒకరకంగా చెప్పాలంటే దూర విద్యావిధానంలో ఇదో వినూత్న విధానం. నిర్దిష్ట సర్వీస్ ప్రొవైడర్ ఒప్పందం కుదుర్చుకున్న ఇన్స్టిట్యూట్లలో కోర్సులను ఆన్లైన్లో అభ్యసించే పద్ధతి. ఫలితంగా విద్యార్థులు అంతర్జాతీయ స్థాయి సంస్థల్లో విద్యనభ్యసించి సర్టిఫికెట్లు పొందొచ్చు. ఒకప్పుడు ఆన్లైన్ విధానంలో కేవలం ఇన్స్టిట్యూట్ల లెక్చర్స్‌కు అనుగుణంగా ఈ-లెర్నింగ్ సదుపాయం ఉండేది. ఇప్పుడు మూక్స్ విధానంలో కోర్సు మెటీరియల్‌తో పాటు వీడియో లెక్చర్స్, స్టూడెంట్స్- ప్రొఫెసర్స్ ఇంటరాక్టివ్ యూజర్ ఫోరమ్స్ అందుబాటులోకి వచ్చాయి. దీనివల్ల అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లో టాప్ యూనివర్సిటీల్లో కోర్సులను సైతం నామమాత్రపు ఫీజులతో నేరుగా మూక్స్ ద్వారా అభ్యసించొచ్చు.
మన విద్యార్థులకు ఎంతో మేలు..
మూక్స్ విధానం భారతీయ విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుందని నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ వంటి కోర్సుల నాణ్యతా ప్రమాణాలు, తదితర అంశాలు పరిగణలోకి తీసుకుంటే.. ఈ విధానం ఎంతో ఉపయుక్తమైంది. దేశంలో ప్రొఫెషనల్ కోర్సుల విషయంలో టీచర్- స్టూడెంట్స్ నిష్పత్తి సగటున 1:40 గా ఉంటోంది. ఈ నేపథ్యంలో క్లాస్‌రూమ్‌లో అధ్యాపకులు చెప్పే అంశాలన్నింటినీ అవగతం చేసుకోవడం కష్టమే. అదేవిధంగా అటు అధ్యాపకుల కోణంలోనూ అంత మంది విద్యార్థులను పర్యవేక్షించడం కష్టసాధ్యం. ఈ సమస్యలకు కూడా మూక్స్ పరిష్కారం చూపుతోంది.
అభారత్లో వృద్ధి..
మూక్స్ ప్రస్థానం అమెరికాలో మొదలైంది. అమెరికాలోని హార్వర్డ్ వర్సిటీ, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, యూనివర్సిటీ ఆఫ్ రోచస్టర్ వంటి ప్రముఖ సంస్థలు ఆన్లైన్ వెబ్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో ఒప్పందం కుదుర్చుకుని వర్చువల్ క్లాస్ రూమ్ పేరుతో పలు కోర్సులను అందించడం ప్రారంభించాయి. ఈ విధానానికి భారత విద్యార్థులు బాగా ఆకర్షితులవుతున్నారు. దీనిలో ఎడెక్స్ కోర్సులకు 20 లక్షల మంది నమోదు చేసుకుంటే.. అందులో 2.5 లక్షల మంది మన విద్యార్థులే ఉన్నారు. మూక్స్‌లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్యలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉండటం విశేషం.
తీరుతెన్నులు..
ఇందులో ఇన్స్టిట్యూట్లు అధికారికంగా సదరు సర్వీస్ ప్రొవైడర్స్‌తో ఒప్పందం చేసుకుంటాయి. తద్వారా.. కోర్సు ఔత్సాహికులు ఏ సమయంలో అయినా సంబంధిత లెక్చరర్స్‌ను సంప్రదించే వీలుంటుంది. సరిహద్దులతో సంబంధం లేకుండా అభ్యర్థులు తమకు ఇష్టమైన సంస్థలో అందుబాటులో ఉన్న కోర్సును అభ్యసించొచ్చు. ఉదాహరణకు హైదరాబాద్‌లో నివసిస్తున్న విద్యార్థి.. హార్వర్డ్ యూనివర్సిటీలో అందుబాటులో ఉన్న మూక్స్ కోర్సుల్లో పేరు నమోదు చేసుకుని సర్టిఫికెట్ అందుకోవచ్చు. ఇలా విదేశీ విద్యను అభ్యసించాలనే కోరిక కూడా నెరవేరుతుంది.
ముఖ్య విభాగాలు..
గత మూడేళ్లలో ప్రాథమిక దశలో ఉన్న మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్‌లో.. ప్రస్తుతం అధికశాతం సైన్స్, హ్యుమానిటీస్, ఆర్ట్స్ వంటి కోర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అప్లికేషన్ ఓరియెంటేషన్ కీలకంగా ఉండే.. ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ విభాగాల్లో సంఖ్య ఇంకా పెరగాల్సి ఉంది.
కావాల్సిన సదుపాయాలు..
ఈ విధానంలో కోర్సు అభ్యసించాలనుకునే విద్యార్థులకు ప్రాథమికంగా కావాల్సిన మౌలిక సదుపాయాలు.. ఇంటర్నెట్, జావా స్కిప్ట్ సాఫ్ట్వేర్, ఏవీ సాఫ్ట్వేర్స్, హెడ్‌ఫోన్స్. ఆధునిక టెక్నాలజీని అందిపుచ్చుకుని.. మరింత మంది విద్యార్థులను ఆకర్షించేందుకు మూక్స్ ప్రొవైడర్స్ ప్రయత్నిస్తోంది. ఈక్రమంలో ‘కోర్స్ ఎరా’ సంస్థ మూక్స్ కోర్సుల్లో నమోదు, లెక్చర్స్ వీక్షించడం వంటి సదుపాయాలను మొబైల్ ఫోన్ ద్వారా పొందే విధంగా అప్లికేషన్స్ రూపొందించింది.
గుర్తింపు పొందిన ప్రొవైడర్స్..
ప్రొవైడర్ : ఎడెక్స్
వెబ్సైట్: www.edx.org
పాల్గొనే యూనివర్సిటీలు: మిట్, హార్వర్డ్, యూసీ బెర్కిలీ, క్యోటో, ఆస్ట్రేలియన్ నేషనల్ వర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ క్వీన్స్లాండ్.
ప్రొవైడర్: కోర్స్ ఎరా
వెబ్సైట్: www.coursera.org
పాల్గొనే యూనివర్సిటీలు: స్టాన్‌ఫర్డ్, యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్, వార్టన్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ టోక్యో, వర్జీనియా.
ప్రొవైడర్: ఐవర్సిటీ
వెబ్సైట్: www.iversity.org
పాల్గొనే వర్సిటీలు: యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరెన్స్, యూనివర్సిటీ ఆఫ్ హాంబర్గ్
ప్రొవైడర్: ఫ్యూచర్ లెర్న్
వెబ్సైట్: www. futurelearn. com
పాల్గొనే వర్సిటీలు: యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్, ఓపెన్ యూనివర్సిటీ, మొనాష్, ట్రినిటీ కాలేజ్, డబ్లిన్, వార్విక్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ బాత్
ప్రొవైడర్: అకడెమిక్ ఎర్త్
వెబ్సైట్:www.academicearth.com
పాల్గొనే వర్సిటీలు: యూసీ బెర్కిలీ, యూసీఎల్ఏ, మిచిగాన్, ఆక్స్ఫర్డ్.