mukthiyar
-
ముక్తియార్‌తో ఆది చర్చలు
ప్రొద్దుటూరు టౌన్: మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపీ రమేష్‌నాయుడు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి వీఎస్ ముక్తియార్‌తో చర్చించేందుకు శనివారం రాత్రి ఆయన స్వగృహానికి వెళ్లారు. సాయంత్రం 7 గంటల నుంచి అర్ధరాత్రి వరకు చర్చలు జరిగాయి. సీఎం వద్దకు రావాలని, విషయం అక్కడ తేలుస్తామని ముక్తియార్‌ను తీవ్ర ఒత్తిడికి గురి చేశారు. ముక్తియార్ వద్ద ఉన్న 14 మంది కౌన్సిలర్లు ఆదివారం చైర్మన్ ఎన్నిక జరిగిన వెంటనే నేరుగా సీఎం వద్దకు వెళ్లవచ్చని చెప్పారు. ఇందుకు వారి నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. ముక్తియార్ గంటల కొద్దీ వారితో చర్చలు జరుపుతుంటే తట్టుకోలేకపోయిన కౌన్సిలర్లు ఒక్క సారిగా తామంతా ఎమ్మెల్యే వద్దకు వెళుతున్నామని కారు ఎక్కారు. వెళ్లాలనుకుంటే మీరు ఒక్కరే వెళ్లొచ్చని, తమదారి తాము చూసుకుంటామన్నారు. కాగా, ముక్తియార్‌కు టీడీపీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తామని మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపీ సీఎం రమేష్ హామీ ఇచ్చినట్లు తెలిసింది. ఈ విషయంపై స్పష్టత రాకపోవడంతో చర్చలను ఆదివారానికి వాయిదా వేశారు. ఆదివారం ఉదయం జరిగే చర్చలను బట్టి ముక్తియార్ వైఖరి స్పష్టం కానుంది. -
రసకందాయంలో రాజకీయం
– శిబిరానికి వెళ్లిన లింగారెడ్డి వర్గ 14 మంది కౌన్సిలర్లు – దిక్కుతోచని స్థితిలో వరదవర్గం – కీలకమైన వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ప్రొద్దుటూరు టౌన్: ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ పదవికి పోటీ మొదలైంది. టీడీపీలోనే వరద, లింగారెడ్డి వర్గాలుగా ఏర్పడిన కౌన్సిలర్లు ఎవరికి వారు బలాబాలాలు నిరూపించుకుంటున్నారు. లింగారెడ్డి వర్గానికి చెందిన 14 మంది శిబిరానికి వెళ్లడంతో వరద వర్గీయ కౌన్సిలర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. చైర్మన్ పదవిని ఎవరు చేపట్టాలన్నా వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ఓట్లే కీలకమయ్యాయి. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నికకు ఈనెల 15న అత్యవసర సమావేశాన్ని ఎన్నికల కమిషనర్ ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఉండేల గురివిరెడ్డితో చైర్మన్ పదవికి రాజీనామా చేయించిన టీడీపీ నాయకులు రెండో చైర్మన్ అభ్యర్థిగా ఆసం రఘురామిరెడ్డిని కేటాయించారు. ఆసం రఘురామిరెడ్డి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి వరదరాజులరెడ్డి వర్గీయుడు కావడంతో లింగారెడ్డి వర్గంలో ఉన్న విఎస్ ముక్తియార్‌తోపాటు టీడీపీకి చెందిన కౌన్సిలర్లు ఆరు మంది వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిన 7 మంది కౌన్సిలర్లు ఒక వర్గంగా ఏర్పడి శుక్రవారం ఉదయం శిబిరానికి వెళ్లారు. అంతా వరదరాజులరెడ్డి చూసుకుంటాడని మొదటి నుంచి చెబుతున్న ఆసం రఘురామిరెడ్డి షాక్‌కు గురయ్యాడు. అధిష్ఠానం చెబితే ముక్తియార్ వర్గం కూడా వింటుందని ఆశించిన వరద వర్గీయ కౌన్సిలర్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. వరదరాజులరెడ్డి చైర్మన్ అభ్యర్థిగా ఎవరిని నిలిపినా వ్యతిరేకిస్తామని టీడీపీ కౌన్సిలర్లు ఐదు మంది తేల్చి చెప్పడం చూస్తుంటే ఆసం రఘురామిరెడ్డికి చైర్మన్ సీటు దక్కుతుందన్న ఆశలు అడియాశలుగానే మిగలనున్నాయి. డబ్బే డబ్బు...: కొద్ది రోజుల క్రితం ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక్కో కౌన్సిలర్‌కు రూ.5లక్షలు నజరానా అందడం, ఇప్పుడు చైర్మన్ సీటుకు పోటీ ఏర్పడటంతో ఒక్కొక్కరికి రూ.10లక్షలకుపైగా ఇచ్చేందుకు శిబిరానికి వెళ్లిన వర్గం సిద్ధమైందని సమాచారం. అయితే వరద వర్గంలో ఉన్న ఆసం రఘురామిరెడ్డి ఏ ఒక్క కౌన్సిలర్‌తో కూడా ఈ సమయంలో చర్చించలేదని, అంతా అధిష్ఠానం పేరు చెప్పి తప్పించుకోవాలని చూస్తే ఎందుకు ఓటు వేయాలని కొందరు వరద వర్గ కౌన్సిలర్లు ప్రశ్నిస్తున్నారు. ఆదినారాయణరెడ్డి మంత్రి అయ్యాడు, ఆయన చెబితే ముక్తియార్ వర్గం కూడా వింటుందని చెప్పుకోవడం తప్ప వరద వర్గ కౌన్సిలర్లలో చైర్మన్ సీటు మాకే దక్కుతుందనే భరోసా కనిపించడం లేదు. కీలకమైన వైఎస్సార్సీపీ: ఎవరికి చైర్మన్ పదవి దక్కాలన్నా ఇప్పుడు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ల ఓట్లే కీలకమయ్యాయి. 9 మంది కౌన్సిలర్లతోపాటు ఒక ఓటు ఎక్స్ అఫిసియో మెంబర్ అయిన ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డికి ఉండటంతో మొత్తం 10 ఓట్లు ఉన్నాయి. ముక్తియార్ వర్గంలో 14 మంది కౌన్సిలర్లు ఉండగా వరద వర్గంలో 17 మంది కౌన్సిలర్లు ఉన్నారని చెప్పుకుంటున్నారు. వరదవర్గంలో చివరకు 10 మందే మిగులుతారని ముక్తియార్ సవాల్ చేశారు. ఈ పరిస్థితిని బట్టి చూస్తే ఎవరు చైర్మన్ సీటులో కూర్చోవాలన్నా వైఎస్సార్సీపీ కౌన్సిలర్లే కీలకమవుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆసం రఘురామిరెడ్డి చైర్మన్ అవుతాడన్న నమ్మకం లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందిలో ఉన్న కౌన్సిలర్లు వరద శిబిరానికే చేరుకోనున్నారు.