లారీ క్లీనర్ దారుణ హత్య
బిట్రగుంట, న్యూస్‌లైన్: మద్యం మత్తులో విచక్షణ కోల్పోయిన ఇద్దరు లారీ డ్రైవర్లు తమ వద్ద పనిచేసే క్లీనర్‌ను దారుణంగా హత్య చేశారు. పది మందీ చూస్తుండగానే కర్రలతో మోది, నేలకేసి బాది అత్యంత పాశవికంగా ప్రాణాలు తీశారు. కప్పరాళ్లతిప్ప కూడలిలో జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన ఈఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం మేరకు.. పశ్చిమ బె ంగాల్ నుంచి రెండు లారీలు టీపొడి లోడుతో బెంగళూరు వెళుతున్నాయి.
ఈ రెండు లారీలకు క్లీనర్‌గా అదే రాష్ట్రం హౌరాలోని బజ్రోనాథ్ లాహరి లేన్ ప్రాంతానికి చెందిన ముఖుల్ ఘాజీ (28), డ్రైవర్లుగా రఘునాథ్ రాయ్, హరేంద్ర సింగ్ ఉన్నారు. గౌరవరం దాబా హోటళ్ల వద్ద మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ముగ్గురూ కలసి పూటుగా మద్యం సేవించి భోజనాలు చేశారు. ఈ క్రమంలో క్లీనర్, డ్రైవర్లకు మధ్య ఏర్పడిన వివాదం ఘర్షణగా మారింది. లారీలు కప్పరాళ్లతిప్ప వద్దకు వచ్చేసరికి వివాదం పెద్దది కావడంతో తిప్ప వద్ద పోలీస్‌స్టేషన్‌కు కూత వేటు దూరంలోనే లారీలు నిలిపివేశారు. అనంతరం క్లీనర్ ముఖుల్ ఘాజీపై డ్రైవర్లు రఘునాథ్ రాయ్, హరేంద్ర సింగ్ దాడికి దిగారు. కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేశారు.
డ్రైవర్లు ఇద్దరూ క్లీనర్ కాళ్లు, చేతులూ పట్టుకుని నేలకేసి పలుమార్లు బాదటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషయం గమనించిన స్థానికులు, ఆటోడ్రైవర్లు పోలీసులకు సమాచారం అందించి క్లీనర్‌ను ఆటోలో కావలి ఏరియా ఆసుపత్రికి తరలించగా మృతిచెందినట్లు అక్కడి వైద్యులు నిర్ధారించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు డ్రైవర్లను అదుపులోకి తీసుకుని లారీలను స్టేషన్‌కు తరలించారు. ఎస్సై మాలకొండయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.