హైదరాబాద్‌లో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్
♦ 2019 నాటికి రెడీ అయ్యే చాన్స్
♦ కాకినాడ, కృష్ణపట్నంలో కూడా ఏర్పాటు చేస్తాం
♦ కంటైనర్ కార్పొరేషన్ సీజీఎం రవి వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (కాంకర్) హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్న మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ 2019 నాటికి సిద్ధం కానుంది. లింగంపల్లి సమీపంలోని నాగులపల్లి వద్ద ముంబై రైల్వే లైన్‌కు ఆనుకుని 100 ఎకరాల్లో ఇది రానుంది. ఇప్పటికే ఇక్కడ 16 ఎకరాల్లో కంటైనర్ టెర్మినల్‌ను కాంకర్ నిర్వహిస్తోంది. మిగిలిన స్థలం చేతికి రాగానే 24 నెలల్లో నిర్మాణం పూర్తి అవుతుందని కాంకర్ సీజీఎం జి.రవి కుమార్ చెప్పారు.
రైల్వేలైన్లు, గిడ్డంగులు, ఇతర వసతులకుగాను రూ.300 కోట్ల దాకా వ్యయం అవుతుందని అంచనాగా చెప్పారాయన. మారిటైమ్ గేట్‌వే మీడియా శుక్రవారం నిర్వహించిన స్మార్ట్ లాజిస్టిక్స్ సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. విశాఖపట్నంలో మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్ ఇటీవలే ప్రారంభమైందని గుర్తు చేశారు. ఇటువంటి పార్క్‌లు కాకినాడ, కృష్ణపట్నం వద్ద కూడా రానున్నాయని తెలిపారు. విశాఖపట్నం పార్క్‌కు రూ.300 కోట్లు ఖర్చు చేశారు. రెండో దశలో రూ.200 కోట్లు వ్యయం చేయనున్నారు.
అయిదేళ్లలో రూ.8,000 కోట్లు..
కాంకర్ ప్రస్తుతం 72 ప్రాంతాల్లో భారీ గిడ్డంగులతో కార్యకలాపాలు సాగిస్తోంది. మూడేళ్లలో 100 కేంద్రాలను చేరుకోనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మరో ఏడు ప్రాజెక్టులను పూర్తి చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 10–12 శాతం వ్యాపార వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేస్తోంది. మౌలిక వసతులు, ఐటీ వ్యవస్థ కోసం వచ్చే అయిదేళ్లలో కాంకర్ రూ.8,000 కోట్ల దాకా పెట్టుబడి పెడుతోంది. అంతర్గత వనరుల ద్వారా ఈ నిధులను వెచ్చించనుంది. ప్రస్తుతం సంస్థ గిడ్డంగుల సామర్థ్యం 40 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం ఉంది. 2020 నాటికి ఇది 1.5 కోట్ల చదరపు అడుగులకు చేరనుంది. జీఎస్టీ రాకతో రానున్న రోజుల్లో గిడ్డంగుల అవసరం పెరుగుతుందని కంపెనీ భావిస్తోంది. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో కంటైనర్ టెర్మినల్‌ను కాంకర్ నిర్వహిస్తోంది.