mumbai businessman
-
ప్రాణం తీసిన హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్
ముంబై: ముంబైలో గతవారం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్స చేయించుకున్న ఓ వ్యాపారవేత్త ఆ తర్వాత 40 గంటల్లోనే మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శ్రావణ్ చౌదరి అనే వ్యాపారవేత్త (43) మార్చి 7న ఈ చికిత్స చేయించుకున్నారు. ఆపరేషన్ 12 గంటలు సాగింది. ఆ తర్వాత ఇంటికెళ్లారు. తర్వాత శ్వాస, గొంతు, ముఖం వాపు సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తన సలహాను కాదని ఒకేసారి 9,000 వెంట్రుకలను పెట్టించుకున్నాడని, సాధారణంగా ఒకేసారి 3,000 వెంట్రుకలు పెట్టకూడదని వైద్యుడు పోలీసులకు తెలిపారు. పోలీసులు ప్రమాదవశాత్తూ సంభవించిన మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. -
రూ.510 కోసం రూ.10 లక్షలు పోగొట్టుకున్నాడు
ముంబై : రూ.510 కోసం కారు దిగితే.. రూ.10 లక్షల విలువైన డైమాండ్స్‌ను పోగొట్టుకున్నాడు ఓ వ్యాపారవేత్త. వివరాల్లోకి వెళ్తే... దక్షిణ ముంబైలో ఓ వ్యాపారవేత్త తన కారులో కూర్చుని ఉన్నాడు. ఆయన్ను సమీపించిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు, తన కారు బయట డబ్బులు పడి ఉన్నాయని, తమకు చెందినవే అని అడిగారు. ఆ డబ్బుల కోసం కారు దిగిన వ్యాపారవేత్తకు ఆ దొంగలు దిమ్మతిరిగే షాకిచ్చారు. రూ.510 కోసం అతను కారు దిగగానే.. వెంటనే వెనక డోరును తెరుచుకుని, సీటులో ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకుని వెళ్లారు. ఈ బ్యాగులో రూ.10 లక్షల విలువైన డైమాండ్స్‌ను ఉన్నట్టు బాధితుడు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇదే రకమైన దొంగతనం కేసు సమ్తా నగర్ పోలీసుల స్టేషన్లో కూడా నమోదైంది. ఆ ఘటనలో వ్యాపారవేత్త రూ.2.5 లక్షల నగదును, లైసెన్స్డ్ గన్ను పోగొట్టుకున్నట్టు తెలిసింది. రూ.10, రూ.20కు చెందిన కొన్ని నోట్లు అంటే మొత్తం రూ.510 విలువైన డబ్బులు వ్యాపారవేత్త కారుకు వెలుపల పడేసి ఉన్నాయని, ఇవి తన డబ్బులేనా? అని వారు అతని అడిగారని డీబీ మార్గ్ పోలీసు స్టేషన్ ఆఫీసర్ చెప్పారు. డబ్బుల్ని చూసిన ఆ వ్యాపారవేత్త, కారు దిగాడని, అంతలోనే గ్యాంగ్ సభ్యుల్లో ఒకరు వెనుక డోరు తెరచి, బ్యాగ్‌ను తీసుకొని పారిపోయాడని తెలిసింది. వారు కొట్టేసిన అనంతరం తన వెనుక సీట్లో ఉన్న బ్యాగ్ పోయినట్టు వ్యాపారవేత్త గుర్తించాడని పోలీసు అధికారి పేర్కొన్నారు. సమ్తా నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో కూడా ఇదే మాదిరి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి, కారు బయట డబ్బులు పడి ఉన్నాయని చెప్పి, నగదును కొట్టేసుకుని వెళ్లారని తెలిసింది. -
ఆయన గుండెలో 90 లక్షల పరికరం!
గుండె.. ఎవరికైనా ముఖ్యమే. అలాంటి గుండె సరిగా పనిచేయకపోతే దాన్ని రిపేరు చేయించడానికి ఎంత మొత్తమైనా వెచ్చించేందుకు సిద్ధపడతాం. ముంబై నగరానికి చెందిన ఓ వ్యాపారవేత్త అలాగే తన గుండె బాగు చేయించుకోడానికి ఏకంగా గుండెలో రూ. 90 లక్షల విలువచేసే పరికరాన్ని పెట్టించుకున్నారు. వాస్తవానికి దానికంటే గుండె మార్పిడి చేయించుకుంటే అందులో మూడోవంతే ఖర్చయ్యేది, చికిత్స కూడా చాలా సులభంగా అయిపోయేది. కానీ దోషి (49) అనే ఆ వ్యాపారికి టీబీ కూడా ఉంది. దాంతో గుండె మార్పిడి కష్టం అయ్యింది. అతడి ఊపిరితిత్తుల మీద ఒత్తిడి చాలా ఎక్కువగా ఉందని దోషికి ఆపరేషన్ చేసిన డాక్టర్ అన్వే మూలే తెలిపారు. ఐదేళ్ల క్రితం దోషికి హార్ట్ ఎటాక్ వచ్చింది. దాంతో అతడికి హార్ట్ ఫెయిల్యూర్ కూడా ఏర్పడింది. తాను 30 కిలోల బరువు కోల్పోయానని, కనీసం నిలబడేందుకు కూడా వీలయ్యేది కాదని దోషి చెప్పారు. అత్యంత ఖరీదైన లెఫ్ట్ వెంట్రిక్యులర్ అసిస్ట్ డివైజ్ (ఎల్వీఏడీ) అనే పరికరాన్ని అతడికి అమర్చారు. అది భుజాల మీదుగా నల్లటి బ్యాగ్‌లా ఆ పరికరం కనిపిస్తుంది. ముంబైలోని ఫోర్టిస్ ఆస్పత్రిలో ఈ పరికరాన్ని అమర్చారు. తొమ్మిది నెలల క్రితం ఓ మహిళకు కూడా ఇలాంటి పరికరాన్నే అమర్చారు. అయితే ఆమె కొద్దిరోజులకే మరణించారు. కానీ దోషికి అమర్చినది మాత్రం విజయవంతమైందని, దాంతో హార్ట్ ఫెయిల్యూర్ కేసుల చికిత్సకు ఇప్పుడు సరికొత్త మార్గం కనిపించిందని డాక్టర్ మూలే తెలిపారు. ఎల్వీఏడీ అనేది కృత్రిమ గుండె కాదని, ఉన్న గుండెను మెరుగ్గా పనిచేయించడానికి ఉపయోగపడే పరికరం మాత్రమేనని వివరించారు.