
ముంబై: ముంబైలో గతవారం హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ శస్త్రచికిత్స చేయించుకున్న ఓ వ్యాపారవేత్త ఆ తర్వాత 40 గంటల్లోనే మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. శ్రావణ్ చౌదరి అనే వ్యాపారవేత్త (43) మార్చి 7న ఈ చికిత్స చేయించుకున్నారు. ఆపరేషన్ 12 గంటలు సాగింది. ఆ తర్వాత ఇంటికెళ్లారు. తర్వాత శ్వాస, గొంతు, ముఖం వాపు సమస్యలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. తన సలహాను కాదని ఒకేసారి 9,000 వెంట్రుకలను పెట్టించుకున్నాడని, సాధారణంగా ఒకేసారి 3,000 వెంట్రుకలు పెట్టకూడదని వైద్యుడు పోలీసులకు తెలిపారు. పోలీసులు ప్రమాదవశాత్తూ సంభవించిన మరణంగా కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.