ముంబై : రూ.510 కోసం కారు దిగితే.. రూ.10 లక్షల విలువైన డైమాండ్స్‌ను పోగొట్టుకున్నాడు ఓ వ్యాపారవేత్త. వివరాల్లోకి వెళ్తే... దక్షిణ ముంబైలో ఓ వ్యాపారవేత్త తన కారులో కూర్చుని ఉన్నాడు. ఆయన్ను సమీపించిన నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు, తన కారు బయట డబ్బులు పడి ఉన్నాయని, తమకు చెందినవే అని అడిగారు. ఆ డబ్బుల కోసం కారు దిగిన వ్యాపారవేత్తకు ఆ దొంగలు దిమ్మతిరిగే షాకిచ్చారు. రూ.510 కోసం అతను కారు దిగగానే.. వెంటనే వెనక డోరును తెరుచుకుని, సీటులో ఉన్న బ్యాగ్‌ను ఎత్తుకుని వెళ్లారు. ఈ బ్యాగులో రూ.10 లక్షల విలువైన డైమాండ్స్‌ను ఉన్నట్టు బాధితుడు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఇదే రకమైన దొంగతనం కేసు సమ్తా నగర్ పోలీసుల స్టేషన్‌లో కూడా నమోదైంది. ఆ ఘటనలో వ్యాపారవేత్త రూ.2.5 లక్షల నగదును, లైసెన్స్‌డ్ గన్‌ను పోగొట్టుకున్నట్టు తెలిసింది.
రూ.10, రూ.20కు చెందిన కొన్ని నోట్లు అంటే మొత్తం రూ.510 విలువైన డబ్బులు వ్యాపారవేత్త కారుకు వెలుపల పడేసి ఉన్నాయని, ఇవి తన డబ్బులేనా? అని వారు అతని అడిగారని డీబీ మార్గ్ పోలీసు స్టేషన్ ఆఫీసర్ చెప్పారు. డబ్బుల్ని చూసిన ఆ వ్యాపారవేత్త, కారు దిగాడని, అంతలోనే గ్యాంగ్ సభ్యుల్లో ఒకరు వెనుక డోరు తెరచి, బ్యాగ్‌ను తీసుకొని పారిపోయాడని తెలిసింది. వారు కొట్టేసిన అనంతరం తన వెనుక సీట్‌లో ఉన్న బ్యాగ్ పోయినట్టు వ్యాపారవేత్త గుర్తించాడని పోలీసు అధికారి పేర్కొన్నారు. సమ్తా నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో కూడా ఇదే మాదిరి గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి, కారు బయట డబ్బులు పడి ఉన్నాయని చెప్పి, నగదును కొట్టేసుకుని వెళ్లారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment