పోలీసును కదా.. తొక్కించేస్తే పోలా!
పోలీసు ఉద్యోగం చేతిలో ఉంది కదా.. ఏం చేసినా చెల్లుతుందని అనుకున్నాడు. డబ్బు తగాదాలు ఉండటంతో ఓ వ్యాపారి మీదకు కారు పోనిచ్చాడు. ఆ వ్యవహారం మొత్తం సీసీటీవీ కెమెరాకు చిక్కింది. దాంతో ముంబైలో పనిచేసే ఆ పోలీసు కానిస్టేబుల్ మీద కేసు నమోదైంది. ముంబై క్రైం బ్రాంచిలో పనిచేసే రమేష్ అవ్తే అనే కానిస్టేబుల్.. ఇటీవల థానె నగరంలో తన కారుతో అతుల్ పెతె అనే వ్యాపారిని తొక్కించేందుకు ప్రయత్నించాడు. వాళ్లిద్దరికీ కలిపి ఒక ఐస్ క్రీం షాపు ఉంది. ఇద్దరూ స్నేహితులే. అయితే ఆర్థిక సంబంధిత విషయాలలో ఇద్దరికీ ఏదో గొడవ వచ్చింది.
ఏప్రిల్ 21వ తేదీన రమేష్ అవ్తే.. థానెలోని నౌపడ ప్రాంతంలో ఉన్న పెతె దుకాణానికి వచ్చి అతడిని తిట్టడం మొదలుపెట్టాడు. తర్వాత ఏకంగా తన కారుతో అతడిని తొక్కించేయడానికి ప్రయత్నించి, అతడున్నవైపు కారు పోనిచ్చాడు. అయితే అదృష్టవశాత్తు పెతె ఆ కారు మీదకు ఎక్కి, ప్రాణాలు కాపాడుకున్నాడు. కొంతదూరం అలాగే కారు వెళ్లిపోయింది. దాంతో పెతెకు స్వల్పంగా గాయాలయ్యాయి. ప్రస్తుతానికి అవ్తే మీద కేసు నమోదు చేసిన పోలీసులు.. అతడిని పట్టుకోడానికి ప్రయత్నిస్తున్నారు.