అనుమతి ఎందుకు తీసుకోలేదు
ముంబై: దేశంలో మొట్టమొదటిసారిగా మానవరహిత ద్రోన్ను ఉపయోగించి పిజ్జాను డెలివరీ చేసిన ఫ్రాన్సెస్కోస్ పిజ్జేరియాపై పోలీసుల నిఘా పడింది. ద్రోన్ ద్వారా పిజ్జా డెలివరీ ప్రయోగం చేసే ముందు తమకెందుకు సమాచారం అందించలేదని మంబై పోలీసులు పిజ్జా సెంటర్‌ను ప్రశ్నించారు. వెంటనే దీనిపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. పిజ్జా సెంటర్‌తో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఎటీసీ)ని కూడా పోలీసుల ప్రశ్నించారు. అయితే పిజ్జా సెంటర్ ఏటీసీ నుంచి అనుమతి తీసుకన్నది, లేనిది తమకు తెలియదని సంస్థ అధికారి ఒకరు తెలిపారు. అయితే నిబంధనల అనుసారం ఏదైనా ఆకాశంలో ఎగురవేయాల్సి ఉన్నప్పుడు అనుమతులు తప్పనిసరి అని, అలా చేయని ఆ పిజ్జా సెంటర్ వివరణ కోరతామని ఆయన తెలిపారు.
అయితే ద్రోన్ పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగామని మధ్య ప్రాంత అడిషనల్ పోలీస్ కమిషనర్ మధుకర్ పాండే తెలిపారు. అన్ని కోణాలను అధ్యయనం చేసిన తరువాత భవిష్యత్ చర్యలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటికే నగరానికి ఉగ్రవాద ముపునప పొంచి ఉన్నాయి. ఇలాంటి మానవరహిత ద్రోన్స్ ద్వారా ఇతర పద్ధతుల్లో ఉగ్రవాదులు దాడులు చేయొచ్చన్న సమాచారం పోలీసులకు అందింది. దీంతో ప్రత్యేక రోజులైన స్వాత్రంత్య, గణతంత్ర దినోత్సవాలను నగరాన్ని నో ఫ్లైయింగ్ జోన్‌గా పోలీసులు ప్రకటించారు.
అయితే మన దేశంలో తొలిసారిగా ద్రోన్ ద్వారా పిజ్జా డెలివరీ చేసే ప్రయోగాన్ని ఈ నెల 11న ముంబైకి చెందిన ఫ్రాన్సెస్కోస్ పిజ్జేరియా వారు విజయవంతంగా నిర్వహించారు. వీరు పంపిన ద్రోన్ ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలోని ఓ ఇంట్లో వినియోగదారుడికి పిజ్జాను అందించింది. ద్రోన్ విలువ 1.20 లక్షల రూపాయలు.