Mumbai heavy rains
-
ముంబై మునిగింది!
-
ముంబై మునిగింది!
ముంబై: గత నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ముంబై మహానగరాన్ని ముంచెత్తాయి. మంగళవారం ఉదయం కూడా భారీ వర్షం కురుస్తుండటంతో జనజీవనం స్థంభించింది. కనీస సౌకర్యాలు తీర్చుకోవడానికి కూడా ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. మరోవైపు శిధిలావస్థకు చేరిన భవనాలు కూలుతున్నాయి. ముంబైతోపాటు, కళ్యాణ్, పుణెలలో సంరక్షణ గోడలు కూలడంతో సుమారు 22మంది మరణించారు. భారీ వర్షాలకు రోడ్డు, రైలు, విమాన సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం సెలవు ప్రకటించింది. ఇక చాలా మంది సాయం కోసం ట్విటర్ వేదికగా అభ్యర్థిస్తున్నారు. ప్రస్తుతం #MumbaiRains అనే ట్యాగ్ ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. తెరుచుకోని స్కూళ్లు.. వర్షం దెబ్బకు ముంబై, థానె, న్యూ ముంబైలోని పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోలేదు. లోకల్ ట్రైన్స్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ముందు జాగ్రత్తగా ఎక్స్‌ప్రెస్ రైళ్లను తాత్కలికంగా నిలిపివేశారు. 54 విమాన సర్వీసులను సమీపంలోని విమానాశ్రయాలకు మళ్లించారు. చాలా ప్రాంతాల్లో రోడ్లన్నీ జలమయమయ్యాయి. సహాయక బృందాలు బరిలోకి దిగాయి. జలమయమైన కుర్లాస్ క్రాంతినగర్‌లోని సుమారు వెయ్యిమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక గతేడాది వర్షపాతాన్ని ప్రస్తుత వర్షాలు అధిగమించాయిని అధికారులు పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ముఖ్యమంత్రి సమీక్ష.. ఎడతెరపిలేని వర్షాలతో మహారాష్ట్ర సీఎం దేవంద్ర ఫడ్నవిస్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) అధికారులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. బీఎంసీ కంట్రోల్ రూమ్‌కు వచ్చిన ఆయన పరిస్థితిని సమీక్షించారు. సహాయక చర్యలపై ఆరా తీసారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘పరిస్థితి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. గత రాత్రి ముంబై పోలీసులకు ప్రజల నుంచి సహాయం 1600-1700 ట్వీట్లు వచ్చాయి. వెంటనే వారు స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. బీఎంసీ, విపత్తు శాఖ అధికారులు గత రాత్రిగా పనిచేస్తూనే ఉన్నారు. మరో రెండు రోజులు ఈ వర్షాలు ఇలానే ఉండవచ్చు. దానికి దగ్గట్లు మేం సిద్దమయ్యాం. రాత్రే పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించాం. పరిస్థితి తీవ్రం కావడంతో ఉదయం ఆఫీసులకు కూడా సెలవును వర్తింపజేశాం. పోలీసు, విపత్తు, బీఎంసీ శాఖలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. ట్రాఫిక్ కంట్రోల్ ఉంది. వర్షాలతో కొన్ని చోట్ల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మలాద్‌లో గోడ కూలి సుమారు 13 మంది మరణించగా.. 30 నుంచి 40 మంది చనిపోయారు. క్షతగాత్రులను నేను కలిసి పరామర్శించాను. లోకల్ ట్రైన్స్ రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పట్టాలన్నీ నీటితో మునిగిపోయాయి. రైళ్ల పునరుద్ధరణ కోసం అధికారులు శ్రమిస్తున్నారు.’ అని ఫడ్నవీస్ తెలిపారు. చదవండి : వర్షాలకు 22మంది మృతి -
ముంబైలో కుండపోత
-
ముంబైలో కుండపోత
183 విమానాలు రద్దు, 51 విమానాల దారి మళ్లింపు ముంబై/హైదరాబాద్: దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు దక్షిణ ముంబై, బోరివలీ, కాందివలీ, అంధేరీ, భందూప్ తదితర ప్రాంతాలు నీటమునిగాయి. భారీవర్షాల ప్రభావంతో దాదాపు 183 విమానాలు రద్దు కాగా, 51 విమానాలను దారి మళ్లించినట్లు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు విమానాశ్రయంలో విమానాల రాకపోకలపై నిషేధం విధించామన్నారు. వారణాసి నుంచి 183 మంది ప్రయాణికులతో బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వే నుంచి పక్కకు జారిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీగా వరదనీరు నిలిచిపోవడంతో ముంబైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని బృహన్ ముంబై కార్పొరేషన్ ఆదేశించింది. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల వరకు 303.7 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు శాంతాక్రుజ్‌లోని భారత వాతావరణ విభాగానికి చెందిన అబ్జర్వేటరీ తెలిపింది. బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. కాగా పాల్ఘర్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఐదుగురు దుర్మరణం చెందినట్లు వెల్లడించారు. భారీ వర్షాలు, వరదల ప్రభావంతో మన్మాడ్–ముంబై ఎక్స్‌ప్రెస్, గుజరాత్ ఎక్స్‌ప్రెస్, సౌరాష్ట్ర ఎక్స్‌ప్రెస్, బాంద్రా టెర్మినస్ సూరత్ ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్, ముంబై సెంట్రల్–అహ్మదాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. మరోవైపు వరద ప్రభావంతో చాలా సబర్బన్ రైళ్లు రద్దు కావడంతో తమ సేవల్ని నిలిపివేస్తున్నట్లు డబ్బావాలాలు ప్రకటించారు. శంషాబాద్ విమానాశ్రయంలో... భారీ వర్షాలతో ముంబై ఎయిర్పోర్ట్ రన్‌వేను మూసివేయడంతో అధికారులు 16 దేశీయ, అంతర్జాతీయ విమానాలను శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. పదహారు విమానాల్లో వచ్చిన దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయంలో, నోవాటెల్, తదితర హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. నిలిచిపోయిన విమానాలు: జూరిచ్–ముంబై (ఎల్ఎక్స్ 154, కౌలాలంపూర్–ముంబై (ఎంహెచ్ 194), లండన్–ముంబై (9డబ్ల్యూ 119), ఆమ్స్టర్డ్యామ్–ముంబై (9 డబ్ల్యూ 231), బెంగళూరు–ముంబై (ఏఐ610), కొచ్చి–ముంబై (9 డబ్ల్యూ 404), ఢిల్లీ–ముంబై (9డబ్ల్యూ 376), బెంగళూరు –ముంబై (9డబ్ల్యూ442), రాజ్‌కోట్–ముంబై (ఏఐ 656), ఢిల్లీ–ముంబై (ఏఐ 191), టొరంటో–ముంబై (ఏసీ 046), ఢిల్లీ–ముంబై (9డబ్ల్యూ 354), జైపూర్–ముంబై (9డబ్ల్యూ 2054), హైదరాబాద్–పుణే–ముంబై (9 డబ్ల్యూ 2574), కోల్‌కతా–ముంబై (9డబ్ల్యూ 628), కోల్‌కతా–ముంబై (9డబ్ల్యూ 616).