
ముంబైలో కుండపోత
183 విమానాలు రద్దు, 51 విమానాల దారి మళ్లింపు
ముంబై/హైదరాబాద్: దేశ ఆర్థిక రాజధాని ముంబైని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు దక్షిణ ముంబై, బోరివలీ, కాందివలీ, అంధేరీ, భందూప్ తదితర ప్రాంతాలు నీటమునిగాయి. భారీవర్షాల ప్రభావంతో దాదాపు 183 విమానాలు రద్దు కాగా, 51 విమానాలను దారి మళ్లించినట్లు ముంబై అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలిపారు. బుధవారం సాయంత్రం 6 గంటల వరకు విమానాశ్రయంలో విమానాల రాకపోకలపై నిషేధం విధించామన్నారు.
వారణాసి నుంచి 183 మంది ప్రయాణికులతో బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అవుతున్న సమయంలో రన్‌వే నుంచి పక్కకు జారిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. భారీగా వరదనీరు నిలిచిపోవడంతో ముంబైతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే పాఠశాలలు, కళాశాలలను మూసివేయాలని బృహన్ ముంబై కార్పొరేషన్ ఆదేశించింది. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల వరకు 303.7 మి.మీ. వర్షపాతం నమోదైనట్లు శాంతాక్రుజ్‌లోని భారత వాతావరణ విభాగానికి చెందిన అబ్జర్వేటరీ తెలిపింది.
బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. కాగా పాల్ఘర్ జిల్లాలో వేర్వేరు ఘటనల్లో ఐదుగురు దుర్మరణం చెందినట్లు వెల్లడించారు. భారీ వర్షాలు, వరదల ప్రభావంతో మన్మాడ్–ముంబై ఎక్స్‌ప్రెస్, గుజరాత్ ఎక్స్‌ప్రెస్, సౌరాష్ట్ర ఎక్స్‌ప్రెస్, బాంద్రా టెర్మినస్ సూరత్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్, ముంబై సెంట్రల్–అహ్మదాబాద్ శతాబ్ది ఎక్స్‌ప్రెస్ సర్వీసులను రద్దు చేసినట్లు రైల్వేశాఖ తెలిపింది. మరోవైపు వరద ప్రభావంతో చాలా సబర్బన్ రైళ్లు రద్దు కావడంతో తమ సేవల్ని నిలిపివేస్తున్నట్లు డబ్బావాలాలు ప్రకటించారు.
శంషాబాద్ విమానాశ్రయంలో...
భారీ వర్షాలతో ముంబై ఎయిర్‌పోర్ట్ రన్‌వేను మూసివేయడంతో అధికారులు 16 దేశీయ, అంతర్జాతీయ విమానాలను శంషాబాద్ విమానాశ్రయానికి మళ్లించారు. పదహారు విమానాల్లో వచ్చిన దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులకు శంషాబాద్ విమానాశ్రయంలో, నోవాటెల్, తదితర హోటళ్లలో బస ఏర్పాటు చేశారు.
నిలిచిపోయిన విమానాలు:
జూరిచ్–ముంబై (ఎల్‌ఎక్స్ 154, కౌలాలంపూర్–ముంబై (ఎంహెచ్ 194), లండన్–ముంబై (9డబ్ల్యూ 119), ఆమ్‌స్టర్‌డ్యామ్–ముంబై (9 డబ్ల్యూ 231), బెంగళూరు–ముంబై (ఏఐ610), కొచ్చి–ముంబై (9 డబ్ల్యూ 404), ఢిల్లీ–ముంబై (9డబ్ల్యూ 376), బెంగళూరు –ముంబై (9డబ్ల్యూ442), రాజ్‌కోట్–ముంబై (ఏఐ 656), ఢిల్లీ–ముంబై (ఏఐ 191), టొరంటో–ముంబై (ఏసీ 046), ఢిల్లీ–ముంబై (9డబ్ల్యూ 354), జైపూర్–ముంబై (9డబ్ల్యూ 2054), హైదరాబాద్–పుణే–ముంబై (9 డబ్ల్యూ 2574), కోల్‌కతా–ముంబై (9డబ్ల్యూ 628), కోల్‌కతా–ముంబై (9డబ్ల్యూ 616).