ముంబైకి రెండో విజయం
ముంబై: ‘తురుపుముక్క’ లీ చోంగ్ వీ బరిలోకి దిగడంతో ముంబై మాస్టర్స్ జట్టు మెరిసింది. గాయం కారణంగా తొలి రెండు లీగ్ మ్యాచ్‌లకు దూరంగా ఉన్న ఈ ప్రపంచ నంబర్‌వన్ మూడో మ్యాచ్‌కు అందుబాటులోకి వచ్చాడు. దాంతో ముంబై మాస్టర్స్ ఒక్కసారిగా బలోపేతమైంది. ఫలితంగా ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్)లో రెండో విజయాన్ని నమోదు చేసింది.
ఢిల్లీ స్మాషర్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో ముంబై మాస్టర్స్ 4-1తో గెలిచింది. ‘మాస్టర్ బ్లాస్టర్’ సచిన్ టెండూల్కర్, భారత జట్టు మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ సతీసమేతంగా... టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతి తదితరులు ఈ పోటీని తిలకించారు. పురుషుల తొలి సింగిల్స్‌లో లీ చోంగ్ వీ (ముంబై) 21-12, 21-16తో డారెన్ లియూ (ఢిల్లీ)ను ఓడించి ‘మాస్టర్స్’ జట్టుకు శుభారంభం అందించాడు. రెండో మ్యాచ్‌లో ఆల్ ఇంగ్లండ్ మాజీ చాంపియన్, మాజీ నంబర్‌వన్ టిన్ బౌన్ 21-11, 21-13తో అరుంధతి పంతవానె (ఢిల్లీ)పై అలవోకగా గెలిచింది.
డబుల్స్ మ్యాచ్‌లో కీన్ కీట్ కూ-తాన్ బూన్ హోయెంగ్ (ఢిల్లీ) జోడి 14-21, 21-15, 11-7తో సుమీత్ రెడ్డి-మనూ అత్రి (ముంబై) ద్వయంపై గెలిచింది. అయితే నాలుగో మ్యాచ్‌గా జరిగిన పురుషుల సింగిల్స్ రెండో మ్యాచ్‌లో ప్రపంచ 12వ ర్యాంకర్ మార్క్ జ్విబ్లెర్ 18-21, 21-10, 11-9తో సాయిప్రణీత్ (ఢిల్లీ)పై నెగ్గడంతో ముంబై విజయం ఖాయమైంది. చివరిదైన మిక్స్డ్ డబుల్స్‌లో లీ చోంగ్ వీ-టిన్ బౌన్ జంట 21-18, 15-21, 11-5తో దిజు-ప్రజక్తా సావంత్ జోడిపై గెలవడంతో ముంబై 4-1తో పోటీని సొంతం చేసుకుంది. ఈ గెలుపుతో ముంబై 11 పాయింట్లతో హైదరాబాద్ హాట్‌షాట్స్‌తో కలిసి సంయుక్తంగా అగ్రస్థానానికి చేరుకుంది. బుధవారం విశ్రాంతి దినం.
నంబర్‌వన్ ఆట...
బరిలోకి దిగిన తొలి మ్యాచ్‌లోనే లీ చోంగ్ వీ తన స్థాయికి తగ్గ ఆటతీరుతో అందర్నీ అలరించాడు. కళ్లు చెదిరే స్మాష్‌లు... సమయానుకూలంగా డ్రాప్ షాట్లు... నెట్‌వద్ద దూకుడు... మొత్తానికి మ్యాచ్‌ను ఏకపక్షంగా మార్చేశాడు. తొలి రెండు నిమిషాల్లో 7-2తో ఆధిక్యంలోకి వెళ్లిన ఈ మలేసియా దిగ్గజం ఆ తర్వాత దూకుడును మరింత పెంచాడు. వరుసగా ఎనిమిది పాయింట్లు నెగ్గి 20-10తో ముందంజ వేసి అదే జోరులో తొలి గేమ్‌ను 15 నిమిషాల్లో దక్కించుకున్నాడు. రెండో గేమ్‌లో లీ చోంగ్ వీ కాస్త నెమ్మదించడంతో డారెన్ లీ కొన్ని పాయింట్లు రాబట్టాడు. అయితే కీలకదశలో లీ చోంగ్ వీ చెలరేగి మ్యాచ్‌ను ముగించాడు. మ్యాచ్ అనంతరం సచిన్ టెండూల్కర్ మైదానంలోకి వచ్చి లీ చోంగ్ వీతో ముచ్చటించాడు.