మహారాష్ట్రపై చిన్నచూపు
సాక్షి, ముంబై: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ముంబై భద్రతను గాలికి వదిలేసి గుజరాత్‌కు ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర హోం శాఖ మంత్రి ఆర్.ఆర్.పాటిల్ ఆరోపించారు. రాష్ట్రంలో ఇటీవల కొత్తగా అవతరించిన పాల్ఘర్ జిల్లాలో ఏర్పాటు చేయదలచిన ‘నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కోస్టల్ పోలిసింగ్’ (ఎన్‌ఐసీపీ) కేంద్రాన్ని గుజరాత్‌కు తరలించేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై పాటిల్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ మోడీ వైఖరిపై మండిపడ్డారు. మహారాష్ట్రపై సవతి తల్లి ధోరణి అవలంభిస్తున్నారని, తన సొంత రాష్ట్రంపై ప్రేమ ఒలకబోస్తున్నారని పరోక్షంగా మోడీపై ఆరోపణలు చేశారు.
ముంబై భద్రతను కేంద్రం సీరియస్‌గా తీసుకోవడం లేదని ఆరోపించారు. తీర ప్రాంతాల భద్రత కోసం మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో ఎన్‌ఐసీపీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని యూపీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా క్యాబినెట్ సమావేశం నిర్వహించింది. ఈ కేంద్రం ఏర్పాటుకు అవసరమైన305 ఎకరాల స్థలాన్ని నామమాత్రపు ధరకే సమకూర్చి ఇచ్చింది. కాని ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన కొత్త ప్రభుత్వం ఈ కేంద్రాన్ని గుజరాత్‌లోని ద్వారకాలో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
‘ముంబైపై ఇదివరకే అనేకసార్లు ఉగ్రవాదులు దాడులు జరిపారు.. ఎంతో ప్రాణ, ఆస్తి నష్టం జరిగింది.. ఇప్పటికీ నగరం హిట్ లిస్టులో ఉందని నిఘా సంస్థలు హెచ్చరిస్తున్నాయి.. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ కేంద్రాన్ని పాల్ఘర్లో నిర్మించేందుకు యూపీఏ సర్కార్ నిర్ణయం తీసుకుంది.. కాని ఢిల్లీలోని కొత్త ప్రభుత్వం ఎలాంటి కారణాలు చూపకుండానే ఈ కీలకమైన కేంద్రాన్ని గుజరాత్‌కు తరలించాలని నిర్ణయం తీసుకోవడంలో ఉద్ధేశ్యమేమిట’ని పాటిల్ నిలదీశారు.
అప్పటి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎందుకు నిరాకరించింది. ఎన్‌ఐసీపీ సంస్థ ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సమకూర్చి ఇచ్చినందున దాన్ని ఇప్పుడు మరో రాష్ట్రానికి తరలించాలని చూడటం నియమాలకు విరుద్ధమని పాటిల్ స్పష్టం చేశారు. కాని కేంద్రం దీనిపై ఏమీ స్పష్టం చేయకుండా గుజరాత్‌కు తరలిస్తోందని ఆయన ఆరోపించారు.